Mar 05,2022 07:08

ఆంధ్రప్రదేశ్‌ కాలక్రమణికలో రాష్ట్ర హైకోర్టు గురువారం నాడు ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమైనది. ప్రభుత్వం అడిగిందే తడవుగా దాదాపు 30 వేల ఎకరాల సారవంతమైన భూములను రాజధాని నిర్మాణం కోసం అప్పగించి..అనంతరం జరిగిన అన్యాయాలపై 807 రోజుల పాటు నిరవధిక దీక్షలు చేపట్టిన అమరావతి రైతుల పోరాట పటిమ అభినందనీయం. ప్రభుత్వం తీవ్రమైన నిర్బంధాన్ని కొనసాగించినా, లాఠీలతో విరుచుకుపడినా అమరావతి రైతులు ప్రత్యేకించి మహిళా రైతులు మొక్కవోని దీక్షతో పోరు సలపడం స్ఫూర్తిదాయకం. శాంతియుత దీక్షలు కొనసాగిస్తూనే న్యాయపోరాటం చేసి రైతులు విజయం సాధించారు. విభజన హామీలను గాలికొదిలేసి ప్రత్యేక హోదాను నీరుగార్చిన బిజెపి సర్కార్‌ తెలుగు ప్రజలను నిలువునా వంచించింది. హస్తిన కంటే అద్భుతమైన రాజధాని నిర్మించేందుకు సహకరిస్తామని వాగ్దానం చేసిన మోడీ 'పిడికెడు మట్టి..చెంబుడు నీళ్లు..' మొహానకొట్టిపోయారు. అయినా మోడీ సర్కార్‌ను రాష్ట్ర పాలకులు నిలదీయకపోవడం దారుణం.
ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం ప్రకారం పదేళ్ల పాటు హైదరాబాద్‌లోనే రాజధానిని కొనసాగించేందుకు వీలున్నా..ఆ అవకాశాన్ని వినియోగించుకోకుండా అమరావతిలో గుడారాలు వేసుకొనైనా సరే ఇక ఇక్కడ నుంచే పాలన సాగిస్తామంటూ పంతాలకు పోయారు. 'అమరావతి'లో అత్యద్భుత రాజధానిని నిర్మిస్తామంటూ ప్రకటనలు గుప్పించారు. ఈ క్రమంలోనే బిజెపితో అంటకాగారు. పది కాదు పదిహేనేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామంటూ బిజెపి పలికిన పలుకులన్నీ నీటి మీద రాతలైనా టిడిపి ప్రభుత్వం పట్టించుకోలేదు. వంచనలపై మీనమేషాలు లెక్కించారే తప్ప నిలదీసి అడిగింది లేదు. అడగాల్సిన సమయంలో అడగకుండా ఆఖర్లో చేసిన పోరుదీక్షలు ఏమాత్రం ఫలితాన్నిచ్చాయో విదితమే. గ్రాఫిక్స్‌, డిజైన్లతో కాలం వెళ్లదీసి చివర్లో నాలుగైదు భవనాలతో 'రాజధాని'ని మమ అనిపించాల్సివచ్చింది. అత్యధికమంది నిపుణులు రాజధానికి ఐదు వేల ఎకరాలు చాలు అని మొత్తుకున్నా ..30 వేల ఎకరాల సారవంతమైన భూములను సమీకరించి అటు రాజధాని లేక ఇటు పంటలు లేక రైతులను రెండిటికి చెడ్డ రేవడిగా తయారు చేసిన పాపం టిడిపి ప్రభుత్వానిదే. వైసిపి ప్రభుత్వం మూడు రాజధానుల పేరుతో మరింత గందరగోళపరిచింది. రైతులు రోడ్డున పడవలసివచ్చింది.
     రూ.వందల కోట్లు అవసరమైన రాజధాని నిర్మాణం కోసం బడ్జెట్‌లో కేవలం లక్ష రూపాయలు కేటాయించి భిక్షం వేసినట్లు కేంద్రం పరాచకాలాడింది. ప్రభుత్వం ఇప్పటికైనా పట్టింపులకు వెళ్లకుండా తక్షణమే హైకోర్టు తీర్పును అమల్జేసేందుకు ఉపక్రమించాలి. మళ్లీ వేరే బిల్లు తేవడానికో, సుప్రీంకోర్టుకు అప్పీలు చేయడానికో ప్రయత్నించడం విజ్ఞత అనిపించుకోదు. హైకోర్టు ఆదేశించిన రీతిలో భూములిచ్చిన రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లను గడువులోగా అప్పగించాలి. అలాగే రాజధానికి అవసరమైన భవనాల నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి కేంద్రీకరించాలి. ఇప్పటికే 80-90 శాతం పనులు పూర్తయిన భవనాలన్నిటిని పూర్తి చేసి, వెంటనే వాటిని ప్రభుత్వ అవసరాలకు ఉపయోగించాలి. మిగతా అసంపూర్తి భవనాల నిర్మాణంపై శ్రద్ధ పెట్టాలి. నిధుల కొరత వెంటాడుతున్న ఈ సమయంలో రాజధాని నిర్మాణానికి అవసరమైన నిధులను అప్పుగా తెచ్చినా ఎవరూ తప్పు బట్టకపోవచ్చు. భూములు కోల్పోయిన రైతులకు కౌలు పరిహారం చెల్లించడంతో పాటు వ్యవసాయ కార్మికులు, ఇతర పేదలకు పింఛన్లను పెరిగిన ధరలకు అనుగుణంగా పెంచి చెల్లించాలి. రాజధాని ప్రాంత ప్రజల ఉపాధి కల్పనకు అవసరమైన చర్యలు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలి. అభివృద్ధి వికేంద్రీకరణ అంటే పాలనా వికేంద్రీకరణ కాదనీ ఇప్పటికైనా గ్రహించి వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిపై దృష్టి సారించాలి. కేంద్రం నుంచి న్యాయబద్ధంగా రావాల్సిన నిధుల కోసం అఖిల పక్షాలను కలుపుకువెళ్లి పోరాడాలి. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం కేంద్రం చెల్లించవలసిన నిధులను రాబట్టాలి.