చంద్రబాబు నాయుడు రాజధాని పేరుతో 33 వేల ఎకరాల భూసమీకరణ చేసి, స్విస్ ఛాలెంజ్ పద్ధతి మొదలగు విధానాలతో కార్పొరేటు పద్ధతులు అవలంభించినప్పటికి బి.జె.పి. ఏమీ మాట్లాడలేదు. తరువాత జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం 3 రాజధానుల బిల్లు తెచ్చినప్పుడు బి.జె.పి నిర్దిష్టమైన విధానం అవలంభించలేదు. ఇప్పుడు రాజధాని రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా పాదయాత్రలో పాల్గొని, తిరుపతి సభలో పాల్గొన్నది. రాజధాని విషయంలో బిజెపి మొదటి నుండి రాజకీయ అవకాశవాదంతో వ్యవహరించింది. వ్యవహరిస్తున్నది.
ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టం 2014 ద్వారా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజించబడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలుగా ఏర్పడ్డాయి. రాష్ట్ర విభజన జరిగి 8 ఏళ్లు గడిచినప్పటికి, ఇప్పటికి విభజన చట్టంలో హామీలు అమలు చేయటంగాని, నాటి ప్రధాని హామీ ఇచ్చిన ప్రత్యేక హోదా ఇవ్వటంగాని....కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం చేయకుండా 5 కోట్ల మంది ఆంధ్రులకు అన్యాయం చేసింది. నరేంద్ర మోడీ నాయకత్వంలో కేంద్ర బిజెపి ప్రభుత్వం గత 8 ఏళ్లుగా రాష్ట్ర అభివృద్ధిని నిర్లక్ష్యం చేయటమే కాక, రాజధాని విషయంలో దోబూచులాట వైఖరి చేపట్టి, రాజకీయ స్వార్థానికి పూనుకున్నది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో తలమానికంగా ఉన్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించటానికి వేగంగా చర్యలు చేపడుతున్నది.
2014-19 మధ్య అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కేంద్రంతో రాజీపడి ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామన్నా రాజీ పడింది. 5 ఏళ్లపాటు కేంద్రంపై ఒత్తిడి తేలేకపోయినది. 2019లో గెలుపొంది రెండున్నరేళ్లు పూర్తి చేసుకున్న జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం విభజన హామీలు, ప్రత్యేక హోదా విషయంలో లోక్‌సభలో 23 మంది సభ్యులు ఉన్నప్పటికి, ఒత్తిడి తేకపోగా, బిజెపి కి కేంద్రంలో పూర్తి మెజారిటీ ఉన్నది. ఏమీ చేయలేకపోతున్నాం అనటం కేంద్రంతో పూర్తిగా రాజీ పడటమే. వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఈ విషయాలపై ఇంత వరకు ఒక అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయటంగాని, ప్రత్యేక హోదా కోసం పని చేస్తున్న ఉద్యమ సంఘాలతో సంప్రదించటంగాని చేయలేదు. బిజెపి కి సన్నిహితమైన జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ పరిస్థితి మరింత విచిత్రం. ఇటీవల ఆయన మంగళగిరి వద్ద గల రాష్ట్ర జనసేన కార్యాలయంలో విశాఖ ఉక్కుపై జరిపిన ఒక రోజు దీక్షలో విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేస్తున్న బిజెపి ప్రభుత్వం గురించి ఒక మాట కూడా మాట్లాడలేదు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ, ప్రతిపక్ష పార్టీగా ఉన్న జనసేన రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించటంలో విఫలం చెందాయి. రైతాంగ ఉద్యమ విజయం తర్వాతైనా ఈ 3 పార్టీలు ప్రజల మీద విశ్వాసంతో రాష్ట్ర అభివృద్ధి, ప్రయోజనాలను పరిరక్షించటానికి ఆలోచించకపోవటం ప్రజలను వంచించటమే.
అమలు జరగని విభజన హామీలు
ఇటీవల లోక్‌సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో 80 శాతం అమలు చేస్తామని మిగిలిన 20 శాతం అమలు చేయటానికి 2024 వరకు సమయం ఉందని చెప్పుకొచ్చారు. ఇది పూర్తిగా సత్య దూరం. అమలు చేసినవి 20 శాతం కూడా లేవు. విభజన చట్టంలోని ప్రధానమైన అంశాలేవీ అమలు జరగలేదు. విభజన తరువాత 2015-16 ఆర్థిక సంవత్సరం నాటికి రెవెన్యూ లోటును కేంద్రం భర్తీ చేయాలి. లోటును రూ. 16,078 కోట్లుగా అంచనా వేయగా, ఇప్పటికి కేంద్రం కేవలం రూ. 3,900 కోట్లు మాత్రమే ఇచ్చింది. ఈ చట్టం ప్రకారం రాయలసీమలో 4 జిల్లాలు, ఉత్తరాంధ్రలో 3 జిల్లాలు మొత్తం 7 జిల్లాలను వెనుకబడిన జిల్లాలుగా గుర్తించి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలి. ఇప్పటికి కేవలం రూ. 1400 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకుంది (బుందేల్ ఖండ్ తరహా ప్యాకేజీ ప్రకారం రూ. 24 వేల కోట్లు ఇవ్వాలి.) షెడ్యూల్ 9, 10లో ఉన్న 230 సంస్థల ఆస్తులను ఉమ్మడి ఆస్తులుగా గుర్తించి, రెండు రాష్ట్రాలు 58:42 నిష్పత్తిలో పంచుకోవాలి. ఇంతవరకు ఆచరణలో పంపిణీ జరగలేదు.
విభజన చట్టం షెడ్యూల్ 13లో 11 జాతీయ విద్యా సంస్థలను స్థాపించాలని ప్రతిపాదించారు. వీటికి రూ. 12 వేల కోట్లు వ్యయం చేయాలి. కాని ఇప్పటికి కేవలం రూ. 680 కోట్లు ఖర్చు చేశారు. విజయనగరంలో గిరిజన యూనివర్శిటీకి ఇంతవరకు స్థల సేకరణ జరగలేదు. అనంతపురం సెంట్రల్ యూనివర్శిటీలో బోధన సిబ్బందిగాని, వసతులుగాని లేవు. ప్రారంభమైన ఇతర సంస్థలలో ఎక్కువ భాగం అద్దె భవనాలలో కొనసాగుతున్నాయి.
13వ షెడ్యూల్‌లో పేర్కొన్న పరిశ్రమలు, మౌలిక వసతులు ఒక్కటి కూడా ప్రారంభం కాలేదు. దుగ్గరాజపట్నం వద్ద (తరువాత రామాయపట్నం అన్నారు) ఏర్పాటు చేస్తామన్న భారీ నౌకాశ్రయంగానీ, కడపలో ఏర్పాటు చేస్తామన్న సమగ్ర ఉక్కు కర్మాగారం గాని, చెన్నై- విశాఖపట్నం పారిశ్రామిక కారిడార్ గాని, గ్రీన్‌ఫీల్డ్ ముడి చమురు శుద్ధి కర్మాగారం గురించి గానీ, కేంద్రం పట్టించుకోలేదు. విశాఖపట్నంలో ఏర్పాటు చేయవలసిన రైల్వే జోన్ గురించి ఇంతవరకు నిర్దిష్టమైన నిర్ణయం చేయలేదు. మొత్తంగా పరిశీలిస్తే షెడ్యూల్ 13లో చెప్పిన 7 రకాల పరిశ్రమలలో ఒక్కటి కూడా ఇంతవరకు ఏర్పాటుకు నోచుకోలేదు. వాస్తవంగా 13వ షెడ్యూల్ లోని పరిశ్రమలు ఎక్కువ భాగం ప్రభుత్వ రంగంలో స్థాపించబడి, వేలాది ఉద్యోగ అవకాశాలను సృష్టించాలి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉపాధి అవకాశాలు కల్పించటంలో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నది.
విభజన హామీలలో పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం అత్యంత ముఖ్యమైనది. ఈ ప్రాజెక్టును చట్టంలో జాతీయ ప్రాజెక్టుగా గుర్తించారు. దీని నిర్మాణ వ్యయం పూర్తి బాధ్యత కేంద్రానిదే. 2017 నాటికి సవరించిన అంచనాల ప్రకారం రూ. 55,656 కోట్లు ఆమోదించారు. తరువాత సవరించిన అంచనాల ప్రకారం రూ. 47,617 కోట్లుకు తగ్గించారని చెప్పారు. ఇటీవల కేంద్ర జలశక్తి శాఖ సాగునీటి కంపోనెంట్ తగ్గించాలని చెప్పింది. ఇప్పుడు కేవలం రూ.20,398 కోట్ల మాత్రమే ఇస్తామని చెబుతున్నారు. పునరావాసానికే రూ. రూ.33 వేల కోట్లు ఖర్చు చేయవలసి ఉండగా, కేంద్రం చేస్తున్న నిర్ణయాల వలన ప్రాజెక్టు భవిష్యత్ ఏ విధంగా ఉండబోతుందో స్పష్టంగా లేదు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ వారు ఈ ప్రాజెక్టు గురించి ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకోవటం ప్రాజెక్టు నిర్మాణానికి దోహదపడే అంశం కాదు. ఇరువురు ఇతర పార్టీలతో కలిసి కేంద్రంపై ఒత్తిడి తేవాలి.
ప్రత్యేక హోదా మోసం
2014 ఫిబ్రవరి 20న రాజ్యసభలో నాటి ప్రధాని మన్మోహన్‌సింగ్ ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్‌కు 5 ఏళ్ల పాటు ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రతిపక్ష నేత అరుణ్‌జైట్లీ నాటి రాజ్యసభ సభ్యుడు వెంకయ్య నాయుడు పదేళ్లపాటు ఉండాలని ప్రతిపాదించారు. 1969లో ప్రణాళికా సంఘం ప్రత్యేక హోదా అనే పథకం ప్రతిపాదించగా...తరువాత కాలంలో 11 రాష్ట్రాలకు ఇచ్చారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం 2014లో అధికారం లోకి వచ్చాక ప్రత్యేక హోదా ఇవ్వకుండా గత 8 ఏళ్లుగా అనేక సాకులు చెప్పింది. ప్రణాళికా సంఘం రద్దయిపోయిందని, దాని స్థానంలో ఏర్పడిన నీతి ఆయోగ్ ద్వారా ఇవ్వలేమని చెప్పింది. 14వ ఆర్థిక సంఘం ప్రత్యేక హోదాగల రాష్ట్రాలకు, సాధారణ రాష్ట్రాలకు తేడా లేకుండా చేసిందని చెప్పింది. ప్రత్యేక హోదాగల రాష్ట్రాలకు 2017 నుండి 2027 వరకు ఇవ్వటానికి పారిశ్రామిక రాయితీల కింద కేంద్ర మంత్రివర్గం రూ. 27,415 కోట్లు మంజూరు చేసింది. అయినా ఆంధ్రప్రదేశ్ అధికార ప్రధాన ప్రతిపక్షం రెండూ నోరెత్తలేదు. చంద్రబాబు అధికారంలో ఉండగా ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజి ప్రకటిస్తే ఆయన అదే అద్భుతం అని పేర్కొన్నారు.
ఇటీవల నీతి ఆయోగ్ వైస్‌చైర్మన్ రాజీవ్‌కుమార్ బీహార్‌కు ప్రత్యేక హోదా ఇచ్చే అంశం పరిశీలనలో ఉందని పేర్కొనటం కేంద్రప్రభుత్వం ద్వంద్వ వైఖరిని స్పష్టంగా తెలియచేస్తుంది. ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రంతో రాజీ ధోరణి విడనాడి, ప్రత్యేక హోదా కోసం మిగిలిన పక్షాలతో కలసి ఒత్తిడి తేవాలి.
రాజధాని విషయంలో నాటకం
రాజధాని నిర్మాణ విషయంలో బి.జె.పి. ప్రభుత్వం మొదటి నుండి మోసం చేసింది. విభజన చట్టంలో సెక్షన్ 94(3) ప్రకారం రాజ్‌భవన్, హైకోర్టు, సచివాలయం, శాసనసభ, శాసనమండలి మొదలగు వాటి నిర్మాణానికి కేంద్ర ఆర్థిక సహకారం అందించాలి. దీనికి రూ. 42,935 కోట్ల ఖర్చు అవుతుందని అప్పట్లో అంచనా వేశారు. కేంద్రం ఇప్పటి వరకు రాజధాని నిర్మాణానికి కేవలం రూ. 1500 కోట్లు ఇచ్చింది.
చంద్రబాబు నాయుడు రాజధాని పేరుతో 33 వేల ఎకరాల భూసమీకరణ చేసి, స్విస్ ఛాలెంజ్ పద్ధతి మొదలగు విధానాలతో కార్పొరేటు పద్ధతులు అవలంభించినప్పటికి బి.జె.పి. ఏమీ మాట్లాడలేదు. తరువాత జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం 3 రాజధానుల బిల్లు తెచ్చినప్పుడు బి.జె.పి నిర్దిష్టమైన విధానం అవలంభించలేదు. ఇప్పుడు రాజధాని రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా పాదయాత్రలో పాల్గొని, తిరుపతి సభలో పాల్గొన్నది. రాజధాని విషయంలో బిజెపి మొదటి నుండి రాజకీయ అవకాశవాదంతో వ్యవహరించింది, వ్యవహరిస్తున్నది.
రాజధాని విషయంలో సిపిఎం నిర్దిష్టమైన, సూత్రబద్ధ మైన వైఖరి తీసుకున్నది. 3 బిల్లులను ప్రవేశపెట్టిన తరువాత కూడా పాలనా రాజధానిగా అమరావతి ఉండాలని స్పష్టం చేసింది. భూములు ఇచ్చిన రైతులకు న్యాయం జరగాలని, రాజధాని ప్రాంతంలో వ్యవసాయ కూలీలకు, దళితులకు న్యాయం జరగాలని అనేక ఉద్యమాలు నిర్వహించింది. రైతుల పాదయాత్రలో కూడా సిపిఎం కేంద్ర, రాష్ట్ర నాయకత్వం పాల్గొన్నది. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు 8 ఏళ్లుగా ముఖ్యంగా రాజధాని విషయంలో సైతం బిజెపి మోసం చేసింది. కాబట్టే బిజెపి పాల్గొన్న తిరుపతి సభలో సిపిఎం పాల్గొనలేదు.
రాజధాని విషయంలో జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం 3 రాజధానుల చట్టాలను రద్దు చేసింది. మళ్లీ కొత్త చట్టం తేకుండా, అమరావతిని పాలనా రాజధానిగా కొనసాగిస్తూ, భూములిచ్చిన రైతాంగానికి, రాజధాని ప్రాంతంలో గ్రామీణ పేదలకు న్యాయం చేయాలి.
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ
విశాఖ ఉక్కు కర్మాగారం బలిదానాలతో, ప్రాణ త్యాగాలతో ఏర్పడింది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు పేరుతో జరిగిన ఉద్యమంలో 32 మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాదిమంది రైతులు తమ భూములు ఇచ్చి నిర్వాసితులయ్యారు. గాజువాక, విశాఖపట్నం పరిసర ప్రాంతాలు ఎంతో అభివృద్ధి చెందాయి. వేలాదిమంది ఉద్యోగులకు, కార్మికులకు ఉపాధి అవకాశాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా లభించింది. విభజన చట్టంలో హామీ ఇచ్చిన విధంగా ప్రభుత్వ రంగంలో నూతన పరిశ్రమలు స్థాపించకపోగా, విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరిస్తామని పెట్టుబడులు ఉపసంహరిస్తామని కేంద్రం ప్రకటించటం దారుణమైన విషయం. గత సంవత్సర కాలంగా విశాఖలో వేలాదిమంది ప్రజలు, ఉద్యోగులు, కార్మికులు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం ఆమోదించినప్పటికి, కార్యాచరణ చేయకపోవటం సరైనది కాదు. ఇప్పటికైనా ఎ.పి ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిర్ణయాలు చేయాలి. అన్ని పార్టీలు, ప్రజా సంఘాలను కలుపుకుని విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కేంద్రంపై ఒత్తిడి తేవాలి.
రాష్ట్రాల హక్కులు హరించటం
మోడీప్రభుత్వం గత 8 ఏళ్లుగా సమాఖ్య స్ఫూర్తిని దెబ్బ తీసే విధంగా రాష్ట్రాల హక్కులను హరిస్తున్నది. రాష్ట్రాల ఆర్థిక వనరులలో కోత బెట్టింది. దీని వలన ఆంధ్రప్రదేశ్ కూడా అనేక అధికారాలను, వనరులను కోల్పోయింది. జి.యస్.టి విధానం పన్నులను కేంద్రీకరణ చేసిన ఫలితంగా ఆంధ్రప్రదేశ్ సుమారు 50 వేల కోట్ల ఆదాయం కోల్పోయింది. ఇటీవల కేంద్రం రద్దు చేసిన మూడు వ్యవసాయ చట్టాలు పూర్తిగా రాజ్యాంగ ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమైనవి. రైతాంగ ఆందోళన ఫలితంగానే వీటి రద్దు సాధ్యమైంది. పట్టణ సంస్కరణలు, విద్యుత్ సంస్కరణలు సహకార రంగ సంస్కరణల కోసం కేంద్రం చేసిన చట్టాలు ప్రజలపై భారాలు మోపుతాయి. వీటిని కేంద్రం ఒత్తిడి మేరకు రాష్ట్రాలు అమలు చేస్తే, రాష్ట్రాలు ప్రజా వ్యతిరేకత ఎదుర్కొనవలసి ఉంటుంది.
పై అంశాలన్నిటిని పరిశీలిస్తే గత 8 ఏళ్లుగా కేంద్రం లోని బి.జె.పి. ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు పూర్తిగా అన్యాయం చేయటమే కాక, ప్రజలను మోసం చేసింది. ఈ విధానాలకు వ్యతిరేకంగా, ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను పరిరక్షించుకునే విధంగా ఉద్యమించాలి.
/ వ్యాసకర్త : శాసన మండలి సభ్యులు,
సెల్ : 94402 62072 /
కె.ఎస్. లక్ష్మణరావు











