యు.పి.లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ప్రధాని మోడీ దాదాపు ప్రతీ రోజూ రాష్ట్రం లోనే తిరుగుతున్నారు. ఆ కార్యక్రమం ఏదైనప్పటికీ, స్టేజి మీద కనపడేది మోడీ ఒక్కరే. ఎత్తైన వేదిక మీద లేజర్ కిరణాల మెరుపుల మధ్య మోడీ దర్శనమిస్తూ ఒకసారి సర్వాంగసుందరంగా కనిపించే కాశీ దేవాలయాన్ని చూపించడం, మరోసారి డ్వాక్రా మహిళలకు నగదు బదిలీ ప్రకటించడం, ఇంకోసారి మరో పథకాన్ని ప్రకటించడం చేస్తున్నారు. ఇక ప్రతిపక్షాల మీద విషాన్ని చిమ్మడం ఆయన ప్రసంగాల్లో తప్పనిసరిగా ఉంటుంది. ముఖ్యంగా అఖిలేష్ యాదవ్ మీద, ఆ తర్వాత ముస్లింల మీద దాడి ఉంటుంది. ఐతే అలా ప్రకటించిన కానుకల్లో వాస్తవంగా తమకు ఒరిగేది ఏముందోనని ప్రజలు వెతుక్కుంటున్నారు. వారికి అందులో దక్కేదేమీ కానరావడం లేదు.
డిసెంబరు 21న ప్రయాగ్‌రాజ్ సభకు రాష్ట్రం లోని పలు జిల్లాల నుండి మహిళలను బస్సుల్లో తరలించారు. తమను బలవంతంగా బస్సులెక్కించారని, గంటల తరబడి చలిలో తిండీ తిప్పలూ లేకుండా ప్రయాణం చేసి వచ్చామని, గతుకుల రోడ్ల మీద ప్రయాణంతో ఒళ్ళంతా హూనం అయిపోయిందని వారు టివి రిపోర్టర్ల ముందు వాపోయారు. మోడీ ఒక ఐంద్రజాలికుడిలా స్టేజి మీదకి వచ్చి ఒక బటన్ నొక్కగానే వారి ఖాతాల్లోకి డబ్బు జమ అయిపోయింది. ఐదేళ్ళ యోగి పాలనలో వారి జీవితాలే మారిపోయాయని మోడీ ప్రకటించారు. మహిళలకు, వారి కుమార్తెలకు అందే సహాయంతో వారంతా వ్యాపారవేత్తలు కానున్నారని ప్రకటించారు.
ఇంతకీ వారి ఖాతాల్లో జమ అయింది రు.20 కోట్లు. అది లక్షమంది లబ్ధిదారులకు లభించనుంది. ఆ పథకం పేరు ''ముఖ్యమంత్రి కన్యాకుమారి సుమంగళ యోజన''. ఆరు వాయిదాల్లో వారి ఖాతాల్లో రు.15,000 చొప్పున జమ అవుతాయి. పుట్టిన దగ్గర నుండి డిప్లొమా కోర్సు పూర్తి చేసేవరకూ అయ్యే ఖర్చు భరిస్తామని చెప్పి ఆ పథకాన్ని ప్రారంభించారు. అది 2019లో మొదలైంది. రాష్ట్రంలో ఆ పథకానికి అర్హులు దాదాపు 5 కోట్ల మంది బాలికలు ఉంటారు. వారి సంఖ్య ప్రతీ ఏడూ పెరుగుతుంది కూడా. కాని దానికి బడ్జెట్‌లో కేటాయించింది కేవలం రూ. 1200 కోట్లు. ఆ పథకం వలన ఇప్పటిదాకా లబ్ధి పొందినది 5 లక్షల 85 వేల మంది మాత్రమే. మూడు లక్షల రూపాయల వార్షికాదాయం దాటి వుంటే ఆ కుటుంబం లోని బాలికలకు అర్హత లేదని, ఇద్దరికి మించి పిల్లలు గనుక ఉంటే అటువంటి కుటుంబాలకూ పథకం వర్తించదని, ఇలా రకరకాల ఆంక్షలతో ఆ పథకం పరిధిని కుదించారు. మెజారిటీ పేద, దళిత, ముస్లిం కుటుంబాల బాలికలు ఈ పథకం పరిధికి దూరంగా ఉండిపోతున్నారు. ఇప్పుడు ఎకాయెకిన ఓ లక్షమందికి తలా రూ. 2000 చొప్పున జమ చేసి చేతులు దులుపుకున్నారు.
ఇంకో బటన్ నొక్కి రూ. 1000 కోట్లు 5,58,700 డాక్రా గ్రూపుల ఖాతాల్లో జమ చేశారు మోడీ. ఒక్కో గ్రూపుకి రూ. 17,000 చొప్పున జమ అయింది. ఆ సొమ్ముతో ఆ గ్రూపు లోని మహిళలకు స్వయం ఉపాధి శిక్షణ కల్పిస్తారు. చితికిపోయిన ఆర్థిక పరిస్థితుల్లో ఉన్న మహిళలకు కావలసినది ఆర్థిక తోడ్పాటు. చాలా చిన్న రాష్ట్రాలతో పోల్చుకున్నా యు.పి.లో ఉన్న డ్వాక్రా గ్రూపుల సంఖ్య చాలా తక్కువ. గతంలో ఇచ్చిన రుణాలను సైతం చెల్లించలేక వాటిలో చాలావరకు మూతబడ్డాయి. మహిళలంతా మైక్రో ఫైనాన్సు రుణాల ఉచ్చుల్లో ఇరుక్కుని వున్నారు. ఆ సంస్థలు తమ బకాయిలను వసూలు చేసుకోడానికి ఎటువంటి నిర్బంధ పద్ధతులను అనుసరిస్తాయో అందరికీ తెలిసినదే. ఇప్పుడు రాష్ట్రం అంతటా డ్వాక్రా గ్రూపులను ఏర్పాటు చేసి వారికి అతి తక్కువ వడ్డీతో గాని వడ్డీ లేకుండా గాని రుణాలను అందించాలి. అప్పుడే కొంతైనా ఊరట లభిస్తుంది. కాని ఆ సభలో ప్రకటించినది ఎందుకు ఉపయోగపడుతుంది ?
రెండో బటన్ నొక్కాక, మోడీ ''బేటీ పఢావో, బేటీ బచావో'' కార్యక్రమం యు.పి.లో విజయవంతంగా అమలు జరిగిందని, బిజెపి పాలనలో మహిళలంతా చాలా ఆనందంగా ఉన్నారని చెప్పుకొచ్చారు. కాని యు.పి. కి సంబంధించిన చేదు నిజం ఏమంటే శిశు జననాలలో లింగ నిష్పత్తి 1000 మంది మగపిల్లలకు 902 మంది ఆడపిల్లలు ఉన్నారు. 2011లో ఇది 1000:899 ఉంది. ఏం మారింది? నిజానికి 21 జిల్లాల్లో ఇది 1000:850 గా ఇప్పుడు ఉంది.
కరోనా తర్వాత తిరిగి స్కూళ్ళు తెరిచిన అనంతరం 54 శాతం మంది ఆడపిల్లలు పాఠశాలలకు పోవడం మానుకున్నారు. ఇది టైమ్స్ ఆఫ్ ఇండియా సర్వేలో వెల్లడైంది. కరోనా కాలంలో చదువులు దెబ్బ తినకుండా యు.పి. ప్రభుత్వం ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ ఫోన్లు వంటివి పేద పిల్లలకు అందుబాటు లోకి తీసుకురాలేదు. మధ్యాహ్న భోజనానికి ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయలేదు. యు.పి.లో బాల్య వివాహాలు వేగంగా పెరిగాయని నివేదికలు వెల్లడిస్తున్నాయి.
2013తో పోల్చితే 2020లో దళిత మహిళలపై అత్యాచారాలు 43 శాతం పెరిగాయని జాతీయ క్రైం రిపోర్టు బ్యూరో నివేదిక వెల్లడి చేసింది. ప్రధాని పర్యటనకు ముందరి నెలలోనే యు.పి.లో 9 ఉదంతాలు ఉన్నాయి. హత్రాస్ లో 2020లో వాల్మీకి కులానికి చెందిన ఒక మహిళను నలుగురు అగ్రవర్ణ యువకులు అత్యాచారం చేసి చంపేసిన వైనం దేశమంతటా వెలుగులోకి వచ్చింది. కాని యు.పి. ముఖ్యమంత్రి అటువంటిదేమీ జరగనేలేదని బుకాయించారు. ఆ మహిళ మృతదేహాన్ని బలవంతంగా కుటుంబం నుండి స్వాధీనం చేసుకుని అర్ధరాత్రి పోలీసులతో తగులబెట్టించారు. ఇప్పటికీ ఆ కేసు నత్త నడకతో సాగుతోంది. కాని ప్రధాని తన ప్రసంగంలో ఎక్కడా అత్యాచార బాధితుల పట్ల సానుభూతిని కాని, విచారాన్ని కాని వ్యక్తం చేయనేలేదు. పైగా గర్భిణీ స్త్రీల సంక్షేమం పట్ల ప్రభుత్వం చాలా చర్యలు తీసుకుందని గొప్పలు చెప్పారు. వాస్తవం వేరేగా ఉంది. యు.పి లో లక్ష ప్రసవాలకు 197 మంది మహిళలు మరణిస్తున్నారు. దేశంలోనే అత్యధికంగా ప్రసూతి మరణాలు సంభవిస్తున్న రాష్ట్రాల్లో యు.పి. ఒకటి. కేవలం 67 శాతం ప్రసవాలు మాత్రమే ఆస్పత్రుల్లో జరుగుతున్నాయి. అదే కేరళలో 99 శాతం ప్రసవాలు ఆస్పత్రుల్లో జరుగుతున్నాయి. పుట్టిన ప్రతీ 10,000 మంది శిశువుల్లో ఏడాదిలోపు మరణిస్తున్న వారి సంఖ్య యు.పి.లో 47. అదే కేరళలో 7.
ఇక వంట గ్యాస్ పథకం 'ఉజ్వల', మరుగుదొడ్ల నిర్మాణం, తాగునీటి సరఫరా ా వీటి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. మోడీ ప్రసంగంలో వల్లించిన లెక్కలకు వాస్తవానికి తేడా కోట్లలోనే ఉంది. రెండున్నర కోట్ల మరుగుదొడ్లు నిర్మించినట్టు మోడీ ప్రకటించారు. కాని కట్టినవి ఒకటిన్నర కోట్లకన్నా తక్కువే. వాటిలోనూ వాడకానికి పనికిరానివి చాలా ఉన్నాయి. ఒక గ్రామం బహిరంగ మల విసర్జన పద్ధతి నుండి విముక్తి (ఒ.డి.ఎఫ్) చెందిందని ప్రకటించాలంటే దానికి ముందు అక్కడ సర్వే జరగాలి. కాని యు.పి లో 97,000 గ్రామాలు ఒడిఎఫ్ గ్రామాలుగా ప్రకటించగా, వాటిలో 33,000 గ్రామాల్లోనే సర్వేలు జరిగాయి. ఉదాహరణకి, సెమ్రా అనే ఒక గ్రామంలో సర్వే ప్రకారం 366 ఇళ్ళకు మరుగుదొడ్లు నిర్మించాల్సి వుండగా 264 మాత్రమే నిర్మించారు. నిజానికి ఇంకో 300 ఇళ్ళను సర్వే నుండి మినహాయించారు. కాని ఆ గ్రామం ఒ.డి.ఎఫ్ గా ప్రకటించారు.
తమ వాస్తవ జీవితాల్లోని అవస్థలను, మోడీ ప్రసంగాల్లో వినవస్తున్న అవాస్తవాలను పోల్చి చూసుకుంటున్న యు.పి. మహిళలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు.
( సంక్షిప్తానుసరణ )

సుభాషిణి ఆలీ
/ వ్యాసకర్త : సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు, మాజీ ఎం.పి /










