Jan 07,2022 07:03

నవంబర్‌ (2021) రెండవ వారంలో తొలుత దక్షిణాఫ్రికా లో కోవిడ్‌-19 వైరస్‌ యొక్క మరో కొత్త వేరియంట్‌ 'ఒమిక్రాన్‌' వెలుగు చూసింది. అక్కడ నమోదయిన అతి తక్కువ కాలంలోనే 70కి పైగా ప్రపంచ దేశాలకు వ్యాప్తి చెందింది. యూరప్‌, ఉత్తర అమెరికా దేశాల్లో డెల్టా వేరియంట్‌ వెనుక పట్టు పట్టి, దాని స్ధానంలో ఒమిక్రాన్‌ కేసులు వేగంగా పెరిగాయి. మన దేశంలో కూడా పలు రాష్ట్రాల్లో ఒమిక్రాన్‌ కేసులు వేగంగా నమోదవుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, తాజాగా దక్షిణ ఫ్రాన్స్‌ లో మరో కొత్త వేరియంట్‌ కేసులు 12 నమోదయినట్లు ఫ్రెంచి శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ వేరియంట్‌ లో ఒమిక్రాన్‌ కంటే ఎక్కువ సంఖ్యలో మ్యుటేషన్లు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ వేరియంట్‌ లో సుమారుగా 46 మ్యుటేషన్లు, 37 డిలీషన్లను గుర్తించారు. 'ఐహెచ్‌యు'గా నామకరణం చేసిన ఈ వైరస్‌ 'ఒమిక్రాన్‌' కంటే వేగంగా వ్యాప్తి చెందడమే గాక, వ్యాక్సిన్‌ వలన ఏర్పడ్డ వ్యాధి నిరోధక కణాల నుండి తప్పించుకోగలదనీ భావిస్తున్నారు.

ఒమిక్రాన్‌ లక్షణాలేంటి?
తల నొప్పి, గొంతు నొప్పి, ముక్కు కారడం, తుమ్ములు, గొంతులో గరగర, అలసట వంటి లక్షణాలు కనబడవచ్చు. ఇప్పటి వరకూ తెలిసిన సమాచారాన్ని బట్టి సాధారణ సీజనల్‌ ఫ్లూ వంటి లక్షణాలే ఇందులోనూ కనబడతాయి.

వ్యాప్తి, తీవ్రత ఎలా ఉంటుంది?
1. ఇది డెల్టా వేరియంట్‌ కంటే వేగంగా వ్యాపిస్తుందని తెలుస్తోంది.

2. వేగంగా వ్యాప్తి చెందే లక్షణం ఉన్నప్పటికీ, ప్రాథమిక సమాచారాన్ని బట్టి డెల్టా వేరియంట్‌ కంటే ఒమిక్రాన్‌ లో వ్యాధి తీవ్రత తక్కువగా ఉంటుందని తెలుస్తోంది. తొలుత పెద్ద సంఖ్యలో కేసులు నమోదు అయిన దక్షిణాఫ్రికా వైద్య నిపుణులు వెల్లడించిన దాన్ని బట్టి ఒమిక్రాన్‌ వేగంగా వ్యాప్తి చెందినప్పటికీ, తీవ్ర వ్యాధికి గురైన కేసులు, వ్యాధితో మరణాలు వంటి కాంప్లికేషన్లు తక్కువేనని తెలుస్తోంది. ఇప్పటివరకూ ప్రధానంగా వ్యాపించి ఉన్న ప్రమాదకరమైన డెల్టా వేరియంట్‌ స్ధానభ్రంశం చెంది దానికంటే తక్కువ ప్రమాదకరమైన ఒమిక్రాన్‌ వేరియంట్‌ వ్యాప్తి చెందడం ఒక రకంగా ఊరట కావచ్చునేమో అని కూడా కొందరు నిపుణులు భావిస్తున్నారు.

3. ప్రపంచ దేశాలలో ఇప్పటికే కొంతమేరకు జరిగిన వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వలన ఒమిక్రాన్‌ వ్యాధి ప్రాణాంతకంగా పరిణమించే అవకాశం తక్కువే ఉంటుందని చెప్పాలి. అయితే, ఇప్పటివరకూ కోవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకోని వారిలో ఒమిక్రాన్‌ వ్యాధి వలన తీవ్రలక్షణాలు కనబడే అవకాశం 8 రెట్లు ఎక్కువగా ఉంటుందని వెద్య నిపుణులు భావిస్తున్నారు. వ్యాక్సిన్‌ వేసుకున్న వారిలో ఒమిక్రాన్‌ సోకినప్పటికీ వ్యాధి లక్షణాలు తీవ్రమయ్యే పరిస్ధితి రాకుండా రోగనిరోధక వ్యవస్ధను (బి మరియు టి కణాలు) నిరోధించగల్గుతుందని శాస్త్రజ్ఞులు భావిస్తున్నారు. కానీ అదే సమయంలో, ఒమిక్రాన్‌ వేరియంట్‌ లో చోటు చేసుకున్న మ్యుటేషన్ల ఫలితంగా వ్యాక్సిన్‌ వేసుకున్న వారిలో ఉండే వ్యాధి నిరోధక వ్యవస్ధ నుండి కూడా ఒమిక్రాన్‌ పాక్షికంగా తప్పించుకునే అవకాశం ఉందని శాస్త్రజ్ఞులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

బూస్టర్‌ డోస్‌ ''ఒమిక్రాన్‌''ను నిరోధిస్తుందా?
ఏ వ్యాక్సిన్‌ తీసుకున్నా కొన్ని నెలలకు లేదా సంవత్సరాలకు ఆ వ్యాధిని నివారించేందుకు ఏర్పడ్డ రోగనిరోధక కణాల క్రియాశీలత తగ్గుతుంది. సాధారణంగా ఏ వ్యాక్సిన్‌ బూస్టర్‌ డోసు అయినా సన్నగిల్లిన రోగనిరోధక కణాల క్రియాశీలతను కొంతవరకూ పెంచుతుందన్న విషయం సాంకేతికంగా కరెక్టే. కానీ వైరస్‌ లో మ్యుటేషన్ల ఫలితంగా రోగనిరోధక కణాల నుండి తప్పించుకునే శక్తి కొత్త వేరియంట్లకు ఉండే అవకాశాన్ని కాదనలేం. ఒమిక్రాన్‌ లేదా భవిష్యత్తులో రాగల కోవిడ్‌ వేరియంట్లలో జరిగే మ్యుటేషన్ల ఫలితంగా కలిగే వ్యాధి వ్యాప్తి, తీవ్రత, రోగనిరోధక శక్తిని తప్పించుకునే స్వభావం వంటి పరిణామాల్ని బూస్టర్‌ డోసులు ఎంతవరకూ నివారించగలవనేది ఇప్పటికిప్పుడే నిర్ధారించలేం.

మనమేం చేయాలి?
1. ప్రస్తుతానికి (ఈ వ్యాసం రాసే సమయానికి) ఒమిక్రాన్‌ వ్యాధి తీవ్రత, కాంప్లికేషన్ల గురించి పూర్తి స్పష్టత రాలేదు. ఇంతలోగా ఐ.హెచ్‌.యు అనే మరో కొత్త వేరియంట్‌ ఫ్రాన్సులో వెలుగు చూసింది. ఏదేమైనప్పటికీ వేగంగా వ్యాప్తి చెందగల ఈ వేరియంట్ల స్వభావాన్ని దృష్టిలో పెట్టుకుని, వీటి వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వాలు, ప్రజలు కఠినంగా వ్యవహరించాల్సి వుంది. వివాహాలు, వేడుకలు, సభలు, మతపరమైన లేదా రాజకీయ సంబంధిత ర్యాలీలు, సమీకరణలు వంటి జన సందోహాలకు దారి తీసే చర్యలను నియంత్రించాలి.

2. సాధ్యమైనంత వరకూ సామూహిక ప్రయాణాల్ని నియంత్రించడం, తప్పనిసరిగా - సరైన పద్ధతిలో మాస్క్‌ ధరించడం, భౌతిక దూరం పాటించడం, తరచుగా చేతుల్ని శానిటైజర్‌తో శుభ్రం చేసుకోవడం, బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయకపోవడం, కరచాలనం చేయకపోవడం.....వంటివి తప్పనిసరిగా అనుసరించాలి.

3. వ్యాక్సిన్‌ తీసుకోని వారు తక్షణమే వేయించుకోవాలి.

4. అనుమానిత వ్యాధి లక్షణాలు కనబడ్డ వెంటనే పరీక్ష చేసుకోవాలి. రిపోర్టును బట్టి అవసరమైన వైద్య సలహా తీసుకోవాలి.

5. కోవిడ్‌ పాజిటివ్‌ వచ్చిన వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఐసోలేషన్‌ లో ఉండాలి. ప్రభుత్వ లేదా స్వచ్చంద సంస్ధల హైల్ప్‌లైన్‌ సలహాలు తీసుకోవచ్చు. డాక్టర్‌ సలహా మేరకు డాక్సిసైక్లిన్‌, ఐవర్‌మెక్టిన్‌, విటమిన్‌-సి, జింక్‌, పారాసిటమాల్‌, లివోసెట్రిజిన్‌ వంటి మందులు వాడాలి. ఇంట్రావీనస్‌ యాంటిబాడీస్‌ లేదా కొత్తగా ఆమోదం పొందిన మాల్నుపిరావిర్‌, పాక్స్‌లోవిడ్‌ వంటి టాబ్లెట్లు అవసరమైన వారు మాత్రమే డాక్టర్‌ సూచన మేరకు వాడాలి. అవసరమైనట్లయితే డాక్టర్‌ సలహా మేరకు సి.బి.పి, సి.ఆర్‌.పి వంటి కొన్ని ప్రాథమిక రక్తపరీక్షలు చేసుకోవాలి. ఆందోళనతో ప్రతి ఒక్కరూ ఛాతీ సి.టి స్కాన్‌ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆక్సిజన్‌ శాచురేషన్‌, టెంపరేచర్‌ రోజుకు రెండు లేదా మూడు సార్లు చెక్‌ చేసుకోవాలి. ఆక్సిజన్‌ శాచురేషన్‌ 94 శాతం కంటే తక్కువగా ఉంటే డాక్టర్‌ ను సంప్రదించాలి. ఇంటిలోపలనే 6 నిమిషాల నడక పరీక్ష చేసుకోవచ్చు. నడవక ముందు ఉన్న ఆక్సిజన్‌ శాచురేషన్‌ కంటే....6 నిమిషాలు నడచిన తర్వాత ఆక్సిజన్‌ శాచురేషన్‌ 3 శాతం కంటే తగ్గితే డాక్టర్‌ను సంప్రదించాలి. అవసరమైన సందర్భాలలో మాత్రమే హాస్పిటల్లో చేరాల్సి వుంటుంది.

6. ప్రత్యేకించి బి.పి, షుగర్‌, స్ధూలకాయం, ఆస్తమా వంటి సహ వ్యాధులు ఉన్న హై రిస్కు వ్యక్తులు మరింత జాగ్రత్తగా నివారణ చర్యలు పాటించాలి. వ్యాధికి సరైన మందులు వాడుతూ కచ్చితమైన నియంత్రణలో ఉండేలా చూసుకోవాలి. అనుమానించిన తక్షణమే వైద్య సలహా తీసుకోవాలి.

7. వ్యాధి గురించి అనుమానాలు, అపోహలు పెంచుకోకుండా శాస్త్రీయమైన సమాచారాన్ని మాత్రమే గ్రహించాలి. అహేతుక ప్రచారాలు, అశాస్త్రీయ ప్రాపగాండలను దూరంగా ఉంచాలి.

ఆందోళన వద్దు...అప్రమత్తత అవసరం...

డా|| కె. శివబాబు
/ వ్యాసకర్త : జన విజ్ఞాన వేదిక, సంగారెడ్డి జిల్లా, గౌరవాధ్యక్షులు /