Mar 10,2022 06:53

భారత్‌- చైనా సంబంధాలను పునర్నిర్మించగల కొత్త అంతర్జాతీయ ధోరణులు ముందుకొచ్చినప్పుడు వాటిని తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలి. అమెరికా ఇండో-పసిఫిక్‌ వ్యూహం నాటో యొక్క ఇండో-పసిఫిక్‌ వర్షన్‌ను సృష్టించడమే లక్ష్యంగా ఉందని చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యీ మార్చి7న చెప్పారు. అయితే ఇదేమీ కొత్త కాదు. నిజానికి, 15ఏళ్ళ క్రితమే దీని గురించి చైనా హెచ్చరించింది. ప్రస్తుతం క్వాడ్‌ గ్రూపుగా పునరుద్ధరించబడిన భారత్‌, ఆస్ట్రేలియా, జపాన్‌, అమెరికా దేశాల ఆనాటి సమావేశం గురించి ప్రస్తావిస్తూ, 'ఆసియన్‌ నాటో'ను తెరపైకి అమెరికా తెస్తోందని పేర్కొన్నది. అయితే, అది కార్యరూపం దాల్చలేదనుకోండి. ప్రస్తుతం అంతర్జాతీయ నేపథ్యం, ఉక్రెయిన్‌లో సంక్షోభం దృష్ట్యా ఈ తాజా ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. బీజింగ్‌లో జరిగిన నేషనల్‌ పీపుల్స్‌ కాంగ్రెస్‌లో వాంగ్‌ మాట్లాడుతూ, 'ప్రత్యేక క్లబ్‌లను ఏర్పాటు చేయడం' ద్వారా అమెరికా భౌగోళిక, రాజకీయ శతృత్వాన్ని రెచ్చగొడుతోందని విమర్శించారు. 'ఫైవ్‌ ఐస్‌ ఇంటెలిజెన్స్‌ (అయిదు నేత్రాల నిఘా) కూటమిని బలోపేతం చేయడం'', క్వాడ్‌ గురించి గొప్పగా ప్రచారం చేయడం, ఆకస్‌తో కలిసి పనిచేయడం, ద్వైపాక్షిక సైనిక కూటములను పటిష్టపరచడం ద్వారా ఈ ప్రాంతంలో ''ఫైవ్‌-ఫోర్‌-త్రీ-టూ'' పొందికను ఏర్పాటు చేయడానికి అమెరికా ప్రయత్నిస్తోందని వాంగ్‌ అన్నారు. ఇక్కడ అమెరికా విస్తృత లక్ష్యం నాటోకు ఇండో-పసిఫిక్‌ వర్షన్‌ను నెలకొల్పడమేనని వాంగ్‌ అన్నారు.
    ఇటీవలి వారాల్లో, ఉక్రెయిన్‌లో సంక్షోభానికి నాటోనే కారణమంటూ చైనా పదే పదే విమర్శలు చేస్తోంది. తటస్థంగా వుంటామని చెబుతూనే రష్యాతో తన సంబంధాలను ధృఢపరుచుకునే దిశగా చర్యలు తీసుకుంటోంది. రష్యాతో స్నేహ సంబంధాలు చెక్కుచెదరనివని సోమవారం పునరుద్ఘాటించింది. గతేడాది 4వ తేదీన చైనా, రష్యా నేతలు సమావేశమయ్యారు. యూరప్‌లో నాటో తూర్పు దిశగా విస్తరించే ప్రయత్నాల పట్ల రష్యా వెలిబుచ్చిన ఆందోళనలకు చైనా మద్దతు తెలిపింది. అందుకు ప్రతిగా చైనాతో కలిసి రష్యా, అమెరికా అనుసరిస్తున్న ఇండో-పసిఫిక్‌ వ్యూహాన్ని విమర్శించింది. ఇప్పటికే రష్యా, చైనా మధ్య రాజకీయ, ఆర్థిక సంబంధాలు సమగ్రంగా వున్నాయి. వాటికి మించి, అమెరికా పొత్తులపై వెలిబుచ్చిన ఈ తాజా ఆందోళనలు, చైనా-రష్యా సంబంధాల కూటమిని కలిపివుంచే అత్యంత శక్తివంతమైన సంకేతాలుగా ఆవిర్భవిస్తున్నాయి. అయితే, రష్యాతో భారత్‌కు వున్న సన్నిహిత సంబంధాలను ఇది ఎలా ప్రభావితం చేస్తుందో భారత్‌ పరిశీలించాల్సిన అవసరం వుంది. సైనిక ఒప్పందం కాని క్వాడ్‌ను ఇతర భద్రతా ఒప్పందాలతో సమానంగా చేయడం ద్వారా చైనా, అమెరికా ఏర్పాటు చేసిన 'ప్రత్యేక క్లబ్‌'లో భారత్‌ కూడా భాగమని స్పష్టం చేసినట్లే కనిపిస్తోంది. కానీ భారత్‌ ఈ భావనను తిరస్కరిస్తోంది. గత నెల్లో భారత విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ మాట్లాడుతూ, 'ఆసక్తి గల పక్షాలు' ఆసియన్‌ నాటో అంటూ అనవసరపు లెక్కలు, విశ్లేషణలు చేస్తున్నాయని వ్యాఖ్యానిస్తూ, భారత్‌, అమెరికా ఒప్పంద మిత్రపక్షం కాదని అన్నారు. నిజానికి, 2020లో వాస్తవాధీన రేఖ పొడవునా చైనా దూకుడు చర్యలు భారత్‌-అమెరికా సంబంధాలను దెబ్బతీసేందుకు ఒక హెచ్చరిక సంకేతంగా భారత్‌లోని కొన్ని వర్గాలు వ్యాఖ్యానించాయి. ఇందుకు తగ్గట్లుగానే భారత్‌ దృఢమైన, సరైన స్పందన వుంది. పైగా ఊగిసలాట లేకుండా, అమెరికా, క్వాడ్‌ దేశాలతోనే కాకుండా ఇతర ఇండో-పసిఫిక్‌ భాగస్వాములతో కూడా సంబంధాలను బలపరుచుకోవడాన్ని కొనసాగిస్తోంది. ఆందోళనల పట్ల సున్నితంగా స్పందించడమనేది పరస్పరంగా వుండాలి, అంతేకానీ ఎదుటి పక్షం దాన్ని పూర్తిగా విస్మరిస్తుంటే మనం దాన్ని డిమాండ్‌ చేసేదిగా వుండరాదన్న సందేశాన్ని భారత్‌ స్పష్టం చేసింది. పాకిస్తాన్‌తో చైనా సంబంధాలను ఇక్కడ ఉదహరించు కోవచ్చు. సంబంధాల్లో ఇటీవల తగిలిన 'ఎదురుదెబ్బలు' అటు భారత్‌కు కానీ ఇటు చైనాకు కానీ ఒప్పించలేక పోయాయని వాంగ్‌ అంగీకరించారు. న్యూఢిల్లీ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఈ నెల 11న భారత్‌, చైనాలు మరో దఫా సైనిక చర్చలకు సమావేశం కానున్నాయి. వాస్తవాధీన రేఖ పొడవునా సైనికబలగాల ఉపసంహరణపై చర్చించనున్నాయి. గత దశాబ్దాల కాలంలో ఎన్నడూ లేని రీతిలో దిగువ స్థాయికి చేరిన సంబంధాలను పునరుద్ధరించుకోవడానికి ప్రయత్నించాలని భారత్‌, చైనాలు కోరుకుంటున్నందున, సరిహద్దుల్లో శాంతిని నెలకొల్పాలని భావిస్తున్నందున, తమ ద్వైపాక్షిక సంబం ధాలను పునర్నిర్మించేటువంటి అంతర్జాతీయ ధోరణులపై కూడా విస్తృతంగా చర్చించాల్సిన అవసరం వుంది.
                                                             (ది హిందూ సంపాదకీయం)