Jul 21,2021 06:22

గత విద్యా సంవత్సరం ప్రారంభం అయినప్పటి నుంచి మన రాష్ట్రం లోని అన్ని ప్రభుత్వ స్కూళ్లలో కరోనా నేపథ్యంలో పారిశుధ్యానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. అన్ని స్కూళ్ళలో శానిటేషన్‌ సిబ్బందిని ఏర్పాటు చేశారు. వారి పని తీరును సమీక్షించడానికి ఐ.ఎం.ఎం.ఎస్‌ అనే ఒక ప్రత్యేక యాప్‌ ఏర్పాటు చేసి రోజువారీ స్కూళ్ళలో టాయిలెట్ల ఫొటోలు, శుభ్రత సమాచారాన్ని సేకరించారు. అయితే వీరికి నెలకు ఆరు వేల రూపాయలు గౌరవ వేతనంగా ఇస్తామన్న ప్రభుత్వం ఇప్పుడు కేవలం నెలకు వెయ్యి రూపాయలు మాత్రమే ఇస్తామని ఉత్తర్వులు జారీచేసింది. దీనివల్ల ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుధ్య కార్మికులుగా పని చేస్తున్న వారిని ప్రభుత్వం విస్మరించినట్లవుతుంది. రాబోయే రోజుల్లో వెయ్యి రూపాయల జీతానికి పని చేయలేక శానిటేషన్‌ సిబ్బంది మానివేసే పరిస్థితి ఏర్పడుతుంది. శానిటేషన్‌ సిబ్బంది పనిచేయడం మానివేస్తే స్కూళ్ళలో అపరిశుభ్ర వాతావరణం ఏర్పడుతుంది. దీంతో విద్యార్థుల ఆరోగ్యం దెబ్బ తింటుంది. రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలను బలోపేతం చేయాలనే ఆశయంతో కోట్లాది రూపాయలు ఖర్చు చేసి 'నాడు-నేడు' పేరుతో పాఠశాలల్లో వివిధ అభివద్ధి పనులను చేపట్టడం అభినందనీయం. ప్రభుత్వ పాఠశాలలో చదివే ప్రతి పేద విద్యార్ధులకు కార్పొరేట్‌ సౌకర్యాలు ఉండాలని బాలబాలికలకు ప్రత్యేక టాయిలెట్లు, రక్షిత మంచి నీరు సదుపాయానికి వాటర్‌ ప్లాంట్‌, సౌకర్యవంతమైన విద్యుత్‌ సౌకర్యం, ఫ్యాన్లు, ట్యూబ్‌ లైట్లు, పిల్లలకు కూర్చోవడానికి అవసరమైన బల్లలు, పాఠశాలలలోని అన్ని గదులకు మరమ్మత్తులు, ఆకర్షణీయమైన రంగులతో పాఠశాలలు ముస్తాబవుతున్నాయి. శానిటేషన్‌ సిబ్బందికి జీతాలు తగ్గించి ఇవ్వడం వల్ల రేపో మాపో పాఠశాలలు తెరవడానికి ఎదురు చూస్తున్న సందర్భంలో పాఠశాల పారిశుధ్య పనులకు అడ్డంకి ఏర్పడుతుంది. వెయ్యి రూపాయలకు స్కూళ్ళలో పారిశుధ్య పనులు చేయడానికి ముందుకు వచ్చే పరిస్థితి నేడు లేదు. భవిష్యత్తులో ఆరు వేల రూపాయల వేతనం వస్తుందని చెబుతూ పాఠశాల ప్రధానోపాధ్యాయులు వారితో పనులు చేయిస్తున్నారు. ప్రస్తుతం కేవలం నెలకు వెయ్యి రూపాయలు మాత్రమే ఇస్తామన్న ప్రభుత్వ ప్రకటన ప్రధానోపాధ్యాయులకు, పారిశుధ్య కార్మికులకు మధ్య ఘర్షణలు పెంచే విధంగా మారింది. కాబట్టి పాఠశాల పారిశుధ్య పనులకు గతంలో ప్రభుత్వం ప్రకటించిన ఆరు వేల రూపాయలను ఇవ్వాలి. తద్వారా ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందిన విద్యార్థుల ఆరోగ్యాన్ని కాపాడాలి.
- వాసిలి సురేష్‌, సెల్‌ : 9494615360