బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ శ్రేణులలోనే మోడీ మరోసారి గెలవగలరా అని సందేహాలు పెరుగుతున్నాయి. తన తర్వాత అమిత్ షా అన్నప్పటికీ జనాకర్షణ లేదనే అంశం వెనక్కు లాగుతుంది. ఈ నేపథ్యంలోనే కొందరి పేర్లను ప్రచారంలోకి తీసుకు రావాలన్నది సంఫ్‌ు వ్యూహంగా కనిపిస్తున్నది. అక్కడ మనిషి కన్నా మతతత్వ రాజకీయాలే ముఖ్యం గనక, ఎలాగోలా అధికారంలోకి రావడం కోసం ఎలాంటి విన్యాసాలైనా చేస్తారు. బిజెపికి భారీగా నిధులిచ్చే కార్పొరేట్ వర్గాలు కూడా మోడీకి మారుగా మరో మొహం వెతుక్కోవాలా అని చూస్తున్న సూచనలున్నాయి. సర్వశక్తివంతుడుగా టముకు వేసుకున్న ఒక ప్రధాని వుండగా మరొకరిని ప్రత్యామ్నాయంగా చూపించడానికి ఇవన్నీ కారణాలే.
హోంమంత్రి అమిత్ షా ప్రధాని నరేంద్ర మోడీకి అత్యంత విశ్వాసపాత్రుడైన సహాయకుడు. ఆయన ప్రధాని కాగానే అమిత్ షాను బిజెపి అధ్యక్షుడిని చేయడం కన్నా అందుకు మరో నిదర్శనం అక్కర్లేదు. వాస్తసవానికి మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా వున్నప్పుడే అమిత్ షా ఆయనకు సహాయకుడు. భయానకమైన గుజరాత్ మారణహోమం జరిగినప్పుడు హోంమంత్రిగా అమిత్‌షా అందరికీ తెలుసు గాని వాస్తవంలో ఆ శాఖ మోడీదే. ఈయన కేవలం సహాయ మంత్రి మాత్రమే. ఆ సమయంలో ఒక మంత్రి హత్య కేసులో షా కొంత కాలం జైలులో కూడా వుండాల్సి వచ్చింది. తిరిగి రాగానే ఆయనను మోడీ మళ్లీ పూర్వ వైభవం కల్పించారు. 2012-13లో మోడీని సంఘ పరివార్ బిజెపి తరపున ప్రధాని పదవికి పోటీకి నిలుపుతుందని తెలిసిన నాటి నుంచి ఆయన అదే పనిలో మునిగిపోయారు. ముఖ్యంగా యు.పి లో మకాం వేశారు. 80 స్థానాలున్న యు.పి గెలిస్తే గాని కేంద్రంలో అధికారం దక్కదని బిజెపికి బాగా తెలుసు. అంతకు ముందు కాంగ్రెస్ యు.పి బీహార్‌లలో దెబ్బ తిన్నా ప్రభుత్వాలు ఏర్పాటు చేయగలిగిందంటే దానికి దక్షిణాదిన కొంత పట్టు వుండటమే కారణం. బిజెపి కి ఆ అవకాశం లేదు. ఈ పరిస్థితులలో హిందీ రాష్ట్రాలే ఆ పార్టీకి శరణ్యమయ్యాయి. అమిత్ షా చాలాకాలం ముందు నుంచే యు.పి లో మకాం వేసి పార్టీకి అత్యధిక స్థానాలు సంపాదించి పెట్టారు. మళ్లీ శాసనసభ ఎన్నికలకు రెండోసారి లోక్‌సభ ఎన్నికలకు కూడా ఆయన అక్కడే తిష్ట వేశారు. 2017లో బిజెపి యు.పి లో విజయం సాధించి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక దుష్పరిణామాలు, మత దాడులు, ఘర్షణలు, అత్యాచారాలు చూసింది. ఫలితంగా ఉప ఎన్నికలలో దెబ్బతిన్నది కూడా. కరోనాను ఎదుర్కోవడంలో ఘోర వైఫల్యం, గంగానదిలో శవాలు కొట్టుకురావడం ఇందుకు పరాకాష్ట. అయినా సరే సంఘ పరివార్ దృష్టిలో యోగి ఒక హీరో. కనీసం అలా చిత్రించేందుకు వారు తంటాలు పడుతుంటారు. ఆయన కూడా పచ్చి మతవాద ప్రసంగాలు చేస్తూ రెచ్చగొడుతుంటారు.
హోంమంత్రిగా ఆ పార్టీ మాజీ అధ్యక్షుడుగా అమిత్ షా మాటలు అందుకు మరింత ఊతమివ్వడం యాదృచ్ఛికం కాదు. ఎన్నికల ప్రచారం తొలిదశలోనే ఆయన సూటిగా యోగిని నెత్తిన పెట్టుకున్నారు. ఈసారి యు.పి లో బిజెపి గెలుపు కష్టమేననీ సమాజ్‌వాది పార్టీకి అవకాశాలెక్కువని అనేక వార్తలు రావడంతో వాటి ప్రభావం తగ్గించడం కూడా ఒక సమస్యగా మారింది. వీటికి విరుగుడుగానే అమిత్‌షా యోగిని మోడీకన్నా గొప్పగా ప్రచారం చేయడం మొదలెట్టారు. కేంద్రంలో మూడోసారి మోడీ ప్రధానిగా తిరిగిరావాలంటే యు.పి లో యోగి విజయం సాధించడంపైనే ఆధారపడి వుంటుందని సూటిగా ప్రకటించారు. ఇది మోడీ భక్తులకు కోపం తెప్పించింది. పరివార్ నాయకత్వాన్నీ ఇరకాటంలో పడేసింది. మహా శక్తివంతుడైన నేతగా తాము చిత్రించే మోడీ పునరాగమనం యు.పి ముఖ్యమంత్రి యోగిపై ఆధారపడి వుంటుందని చెప్పడం నష్టమని వారు భావించారు. అది తమలో ఆత్వవిశ్వాస లోపమవుతుందని కూడా అర్థమైంది. అయితే అమిత్ షా ఆ విధంగా ఎందుకు మాట్లాడారనే దానిపై పరిపరి విధాల కథనాలు వచ్చాయి. అందుకే సంఘపరివార్ అమిత్‌షాను ఆ మాటలను విస్తృతంగా ప్రచారంలో పెట్టవద్దని భావించింది.
తమాషా ఏమంటే గతసారి బిజెపి ఎన్నికలకు వెళ్లినప్పుడు ముఖ్యమంత్రి ఎవరు అనే విషయం ప్రకటించలేదు. ఎన్నికల అనంతరం తర్జనభర్జనల తర్వాతనే యోగిని ఎంపిక చేశారు. ఉమాభారతి అంతకుముందు ఎం.పి ముఖ్యమంత్రిగా పనిచేసిన మాట నిజమే గాని సామాన్యంగా విహెచ్‌పి యోగులు ఎంపీలు, ఎంఎల్‌ఎల తోనే ఆగిపోయేవారు. ఆదిత్యనాథ్ కూడా అయోధ్య ఉద్యమానికి కేంద్రబిందువైన గోరఖ్‌పూర్ మఠం వారసుడు. పైగా జాట్. అవన్నీ దృష్టిలో పెట్టుకునే ఎంపిక చేశారు. 44 మందితో చర్చలు జరిపాకే ఈ నిర్ణయం చేశామని అప్పట్లో అమిత్ షా అన్నారు. అంత పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా తనకు ఎనలేని ప్రచారం లభించింది. ఎప్పటికైనా మోడీకి పోటీ కావచ్చని మొదటి నుంచి అంటున్నారు. కాని గో మాంసం పేరిట హత్యలతో మొదలై హత్రాస్ హత్యాకాండ వరకూ ఆయన పాలన దారుణంగా పరిణమించింది. గోరఖ్‌ఫూర్ పార్లమెంటు స్థానానికి ఉప ఎన్నిక జరిగినప్పుడు కూడా బిజెపి ఓడిపోయంది. మోడీ ప్రాతినిధ్యం వహించే వారణాసి లోనూ అదే పరిస్థితి. పశ్చిమ యు.పి లో రైతాంగ ఆందోళన ఉధృతి కూడా యోగి ఆదిత్యనాథ్‌కు సవాలుగా తయారైంది. ఈ కారణంగా అసలు ముఖ్యమంత్రి అభ్యర్థిగా మరెవరినైనా ప్రకటిస్తారేమోననే ఊహాగానాలు కూడా నడిచాయి. మారుస్తారని చెప్పుకున్నారు. ఈ దశలో మోడీని ఇబ్బంది కలిగించే మాటలు యోగి మాట్లాడటం, వేడి పెంచింది. మోడీ బృందం ఎంత ప్రయత్నించినా మంత్రివర్గంలో మార్పులు తీసుకురాలేకపోయారు. కొంత విరామం తర్వాత ఢిల్లీ వెళ్లి ప్రధానితో మంతనాలు జరిపి ఆయనకు ఇష్టుడైన అరవింద కుమార్‌ను రాష్ట్ర బిజెపి 17వ ఉపాధ్యక్షుడిగా నియమించిన తర్వాతనే సంధి కుదిరింది. ఈ ఎన్నికల్లో యోగిని గాక మోడీ కేంద్రంగా ప్రచారం నడుపుతారని కూడా అనుకున్నది పోయి యోగి విజయంపై మోడీ ఆధారపడి వున్నారని అమిత్ షా చెప్పడంలో వ్యూహమేమిటని పరిశీలకులు మొదట ఆశ్చర్యపోయినా తర్వాత తత్వం బోధపడింది. ప్రతికూల వాతావరణాన్ని కొంతైనా మార్చుకోవడానికే అలా అన్నారని వారు భావించారు.
అయితే ఆ తర్వాత అమిత్ షా మరింత పెద్ద షాక్ ఇచ్చారు. మోడీ విజయానికి దోహదం కాదు అసలు తదుపరి ప్రధాని అభ్యర్థి యోగినే పొమ్మన్నారు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో యోగి సర్కార్ విజయాలపై ఊదరగొట్టిన అమిత్ షాను భావి ప్రధాని అభ్యర్థిగా ఆయనను పరిగణిస్తున్నారే అని విలేకరి అడిగారు. సహజమే కదా అని తడుముకోకుండా జవాబిచ్చారు. ఇన్ని విజయాలు సాధించిన ఆయనను దేశ ప్రధానిగా భావించడంలో ఆశ్చర్యమేముందని ఎదురు ప్రశ్న వేశారు. అంటే ఈ ప్రచారం యాదృచ్ఛికం కాదనేది స్పష్టం. అమిత్‌షా మాటలను దేశ వ్యాపితంగా మీడియా ప్రత్యేకంగా ప్రాధాన్యతనిచ్చి ప్రసారం చేసింది. ఇదే తరుణంలో ఎన్నికల ప్రచారం చేస్తున్న మోడీ మాత్రం యు.పి ఇదే విధంగా అభివృద్ధి కావాలంటే మరోసారి యోగి ప్రభుత్వం తెచ్చుకోవాలని ప్రజలకు చెప్పారు. అంటే ఆయన కోణం రాష్ట్రానికే పరిమితం కాగా తన కుడి భుజమైన షా ప్రధాని పదవికే ఎసరు పెట్టడం గమనించదగ్గది.
గత ఏడాది శాసనసభ ఎన్నికలలో ఓడిపోవడం, తర్వాత రైతాంగ ఉద్యమానికి తల వంచడం, ఆర్థిక రంగంలో ఒడుదుడుకులు, గొప్పగా బలపర్చిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఓటమి, ప్రతిపక్షాల ఐక్యతా యత్నాలు మోడీకి తిరుగులేదనే భ్రమను కరిగించాయి. ఆఫ్ఘనిస్తాన్ నుంచి రష్యా ఉక్రెయిన్ వరకూ మోడీ ప్రపంచ ప్రతిష్ట ప్రచారం ప్రహసనమని తేలింది. అయినా ఇప్పటికీ వ్యక్తిగతంగా ఆయన సమీపంలో ఎవరూ లేరనే భావన బతికించడానికి మధ్యమధ్యలో సర్వేలు ప్రకటిస్తుంటారు. రాహుల్ గాంధీతోనో రాష్ట్రాల నేతలతోనో పోల్చి తనే చాలా పైన వున్నాడని చెబుతుంటారు. కాని బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ శ్రేణులలోనే మోడీ మరోసారి గెలవగలరా అని సందేహాలు పెరుగుతున్నాయి. తన తర్వాత అమిత్ షా అన్నప్పటికీ జనాకర్షణ లేదనే అంశం వెనక్కు లాగుతుంది. ఈ నేపథ్యంలోనే కొందరి పేర్లను ప్రచారంలోకి తీసుకురావాలన్నది సంఫ్‌ు వ్యూహంగా కనిపిస్తున్నది. అక్కడ మనిషి కన్నా మతతత్వ రాజకీయాలే ముఖ్యం గనక, ఎలాగోలా అధికారంలోకి రావడం కోసం ఎలాంటి విన్యాసాలైనా చేస్తారు. బిజెపికి భారీగా నిధులిచ్చే కార్పొరేట్ వర్గాలు కూడా మోడీకి మారుగా మరో మొహం వెతుక్కోవాలా అని చూస్తున్న సూచనలున్నాయి. సర్వశక్తివంతుడుగా టముకు వేసుకున్న ఒక ప్రధాని వుండగా మరొకరిని ప్రత్యామ్నాయంగా చూపించడానికి ఇవన్నీ కారణాలే. ఈ నెల పదవ తేదీన వెలువడే అయిదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల ఫలితాలతో ఈ క్రమంలో హెచ్చు తగ్గులుండొచ్చు. కాని పదేళ్ల లోపునే ప్రజా వ్యతిరేకత మూట కట్టుకున్న ఫలితమే ఈ మల్లగుల్లాలన్నీ. ఇవి ప్రజల దృష్టి మరల్చే ఎతఎ్తగడలూ కావచ్చు. వ్యక్తులపై తోసి తమ పునాదిని కాపాడుకునే వ్యూహమూ కావచ్చు. అన్నిటినీ మించి ప్రధాని అవుతాడనే ఆశతో యోగిని ప్రజలు గెలిపిస్తారనే ఆశ కూడా కావచ్చు.
పీ పీ










