ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : తెలుగు రాష్ట్రాల్లో సినిమా థియేటర్లు ఇప్పుడే తెరుచుకునే పరిస్థితులు కనపడటం లేదు. కరోనా వల్ల గత ఏడాది నుంచి థియేటర్లు మూతపడ్డ విషయం తెలిసిందే. తెలంగాణలో 100శాతం సీట్లతో, ఎపిలో 50శాతం సీట్లతో థియేటర్లు తెరుచుకునేందుకు ప్రభుత్వాలు తాజాగా అనుమతులు ఇచ్చాయి. అయితే, సినిమా విడుదల కావాలంటే రెండు రాష్ట్రాల్లోనూ పరిస్థితులు అనుకూలించాలని నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు అంటున్నారు. హైదరాబాద్‌లో బుధవారం జరిగిన సమావేశంలో కరోనా అదుపులోకి రాకుండా నిర్వహణ కష్టమవుతుందనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. దీంతో పాటు కర్ఫ్యూ నిబంధనలు, కరోనా ఇంకా కొనసాగడం వంటి పరిస్థితుల దృష్ట్యా ధియేటర్లను తెరిచేందుకు యాజమానులు సిద్ధంగా లేరు. రాష్ట్రంలో రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలవుతున్న సంగతి తెలిసిందే. దీనివల్ల థియేటర్లలో మూడు ఆటలే ప్రదర్శించాల్సిఉంటుంది. అదేవిధంగా పశ్చిమ, తూర్పు గోదావరి, కృష్ణా జిల్లాల్లో రాత్రి 7గంటల వరకే కర్ఫ్యూ నుంచి వెసులు బాటు ఉంది. ఈ రెండు జిల్లాల్లో రెండు ఆటలే వేయాలి. దీంతో ఖర్చులు గత కంటే పెరుగుతాయని విజయవాడ ఎగ్జిబ్యూటర్స్ అసోసియేషన్ కార్యదర్శి టి సాయి సూర్యప్రసాద్ ప్రజాశక్తితో అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో థియేటర్లను నిర్వహిస్తే తాము నష్టపోతామన్నారు.
జిఓ 69పై ఆగ్రహం
రాష్ట్రప్రభుత్వం మంగళవారం తీసుకొచ్చిన జిఓ 69పై సినిమా థియేటర్ల యాజమానులు ఆగ్రహంతో ఉన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన టిక్కెట్ల ధరలతో థియేటర్లు నిర్వహించలేమని చెబుతున్నారు. రూ.5, రూ.10, రూ.15ల టిక్కెట్ల ధరలతో థియేటర్లు ఎలా నిర్వహిస్తామని యాజమానులు ప్రశ్నిస్తున్నారు. ఈ జిఓ వల్ల ముఖ్యంగా సి, డి సెంటర్ల థియేటర్లు తెరిచే పరిస్థితి ఉండదంటున్నారు.










