ప్రజాశక్తి-విజయవాడ : విజయవాడ నగర పాలక సంస్థ నిర్వహిస్తున్న డోర్ టు డోర్ చెత్త సేకరణ కార్యక్రమానికి ప్రజలంతా సహకరించాలని నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్‌పుండ్కర్ పేర్కొన్నారు. స్థానిక 18 వ డివిజన్ రాణిగారితోటలో అంటోనీ వీధి , బాలాస్వామి వీధి పలు ప్రాంతాల్లోని శానిటేషన్ మస్టర్ పాయింట్‌ను కమిషనర్ శనివారం ఉదయం తనిఖీ చేశారు. డివిజన్ పరిధిలోని శానిటేషన్ సిబ్బంది హాజరు పట్టికను కమిషనర్ పరిశీలిం చారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లా డుతూ... హౌటళ్లు, వ్యాపార వాణిజ్య కార్యాలయాల నిర్వాహకులు బహిరంగంగ ప్రదేశాల్లో చెత్తను వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ముందస్తు అనుమతి లేకుండా విధులకు గైర్హాజరు అయిన సిబ్బందికి నోటీసులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. నగరంలో ఎక్కడైనా రోడ్లపై చెత్త వేస్తే వారికి జరిమానాలు విధించాలని అధికారులను ఆదేశించారు. అలాగే చెత్త వేస్తున్న ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు, సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ ఆరోగ్య శాఖాధికారులు, హెల్త్ ఆఫీసర్లు, శానిటరీ సూపర్వైజర్లు, శానిటరీ ఇన్స్ పెక్టర్లు, శానిటరీ సెక్రెటరీలు, సచివాలయం సిబ్బంది మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.










