గబరొనే: తెల్లగా ఉండే అతిపెద్ద 1174 కేరట్ల వజ్రం బోట్స్‌వానా దేశంలోని ఒక గనిలో వెలుగుచూసింది. ఒక్క కేరట్ వజ్రం ధర దాదాపుగా 50 వేల నుండి మూడు లక్షల రూపాయల వరకు ఉంటుంది. మనిషి అరచేతి నిండా ఉండేంత పెద్దదైన వజ్రాన్ని కనుగొన్నట్లు కెనడాకు చెందిన మైనింగ్ కంపెనీ లూకారా తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అతి పెద్ద వజ్రాల్లో ఈ వజ్రం మూడో స్థానాన్ని ఆక్రమించుకుంది. మొదటి స్థానంలో 1905లో దక్షిణాఫ్రికాలో దొరికిన 3,106 కేరట్ల కులినన్ వజ్రం ఉంది. ఈ వజ్రంలోని కొన్ని భాగాలను బ్రిటిష్ యువరాణి కిరీటంలో పొదిగారు. కాగా బట్స్‌వానాలో నెల రోజుల క్రితమే 1098 కేరెట్ల వజ్రం తవ్వకాల్లో లభించింది. ఇది ప్రస్తుతం ప్రపంచంలోని అతిపెద్ద వజ్రాల్లో నాలుగో స్థానంలో ఉంది. ప్రపంచంలో ఉన్న అతిపెద్ద 10 వజ్రాల్లో ఆరు వజ్రాలు బోట్స్‌వానా దేశంలోనే వెలుగు చూశాయి. బోట్స్‌వానా ఆఫ్రికన్ దేశాల్లో కెల్లా అత్యధికంగా డైమండ్లను ఉత్పత్తి చేస్తోంది.










