ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ రాష్ట్రానికి ఆశాజనకంగా లేదని టిడిపి అధ్యక్షులు చంద్రబాబు నాయుడు విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాలను సాధించడంలో వైసిపి ప్రభుత్వం మరోసారి విఫలమైందని మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 28 మంది వైసిపి ఎంపిలు ఉండి.. ఏం సాధించారని, ప్రాజెక్టులు, నిధుల కేటాయింపుల విషయంలో కేంద్రంపై ఒత్తిడి తేవడంలో సిఎం జగన్ పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. వైసిపి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తరువాత ఇప్పటికి కేంద్రం నాలుగు బడ్జెట్‌లు ప్రవేశపెట్టిందని, 28 మంది ఎంపిలు ఉండి రాష్ట్రానికి ఏమీ సాధించలేదని పేర్కొన్నారు. వైసిపి ఎంపిలకు సొంత ప్రయోజనాలపై తప్ప రాష్ట్ర ప్రయోజనాలపై శ్రద్ద లేదని విమర్శించారు. రైతులకు మేలు ఎలా చేయాలో బడ్జెట్‌లో స్పష్టత లేదని తెలిపారు. పంటలకు మద్దతు ధర విషయంలో ఎటువంటి సానుకూల నిర్ణయాలూ లేకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. పేద వర్గాలు, కరోనాతో దెబ్బతిన్న రంగాలకు ఎటువంటి చేయూతనిస్తారో కూడా చెప్పలేదని విమర్శించారు. జాతీయ ఆహార భద్రత పథకం అమలులో కేంద్రం.. తన బాధ్యత నుంచి తప్పుకునే ప్రయత్నం చేయడం సరికాదన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు పేదలకు భారంగా మారిన పరిస్థితుల్లో వాటిని తగ్గించేందుకు ఎటువంటి చర్యలనూ ప్రకటించలేదని తప్పుబట్టారు. నదుల అనుసంధానంలో కేంద్ర ప్రతిపాదనలను చంద్రబాబు స్వాగతించారు. తమ ప్రభుత్వ హయాంలో కృష్ణా-గోదావరి నదుల అనుసంధానం చేయడం ద్వారా 7ఏళ్ల క్రితమే ఈ ప్రక్రియకు నాంది పలికామని తెలిపారు. విద్యుత్ వాహనాలను ప్రోత్సహించేం దుకు ప్రవేశపెట్టిన నూతన విధానాన్ని, డిజిటల్ కరెన్సీ విషయంలో కేంద్రం ప్రతిపాదనలు బాగున్నాయని, సోలార్ రంగాన్ని ప్రోత్సహించడానికి కేంద్రం ముందుకు రావడం సముచితమని పేర్కొన్నారు.
రాష్ట్రానికి అన్యాయం: అచ్చెన్నాయుడు
కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని టిడిపి రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు విమర్శించారు.వైసిపి ఎంపిల చేతకానితనంతోనే రాష్ట్రానికి మొండిచేయి మిగిలిందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
మూడు రూపాయలకే బియ్యం : సోము వీర్రాజు
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : దేశ వ్యాప్తంగా 67 శాతం మంది ప్రజలకు రెండు, మూడు రూపాయలకే బియ్యం అందిస్తూ కేంద్ర ప్రభుత్వం సామాజిక బాధ్యత నిర్వహిస్తోందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పేర్కొన్నారు. కేంద్ర బడ్జెట్‌పై మంగళవారం ఆయన స్పందించారు. బడ్జెట్ పారదర్శకమైన సమీకృత అభివృద్దికి ఈ బడ్జెట్ నాందని, డిబిటి ద్వారా పేదలకు నేరుగా ఆర్ధిక సాయం లభిస్తుందన్నారు.










