Jan 05,2022 06:53

చేనేత పరిశ్రమను మోడీ ప్రభుత్వం చావు దెబ్బ తీసింది. చేనేత కార్మికులకు చెల్లించే వేతనంపై 5 శాతం జి.యస్‌.టి విధించింది. చేనేతకు వినియోగించే నూలుపై, నూలు అద్దకం చార్జీలపై జి.యస్‌.టి ని 5 శాతం నుండి 12 శాతానికి పెంచింది. ఈ విధంగా మొత్తం చేనేత పరిశ్రమపై ఇప్పటి వరకు ఉన్న జి.యస్‌.టి భారాన్ని ఇష్టానుసారంగా పెంచేసింది.

కరోనా కారణంగా ప్రజల కొనుగోలు శక్తి పడిపోయి వస్త్ర అమ్మకాలు భారీగా పడిపోయాయి. మరో పక్క పవర్‌ మగ్గాల యజమానులు చేనేత రకాల వస్త్రాలను పవర్‌ మగ్గాలపై ఉత్పత్తి చేసి మార్కెట్లోకి భారీగా దించటంతో అంతంతమాత్రంగా ఉన్న చేనేత వస్త్రాల అమ్మకాలు మరింత పడిపోయాయి. ఈ పరిస్థితిలో చేనేత పరిశ్రమ మనుగడ ప్రశ్నార్ధకంగా మారింది.

2015లో చెన్నైలో ఆగస్టు ఏడున జాతీయ చేనేత దినోత్సవం వేడుకలో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్రమోడీ...చేనేత రక్షణకు, చేనేత పరిశ్రమ అభివృద్ధికి, చేనేత కార్మికుల జీవన ప్రమాణం పెంచటానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని...అందుకు అవసరమైన నిధులు కేటాయించి చేనేత పరిశ్రమకు అన్ని విధాలా సహాయం చేస్తామని వాగ్దానం చేశారు. అదేవిధంగా 2014లో వారణాసి నియోజకవర్గం నుండి పోటీ చేసిన మోడీ అక్కడి బహిరంగ సభలో ప్రసంగిస్తూ చేనేత కార్మిక నైపుణ్యాన్ని మెచ్చుకున్నారు. చేనేత పరిశ్రమ భారతీయ సాంస్కృతిక చిహ్నం అని మెచ్చుకుంటూ తమ ప్రభుత్వం అధికారం లోకి వస్తే చేనేత పరిశ్రమ ఉజ్వల భవితకు బాటలు వేస్తామని ఎన్నికల వాగ్దానం చేశారు. ఈ వాగ్దానాలన్నీ తుంగలో తొక్కి అందుకు పూర్తి విరుద్ధంగా చేనేతను సర్వనాశనం చేసే విధానాలను మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నది. మోడీ ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తరువాత నిత్యావసర సరుకులు పెట్రోలు, డీజిల్‌తో సహా అన్ని సరుకుల ధరలు యాభై శాతం పైగా పెరిగాయి.

చేనేతలో వినియోగించే నూలు ధరలు యాభై శాతం పైగా పెరిగాయి. ఉదాహరణకు యనభైౖ నెంబరు నూలు ధర మోడీ అధికారంలోకి వచ్చే నాటికి 4.50 కిలోల నూలు కట్ట రూ. 1600 ఉండగా ప్రస్తుతం రూ.3000కు పెరిగింది. అదే విధంగా రంగులు, రసాయనాల ధరలు కూడా యాభైౖ నుండి వంద శాతం వరకు పెరిగాయి. చేనేత వస్త్రాలకు గతంలో ఇచ్చే రిబేటు పతకాన్ని మోడీ ప్రభుత్వం రద్దు చేసింది. మోడీ ప్రభుత్వానికి ముందు జాతీయ చేనేత అభివృద్ధి సంస్థ ద్వారా ప్రతి చేనేత గ్రామంలో నూలు డిపోలు తెరచి చేనేత కార్మికులకు పది శాతం సబ్సిడీతో నూలు సరఫరా చేసేవారు. మోడీ ప్రభుత్వం సబ్సిడీ నూలు పథకాన్నేగాక జాతీయ చేనేత అభివృద్ధి సంస్థను సైతం రద్దు చేసింది.

ఓవైపు ముడి సరుకుల ధరలు పెరగటం, మరో వైపు ప్రభుత్వం నుండి భారీగా నిధులు పొందుతున్న పవర్‌ మగ్గాల వస్త్రాల నుండి పోటీ తీవ్రం కావటంతో చేనేత పరిశ్రమ రోజు రోజుకు క్షీణిస్తున్నది. భారతీయ సంస్కృతి గురించి రోజూ ఉపన్యాసాలు చెప్పే ప్రధానమంత్రి మోడీ మానవ నాగరికతకే మూలమైన ప్రపంచ దేశాల మన్ననలను పొందిన చేనేత పరిశ్రమను సర్వనాశనం చేసే విధానాలను అమలు చేస్తున్నారు. స్వాతంత్య్రం అనంతరం చేనేత పరిశ్రమను పవర్‌ మగ్గాల పోటీ నుండి రక్షించటం కోసం...చేనేతలో ఉపయోగించే చిలపల నూలుపై పన్ను లేకుండా పవర్‌ మగ్గాల రంగంలో వినియోగించే కోన్‌పై నూలు ఎక్స్చేంజ్‌ సుంకాన్ని విధించారు. ముడి సరుకుల రంగంలో చేనేతకు పవర్‌ మగ్గాల నుండి కొంత మేరకు రక్షణ కల్పించారు. అదే విధంగా చేనేత వస్త్రాల అమ్మకాలపై రిబేటు సౌకర్యం కల్పించారు. చేనేతకు అవసరమైన నూలు నిరంతర సరఫరాకు గ్యారెంటీ కల్పించటం కోసం దేశంలో ప్రతి నూలు మిల్లు చేనేతకు అవసరమైన చిలపల నూలు సరఫరా చేయాలని అప్పటి పాలకులు నిబంధన విధించారు. ఆ విధంగా చేనేతకు ముడి సరుకుల లభ్యత విషయమై గ్యారంటీ కల్పించారు. నేడు నిబంధనలను తుంగలో తొక్కి నూలు ఎగుమతులను ప్రోత్సహిస్తూ నూలు మిల్లు యజమానులకు రూ. వేల కోట్లు రాయితీలను మోడీ ప్రభుత్వం అందిస్తున్నది.

ఫలితంగా చేనేత పరిశ్రమకు అవసరమైన ముడి సరుకు చిలపల నూలు లభ్యత గణనీయంగా తగ్గింది. దీంతో నూలు మిల్లుల యజమానులు నూలు ధరలను విపరీతంగా పెంచేస్తున్నారు. వీటన్నిటి కారణంగా చేనేత వస్త్రాలకు గిరాకీ తగ్గి చేనేత కార్మికులకు తగినంత పని లభించని పరిస్థితి ఏర్పడింది. సరిపడా పని దొరక్క నిత్యావసర వస్తువులు భారీగా పెరిగిన పరిస్థితిలో చేనేత కార్మికులు అర్థాకలితో, పస్తులతో గడుపుతున్నారు. ఎంతో నైపుణ్యం కలిగిన చేనేత కార్మికుడికి రోజుకి పది గంటలు పని చేస్తే మూడు వందల రూపాయలకు మించి వేతనం లభించటం లేదు. మరో వైపు రోజూ పని దొరికే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో ఇంట్లో పని చేసుకునే చేనేత కార్మికులు ఇంటిని, భార్య పిల్లలను వదిలివేసి పట్టణాలకు పనికోసం వలసపోతున్నారు. ఇదిలా ఉండగా రాష్ట్రాన్ని పాలిస్తున్న జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వం చేనేత కార్మికులపై కక్ష కట్టినట్టు వ్యవహరిస్తున్నది.

చేనేత సహకార సంఘాలకు గత మూడు సంవత్సరాలుగా ఇవ్వవలసిన నూలు సబ్సిడీ, రిబేటు బకాయిలు, వడ్డీ సబ్సిడీ నిధులు విడుదల చేయలేదు. దాంతో చేనేత సహకార సంఘాలు మూతపడి చేనేత కార్మికులకు ఉపాధి కల్పించలేని పరిస్థితి ఏర్పడింది. దాంతో చేనేత కార్మికులు రోడ్డున పడ్డారు. అయితే 'చేనేత కార్మికులకు సంవత్సరానికి రూ.24,000 అందిస్తున్నాం. ఇంకా సహాయం చేయాల్సిన అవసరం ఏముంది?' అని ప్రభుత్వం చెబుతున్నది. సంవత్సరానికి రూ. 24,000 అంటే నెలకు రూ.2000 వస్తుంది. ఐదుగురు సభ్యులున్న కుటుంబం రెండు ఇడ్లీ తిని, ఒక టీ తాగితే రూ. 75 అవుతుంది. నెలకు రూ. 2250 అంటే ప్రభుత్వం సంవత్సరానికి ఇచ్చే రూ. 24,000 కుటుంబానికి టిఫిన్‌ ఖర్చులు కూడా రావు. రెండు పూట్ల భోజనం చెయ్యాలంటే చేనేత పని చేసుకోవాలి. కాని అటు సహకార రంగంలో కాని ప్రైవేటు రంగంలో గాని చేనేత కార్మికులకు పూర్తికాలపు పని దొరకటం లేదు. ఈ రూ. 24000 సహాయం కూడా సొంత మగ్గం కింద లేక ప్రైవేటు మాష్టర్‌ వీవింగ్‌ షెడ్డులలో నేత నేస్తున్న చేనేత కార్మికులకు ఇవ్వటం లేదు. రాష్ట్రంలో సొంత మగ్గం కలిగిన చేనేత కార్మికుల కంటే మాస్టర్‌ వీవర్స్‌ షెడ్డులలో పని చేస్తున్న చేనేత కార్మికుల సంఖ్య అధికంగా ఉన్నది.

దీనికి ప్రభుత్వం నుండి ఎటువంటి సహాయం అందటం లేదు. మరో పక్క సహకార సంఘాలలో ఉత్పత్తి అయిన వస్త్రాలను మార్కెటింగ్‌ చేయటం కోసం ఏర్పాటు చేసిన ఆప్కో సంస్థ సహకార సంఘాల ఉత్పత్తులను అత్యంత స్వల్పంగా కొనుగోలు చేస్తూ పవర్‌ మగ్గాల వస్త్రాలను భారీగా కొనుగోలు చేస్తున్నది.
స్కూలు పిల్లలకు ఇచ్చే యూనిఫారాలు చేనేత రంగంలోనే ఉత్పత్తి చేయాలనే నిబంధన ఉన్నప్పటికి బోగస్‌ సంఘాల ద్వారా పవర్‌ మగ్గాల వస్త్రాలు కొని చేనేత వస్త్రాలుగా ప్రభుత్వం స్వీకరిస్తున్నది.

కేరళ రాష్ట్రంలో మొత్తం చేనేత కార్మికులందరిని సహకార రంగంలోకి తీసుకొచ్చారు. స్కూలు యూనిఫారాలను సహకార రంగంలో ఉత్పత్తి చేసి ప్రభుత్వాలకు సరఫరా చేస్తున్నారు. ఎనిమిది గంటల పనికి రోజుకు రూ. 600 వేతనం చెల్లిస్తున్నారు. ఇది దేశానికే ఆదర్శప్రాయంగా ఉన్నది.

భారతీయ సంస్కృతి గురించి పదేపదే ఉపన్యాసాలు చెప్పే మోడీ ప్రభుత్వం ఇప్పటికైనా భారతీయ సంస్కృతికి చిహ్నమైన చేనేత రంగాన్ని రక్షించటానికి అవసరమైన చర్యలన్నిటిని తక్షణం చేపట్టాలి. జాతీయ చేనేత అభివృద్ధి సంస్థను పునరుద్ధరించి చేనేత కార్మికులందరికి సబ్సిడీ నూలు అందించాలి. రిబేటు సౌకర్యాన్ని పునరుద్ధరించి చేనేత వస్త్రాల అమ్మకాలను ప్రోత్సహించాలి. ఇందుకుగాను ప్రతి సంవత్సరం కేంద్ర బడ్జెట్‌లో రూ.5 వేల కోట్లు కేటాయించాలి.

రాష్ట్రం లోని వై.ఎస్‌.ఆర్‌ ప్రభుత్వం సహకార సంఘాలకు ఇవ్వవలసిన బకాయిలన్నీ విడుదల చేయాలి. చేనేత కార్మికుల కనీస వేతన చట్టాన్ని నిత్యావసర సరుకులకు అనుగుణంగా సవరించి అమలు చెయ్యాలి. మాష్టరు షెడ్డులలో పని చేసే చేనేత కార్మికులకు కూడా రూ. 24,000 సహాయం అందించాలి. ఆప్కోను బలోపేతం చేసి సహకార సంఘ ఉత్పత్తులన్నీ కొనుగోలు చేసేందుకు ఆప్కోకు రూ. వంద కోట్లు సహాయం అందించాలి. ప్రైవేటు రంగంలో ఉండే వస్త్ర నిల్వలను కూడా ప్రభుత్వం కొనుగోలు చేసి చేనేత కార్మికులకు పని గ్యారంటీ కల్పించాలి. ఇందుకుగాను రాష్ట్ర బడ్జెట్‌లో చేనేతకు రూ.300 కోట్లు కేటాయించాలి.
చేనేతను చావు దెబ్బ తీసిన మోడీ

సజ్జా నాగేశ్వరరావు

/ వ్యాసకర్త : ఆంధ్రప్రదేశ్‌ చేనేత కార్మిక సంఘం
మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, సెల్‌ : 9440423417 /