ప్రజాశక్తి- భోగాపురం : విమానాశ్రయం నిర్మాణానికి భూములిచ్చింది భోగాపురం రైౖతులయితే... విమానాశ్రయానికి జిఎంఆర్ విశాఖపట్నం అంతర్జాతీ విమానాశ్రయమని ప్రహరీ గోడలపై శాశ్వతంగా ఉండే పేర్లు దర్శనమిస్తున్నాయి. ఇది చూసిన పలువురు ప్రభుత్వంతో పాటు జిఎమ్ఆర్ సంస్థ తీరుపై మండిపడుతున్నారు. పక్క జిల్లా శ్రీకాకుళంలో పోర్టుకు భూములను మూలపేట రైతులు ఇస్తే భావనపాడు పేరు పెడితే అందుకు అక్కడ రైతులు ఆందోళన చేస్తే చివరకు ప్రభుత్వం మూలపేట పోర్టుగా నామకరణం చేసింది. మరి ఇక్కడ భోగాపురం రైతులు భూమిలిస్తే విశాఖపట్నం పేరు పెట్టడంపై, ప్రజాప్రతినిధులు ఏవిధంగా స్పందిస్తారనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి గత ప్రభుత్వం హయాంలో భూసేకరణకు నిర్ణయించారు. ఎకరా కోట్లలో ఉన్న భూమిని కేవలం లక్షల్లో ఇచ్చిన పరిహారానికి విమానాశ్రయం నిర్మాణం కోసం రైతులు భూములు ఇచ్చేశారు. సుమారు 2,700 ఎకరాలను ప్రభుత్వం భూసేకరణ చేసింది. భూసేకరణ ప్రారంభం నుంచి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పేరుతోనే మ్యాప్‌లు దానికి సంబంధించిన రికార్డులు ఉండేవి.
శంకుస్థాపన రోజు భోగాపురం.. ఇప్పుడు విశాఖపట్నం..
విమానాశ్రయానికి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన రోజు అక్కడ స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. అన్నిచోట్ల భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పేరుతో ఉన్నాయి. ఇటీవలి విమనాశ్రయం నిర్మాణ పనులు ప్రారంభమైన వెంటనే ఆ పేరును జిఎమ్ఆర్ సంస్థ మార్చేసింది. ప్రభుత్వం ఇంకా విమానాశ్రయానికి ఏ పేరు పెట్టనప్పుడు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంగానే కొనసాగించాలి. కాని ప్రహరీ గోడలపై శాశ్వతంగా ఉండేలా జిఎమ్ఆర్ విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం పేరుతో ప్రతి 30 మీటర్లుకు ఒకచోట రాయడంపై ఈ ప్రాంతవాసులు మండిపడుతున్నారు.