Dec 26,2022 20:01

మాట్లాడుతున్న సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి

ప్రజాశక్తి -కందుకూరు :ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డికి దమ్ము ఉంటే శ్వేత పత్రం విడుదల చేసి ఎవరి ప్రభుత్వ హయాంలో అప్పులు ఎక్కువ చేశారో తేల్చాలని టిడిపి పొలిట్‌ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి సవాల్‌ విసిరారు. పట్టణంలోని టిడిపి కార్యాలయంలో సోమవారం జరిగిన విలేకర్ల సమావేశంలో సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి మాట్లాడారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి టిడిపి ప్రభుత్వ హయాంలో కంటే తమ ప్రభుత్వమే అప్పులు తక్కువ చేసిందని చెప్పటం విడ్డూరంగా ఉందన్నారు. వైసిపి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అప్పు ఎంత చేశారో తెలవాలంటే శ్వేత పత్రం విడుదల చేయాలన్నారు. రూ. 9 లక్షల కోట్లు ప్రభుత్వం అప్పులు చేసిందని తెలిపారు. లక్ష 65 వేల కోట్లు బకాయిలు చెల్లించకుండా ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిందన్నారు. రాష్ట్రాన్ని అన్ని విధాల ముంచేశారని ఆయన విమర్శించారు. రాష్ట్రం చెడు విషయంలో నెంబర్‌ వన్‌ స్థానంలో ఉందన్నారు. మంచి విషయంలో రాష్ట్రం అద్వాన స్థితిలో ఉందన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎక్కడ పర్యటనకు వెళ్లిన జనం నీరాజనం పడుతున్నారన్నారు. ఈ నెల 28వ తేదీ కందుకూరు, 29న కావలి, 30న కోవూరు కోవూరు నియోజకవర్గాల్లో పర్యటిస్తారన్నారు. కందుకూరు నియోజకవర్గ టిడిపి ఇన్‌చార్జి ఇంటూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ జగన్మోహన్‌ రెడ్డి అవలం బిస్తున్న విధానాల కారణంగా ప్రజలు ఇసుకెత్తిపోయారన్నారు. ఈ నేపథ్యంలో కందుకూరు లో జరుగుతున్న చంద్రబాబు నాయుడు పర్యటనను 40వేల మందితో జరిగే విధంగా ప్లాన్‌ చేశామన్నారు. అనంతరం టీడీపీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో నేతలు మాట్లాడారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర , బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్ధన రెడ్డి, ఎంఎల్‌సి మంతెన సత్యనారాయణ రాజు, పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు దివి శివరాం, గూటూరు మురళి, కన్నబాబు, నియోజకవర్గ పరిశీలకురాలు కుసుమ కుమారి, కందుకూరు పట్టణ, మండల పార్టీల అధ్యక్షులు ఇతర నాయకులు పాల్గొన్నారు.