Jan 12,2022 07:23

    ప్రధాని నరేంద్ర మోడీ పంజాబ్‌ పర్యటన నుంచి అర్ధాంతరంగా వెనుదిరగడానికి నిజంగా భద్రతాపరమైన లోపాలే కారణమా అన్నది విచారణలో కానీ తేలదు. దీనిపై విచారణకు సుప్రీం కోర్టు రిటైర్డు న్యాయమూర్తి నేతృత్వంలో ముగ్గురు సభ్యులతో ఇప్పటికే ఒక కమిటీని వేసింది. ఈ స్వతంత్ర విచారణ కమిటీ ప్రధాని భద్రతా లోపాలకు సంబంధించిన అంశానికే పరిమితం కాకుండా, ప్రధాని ప్రాణాలకు ప్రమాదం ఎక్కడి నుంచి ఉందో కూడా తేల్చితే బాగుంటుంది. ప్రధాని భద్రతకు సంబంధించి లోపాలేవైనా ఉంటే వాటిని గుర్తించి, తగు దిద్దుబాటు చర్యలు తీసుకోవాల్సిందే, భద్రతా కారణాల వల్ల ఇద్దరు మాజీ ప్రధానులను దేశం ఇప్పటికే కోల్పోయింది. అందువల్ల ప్రధాని భద్రత విషయంలో రాజీ పడకూడదు. అయితే, జనవరి 5న ప్రధాని మోడీ పంజాబ్‌లో పర్యటనను ఆకస్మికంగా రద్దు చేసుకుని వెనుదిరగడానికి భద్రతా లోపమే కారణమంటే నమ్మశక్యంగా లేదు. బిజెపి కపట నాటకాల గురించి ఎరిగినవారు అసలు నమ్మరు. ఫిరోజ్‌పూర్‌ బహిరంగ సభ అట్టర్‌ ఫ్లాప్‌ కావడమే మోడీ వెనుదిరగడానికి అసలు కారణమని పంజాబ్‌ ముఖ్యమంత్రి చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ చేసిన ప్రకటనను కొట్టిపారేయడానికి వీల్లేదు. ఏడు వేలమందికి కుర్చీలు వేస్తే ఏడు వందల మంది కూడా రాలేదని, దీంతోముఖం చెల్లకే మోడీ వెనుదిరిగారనడానికి పత్రికల్లో వచ్చిన ఫోటోలే సాక్ష్యం. మొదట నిర్ణయించిన ప్రణాళిక ప్రకారం ప్రధాని మోడీ భటిండా విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో నేరుగా ఫిరోజ్‌పూర్‌ వెళ్లాల్సి ఉంది. ఈ ప్లాన్‌ను ఆఖరి నిమిషంలో పక్కన పెట్టి రోడ్డు మార్గంలో, అదీ వంద కిలోమీటర్లకుపైగా దూరం ప్రయాణానికి వెళ్లాలని నిర్ణయించారు. అప్పటికప్పుడు రూటును మార్చడంలో ఆంతర్యం తెలియనిదేమీ కాదు. భటిండా నుంచి వంద కిలో మీటర్ల దూరం ప్రయాణించిన తరువాత రైతుల నిరసన కారణంగా ఫ్లై ఓవర్‌పై 15-20 నిమిషాలసేపు ప్రధాని కాన్వారు నిలిచిపోయింది. అలాంటప్పుడు దేశ నాయకుడు ఎలా వ్యవహరించాలి. ప్రధాని కాన్వారుకు కిలో మీటరు దూరంలో నిరసన తెలుపుతున్న రైతుల ప్రతినిధులను పిలిపించుకుని వారికి భరోసా ఇచ్చి పంపితే ఏ సమస్యా ఉండేది కాదు. అలా చేస్తే ప్రధాని ప్రతిష్ట కూడా పెరిగి ఉండేది. దేశ ప్రధాన సేవకుడినని చెప్పే మాటలకు పూర్తి భిన్నంగా ఆ రోజు మోడీ వ్యవహరించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రైతులు తన ప్రాణాలకు ముప్పుగా ప్రధాని భావించడం ఎంతవరకు కరెక్టు? ఢిల్లీకి తిరిగివచ్చిన వెంటనే చేసిన ట్వీట్లను చూస్తే ప్రధానిపై ఏదో హత్యాయత్నం జరిగిందన్న భావన కలుగుతుంది. వాస్తవంగా అక్కడ అలాంటి వాతావరణమే లేదు. బిజెపికి చెందిన ఒక గుంపు పార్టీ జెండా పట్టుకుని ప్రధాని కాన్వారు కు దగ్గరగా వచ్చి మోడీకి అనుకూలంగా నినాదాలు ఇచ్చిన దృశ్యాలకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు 16 మాసాలపాటు శాంతియుత మార్గంలో పోరాటం చేస్తూ, 700 మంది రైతులు ప్రాణాలొదిలితే ప్రధాని కించిత్‌ కూడా విచారం వ్యక్తం చేయలేదు. పైగా పోరాడుతున్న రైతులను తన ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్ర పన్నిన ఖలిస్తానీయులుగా నిందించారు. మేఘాలయ గవర్నరు సత్యపాల్‌ మాలిక్‌తో జరిగిన సంభాషణలో 'రౖతులు నా కోసం చనిపోయారా?' అని ప్రశ్నించారు. అటువంటి వ్యక్తి నుంచి ఇటువంటి వ్యాఖ్యలు రావడంలో ఆశ్చర్యమేమీ లేదు. పంజాబ్‌లో ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అక్కడి కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి వేసిన కుటిల ఎత్తుగడలో భాగమే ఇది అన్న వాదన వినిపిప్తోంది. భద్రతా లోపాలపై విచారణ జరగకుండానే పంజాబ్‌ అధికారులకు మోడీ ప్రభుత్వం షోకాజ్‌ నోటీసులు జారీ చేయడంలో ఔచిత్యమేమిటి? ఈ అంశం తమ ముందు విచారణలో ఉండగా, పంజాబ్‌ అధికారులకు షోకాజ్‌ నోటీసులు ఎలా జారీ చేస్తారు? మీరే అంతా చేసుకుంటే కోర్టు జోక్యాన్ని ఎందుకు కోరడం అని సుప్రీం చీఫ్‌ జస్టిస్‌ సంధించిన ప్రశ్నలకు కేంద్రం వద్ద సమాధానం లేదు. లఖింపూర్‌ ఖేరి కేసులో సూత్రధారిని కేంద్ర మంత్రివర్గంలో ఒక వైపు కొనసాగిస్తూ, మరో వైపు పంజాబ్‌ రైతుల నుంచే తన ప్రాణాలకు ప్రమాదం ఉన్నట్లు ప్రధాని మాట్లాడడమే విడ్డూరం. బెంగాల్‌లో పరాజయం తరువాత బెంబేలెత్తుతున్న బిజెపికి ఇప్పుడు పంజాబ్‌, యుపి, ఉత్తరాఖండ్‌, గోవా, మణిపూర్‌ అసెంబ్లీ ఎన్నికలు పెద్ద పరీక్షగా నిలిచాయి. అందుకే ప్రజా సమస్యలను చర్చకు రానివ్వకుండా ప్రజల దృష్టిని మళ్లించడానికి భావోద్వేగ అంశాలను ముందుకు తేవాలని బిజెపి యత్నిస్తున్నది. ప్రధాని భద్రత గురించి బిజెపి ఎంతగా రాద్ధాంతం చేసినా ప్రజల నుంచి స్పందన మాత్రం లేదు. బిజెపి ఆడుతున్న ఈ కపట నాటకాన్ని ప్రజలు గ్రహించారు. సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన త్రిసభ్య విచారణ కమిటీ దీనిపై లోతుగా విచారించి మరిన్ని వాస్తవాలను బయటపెడుతుందని ఆశిద్దాం.