కరోనా కష్టకాలంలో ప్రజలను ఆదుకోవడానికి బదులుగా తమ సొంత అజెండాను రుద్దడానికి నరేంద్ర మోడీ నేతృత్వం లోని బిజెపి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటికే ఆర్థిక రంగంలో కార్పొరేట్ల ఖజానాలు నింపే విధానాలు ప్రారంభించిన మోడీ సర్కారు విద్యారంగంపై దృష్టి సారించింది. కరోనా విస్తరణ నేపథ్యంలో విద్యార్థులపై ఒత్తిడి తగ్గించే పేరిట టక్కుటమార విద్యలకు దిగుతోంది. ఒక వ్యూహం ప్రకారం ప్రగతి నిరోధక, మతోన్మాద అజెండాను ముందుకు తీసుకు వస్తోంది. సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సిబిఎస్‌ఇ)లో 30 శాతం సిలబస్ తగ్గింపు పేరిట కేంద్ర ప్రభుత్వం చేసిన నిర్వాకం అందులో ఒకటి. కరోనా తీవ్రస్థాయిలో కొనసాగుతుండటంతో విద్యార్థులకు కలిగే అకడమిక్ నష్టాన్ని తగ్గిస్తున్నామని, ముఖ్యమైన కోర్ అంశాలు మిస్ కాకుండా చూస్తున్నామంటూ సిబిఎస్‌ఇ చేసిన ప్రకటనలో తప్పు పట్టాల్సిందేమీ లేదు. కానీ ఆచరణలో జరిగిందేమిటి? భిన్నత్వంలో ఏకత్వానికి, ప్రజాస్వామ్య స్ఫూర్తికి, రాజ్యాంగ విలువలకు పట్టం కట్టే పాఠ్యాంశాలన్నింటిని 9 నుండి 12వ తరగతి వరకు సిలబస్‌లో తొలగించారు. వీటికి ఇంటర్నల్ మార్కులు ఉండవని, బోర్డు పరీక్షల్లోనూ వీటి నుండి ప్రశ్నలు రావని ప్రకటించారు. భావి పౌరునిగా ఎదిగే ఒక విద్యార్థికి ప్రాథమికోన్నత స్థాయి విద్యలో ఇవి కాకపోతే మరేవి ముఖ్యమౌతాయి? బిజెపి ఏలుబడి లోని రాష్ట్ర ప్రభుత్వాలు మౌఢ్యాన్ని పెంచే పాఠ్యాంశాలను విద్యార్థులపై బలవంతంగా రుద్దుతున్నాయి. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం తన పరిధి లోని సిబిఎస్‌ఇలో ఈ తరహా చర్యలకు దిగడం దారుణం.
పదకొండవ తరగతి విద్యార్థులకు పొలిటికల్ సైన్స్‌లో సమాఖ్యతత్వం, పౌరసత్వం, జాతీయత మరియు లౌకికవాదం అంశాలను పూర్తిగా తొలగించారు. నిజానికి ఇవి మన రాజ్యాంగ ప్రాథమిక లక్షణాలు. అనేక సందర్భాల్లో న్యాయ వ్యవస్థ ఇదే విషయాన్ని ధృవీకరించింది. ఇప్పుడు, వాటినే చదవాల్సిన అవసరం లేదని చెప్పడం నేరుగా రాజ్యాంగంపై దాడికాక మరేమవుతుంది? అదేవిధంగా 12వ తరగతి రాజకీయ శాస్త్రంలో పర్యావరణ అంశాలతో పాటు, భారతదేశంలో నూతన సామాజిక ఉద్యమాలు, ప్రాంతీయ ఆకాంక్షలు అనే భాగాన్ని పూర్తిగా తొలగించారు. ప్లానింగ్ కమిషన్‌ను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రద్దు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా, పాఠ్యపుస్తకాల్లోంచి ప్రణాళికా విధానాన్నే తొలగించింది. దీంతో పాటు పంచవర్ష ప్రణాళికలను వాటి ద్వారా జరిగిన అభివృద్ధిని చదవాల్సిన అవసరం లేదని తేల్చివేసింది. ఏ దేశ అభివృధ్థికైనా ఇరుగు పొరుగు దేశాలతో సత్సంబంధాలు అత్యంత కీలకమన్న విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నరేంద్రమోడీ ప్రభుత్వం వచ్చిన తరువాత ఒకదాని తరువాత ఒకటిగా పొరుగు దేశాలతో విభేదాలు పెరగడం తప్ప, కొత్తగా సౌభ్రాతృత్వం వర్థిల్లిందేమీ లేదు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, మయన్మార్‌లతో కొనసాగిన సంబంధాల చరిత్రను చదవాల్సిన అవసరం లేదని సర్కారు పేర్కొంది. గతం బోధించి వర్తమానంలో దిగజారిన సంబంధాలపై ప్రశ్నలు ఎదుర్కునే దానికన్నా ఏదో ఒక సాకుతో ఆంక్షలు విధించడమే మేలు అన్న వైఖరిని తీసుకున్నట్టుంది. తొమ్మిదవ తరగతిలో ఆహార భద్రత, రాజ్యాంగ నిర్మాణ అంశాలను తొలగించారు. అధికారం కోసం ఏ గడ్డినైనా కరవచ్చని, ఎంతటి రక్తపాతానికైనా తెగబడవచ్చని నమ్మి, దానిని ఆచరించేవారికి ప్రజాస్వామ్యం ఏమైతే ఏమిటి? అందుకే దానికి సంబంధించిన పాఠ్యాంశాలను పదవ తరగతి సిలబస్ నుండి తొలగించారని పలువురు విమర్శిస్తున్నారు.
కరోనాను అడ్డం పెట్టుకుని విద్యార్థులకు మేలు చేసే పేరుతో రాజ్యాంగపరమైన అంశాలను సిలబస్ నుండే కాదు, భావితరాల మస్తిష్కాల నుండే తొలగించే కుట్ర ఇది! ఈ చర్య వెనుక ప్రజలను చీల్చి, అసహనం పెంచి, మతతత్వ, నిరంకుశ భావజాలాన్ని పంచే సంఫ్‌ుపరివార్ శక్తులున్నాయి. మోడీ ప్రభుత్వాన్ని వెనుక నుండి నడిపిస్తున్న ఆ శక్తులే కష్టకాలంలో ప్రజలను కాటు వేయడానికి కాసుక్కూర్చునాయి. అందుకే, మేధావులు, ప్రజాతంత్ర శక్తులు మరింత అప్రమత్తంగా ఉండాలి. ప్రజలకు వాస్తవాలను వివరించాలి. వైరస్ విస్తరణ నేపథ్యంలో అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటూనే ఈ రాజ్యాంగ వ్యతిరేక చర్యను ప్రతిఘటించి తీరాలి. ప్రజాస్వామ్యాన్ని, భావి భారతాన్ని పరిరక్షించుకోవాలి.










