స్టాక్ ఎక్స్‌ఛేంజి అంటేనే ఓ పెద్ద మాయాజాలం. అటువంటి స్టాక్‌మార్కెట్‌లో కుంభకోణాలు చోటు చేసుకుంటే పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందో ఊహించుకోవచ్చు. నయా ఉదారవాద విధానాల యుగంలో స్టాక్ మార్కెట్‌లో అతి పెద్ద కుంభకోణంగా ఇంతవరకు పిలువబడుతున్న హర్షద్ మెహతా కుంభకోణాన్ని తలదన్నే రీతిలో చిత్ర స్కామ్ చోటుచేసుకుంది. నేషనల్ స్టాక్ ఎక్స్‌ఛేంజి (ఎన్‌ఎస్‌ఇ)కి సారథ్యం వహించిన చిత్ర రామక్రిష్ణ అనే వ్యక్తి ఎంతో గోప్యంగా ఉంచాల్సిన సమాచారాన్ని గుర్తు తెలియని ఓ 'యోగి పుంగవుడి'కి గుట్టుగా అందజేయడం ద్వారా స్టాక్ మార్కెట్లను, రిటైల్ మదుపరులను పెద్దయెత్తున నష్టపరిచారు. తన చర్యను సమర్థించుకోవడానికి ఓ యోగి (గుర్తు తెలియని వ్యక్తి) మార్గదర్శకత్వంలో నిర్ణయాలు తీసుకున్నానని ఆమె చెప్పడం వింతల్లో కెల్లా వింత. అతడిరి అత్యంత విలువైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఇ-మెయిల్ ద్వారా చేరవేయడం, ఎన్‌ఎస్‌ఇకి ముక్కూ మొహం తెలియని ఆనంద్ సుబ్రమణియన్ అనే వ్యక్తిని ఆ యోగి తరపున ఎన్‌ఎస్‌ఇ ఆపరేటింగ్ అధికారిగా నియమించుకుని భారీగా వేతనం చెల్లించడం వంటి అంశాలు యావజ్జాతిని నివ్వెరపరస్తున్నాయి. నెల రోజులకు పైగా దర్యాప్తు జరిపి 190 పేజీలతో సెబీ రూపొందించిన ఆ నివేదిక చిత్ర రామక్రిష్ణ కుంభకోణంలో కొన్ని పార్శ్యాలను మాత్రమే తడిమింది. స్వేచ్ఛామార్కెట్ ఫిలాసఫీ బూటకత్వాన్ని ఇది ఒక మేరకు మాత్రమే బయటపెట్టింది. సెబి నివేదిక బయట పెట్టని నిజాలు ఇంకా చాలానే ఉండొచ్చు. చిత్ర ఎన్‌ఎస్‌ఇ ఎండిగా తప్పుకున్న అయిదేళ్లకు గానీ సెబి కళ్లు తెరవలేదు. సెబీ నివేదిక బయటపెట్టడంతో చిత్ర ముందస్తు బెయిలు కోసం కోర్టునాశ్రయించారు. కోర్టు తిరస్కరించడంతో సిబిఐ ఆమెను అరెస్టు చేసింది. ఆనంద్ అంతకు ముందే అరెస్టయ్యాడు. ఈ మొత్తం కుంభకోణంలో చిత్రతోబాటు మరో ముగ్గురు పాత్రధారులు ఉన్నట్లు సెబీ చెబుతోంది. ఈ కుంభకోణం వెనక ఉన్న పెద్ద తలకాయలెవరన్నది ఇంకా తేలాల్సి ఉంది. ఎవరి దన్ను లేకుండా కేవలం ముగ్గురు నలుగురు వ్యక్తులే ఇదంతా నడిపారంటే నమ్మశక్యం కావడం లేదు.
స్టాక్ మార్కెట్ ఆపరేటర్లకు ఎన్‌ఎస్‌ఇ అందించే కో-లొకేషన్ సేవల్లో సెబి అనుమతించిన మేరకు ట్రేడింగ్ డేటా ఇవ్వడం సాధారణంగా జరుగుతుంది. ఆ డేటాను ఉపయోగించుకుని బ్రోకర్లు స్టాక్ మార్కెట్‌లో షేర్ల కొనుగోలు, అమ్మకాలు చేస్తుంటారు. కార్పొరేట్ కంపెనీలకు సంబంధించిన అతి ముఖ్యమైన డేటాను సంపాదించగలిగినవారు ఎక్కువ లబ్ధి పొందుతారు. చిత్ర రామక్రిష్ట అండ్ కో చేసింది అది కాదు.కీలకమైన డేటాను లీక్ చేయడం ద్వారా కొంతమంది వ్యక్తులకు భారీగా లబ్ధి చేకూర్చి, అసంఖ్యాక రిటైల్ మదుపరులను నిండా ముంచారు. హర్షద్ మెహతా కుంభకోణం తరువాత పార్లమెంట్‌కు జవాబుదారీ వహించేందుకు వీలుగా సెబీని ఏర్పాటు చేయడం జరిగింది. 1992 నుంచి 2016 వరకు ఎన్‌ఎస్‌ఇలో ఇంత పెద్దయెత్తున అక్రమాలు జరుగుతుంటే సెబీ అప్పుడే వాటిని ఎందుకు పసిగట్టలేకపోయింది? ప్రపంచంలో అతి పెద్ద స్టాక్ ఎక్స్‌ఛేంజిలలో ఒకటైన ఎన్‌ఎస్‌ఇ పరిస్థితే ఇలా ఉంటే మిగతా స్టాక్ మార్కెట్లలో పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉంటుందో ఊహించుకోవచ్చు. స్టాక్ బ్రోకర్లకు కొందరికి ఆయాచితంగా లబ్ధి చేకూర్చారంటూ ఆరోపణలు రావడంతో 2016 డిసెంబరులో ఆమె ఆ బాధ్యతల నుంచి పక్కకు తప్పుకున్నారు. అప్పట్లోనే ఆమె అక్రమాల గురించి గుప్పుమన్నా ఎన్‌ఎస్‌ఇ బోర్డు కానీ, సెబీ కానీ నోరు విప్పకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. గతంలో సత్యం రామ లింగరాజు 14వేల కోట్ల మేర మోసం చేసి దివాళా తీసినట్లు ప్రకటించేవరకు ఏ దర్యాప్తు సంస్థ దానిని పసిగట్టలేకపోయింది. నయా ఉదారవాద విధానాల యుగంలో అవినీతిని ప్రభుత్వాలు చట్టబద్ధం చేస్తున్నాయనడానికి చిత్రా కుంభకోణమే ఉదాహరణ. ఈ కుంభకోణంలో కోట్లాది రూపాయల మేర నష్టపోయిన రిటైల్ మదుపరులకు న్యాయం జరిగేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. చిత్ర కుంభకోణంలో పాత్రధారులతో బాటు వారి వెనక ఉన్న అసలు సూత్రధారులను పట్టుకుని బోనులో నిలబెట్టేందుకు దీనిపై సమగ్రమైన దర్యాప్తునకు ప్రభుత్వం ఆదేశించాలి.










