రాష్ట్ర ప్రయోజనాలకు ఇబ్బంది కలిగిస్తున్న బిజెపి
సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు
ప్రజాశక్తి- జక్కా వెంకయ్య, టి నరసింహయ్య, సున్నం రాజయ్య నగర్ (తాడేపల్లి) :పార్లమెంటు సాక్షిగా రాష్ట్రానికి ప్రకటించిన ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలుకు నోచుకోలేదని సిపిఎం రాష్ట్రకార్యదర్శి పి మధు అన్నారు. సోమవారం నాడిక్కడ టి షడ్రక్, రెడ్డి శ్రీరామ్మూర్తి ప్రాంగణంలో జరిగిన సిపిఎం రాష్ట్ర 26వ మహాసభల ప్రారంభ సభకు ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు పూర్తి కాలేదని, వెనుకబడ్డ రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల అభివృద్ధికి ఇచ్చిన హామీలు నెరవేరలేదన్నారు. వీటిని అమలు చేయాలని నాలుగేళ్లల్లో అనేక పోరాటాలు చేశామన్నారు. కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత బిజెపి ప్రభుత్వానికి ప్రాంతీయ పార్టీల అవసరం లేకుండా పోయిందన్నారు. పార్లమెంటులో బిజెపికి పూర్తి మెజారిటీ రావడంతో కార్మికవర్గం, రైతులు, మైనార్టీ, దళితులపై దాడులు ఉధృతమయ్యాయన్నారు. మరోవైపు బడా పెట్టుబడిదారుల ప్రయోజనాలు కాపాడేందుకు దూకుడు పెంచిందన్నారు. ప్రశ్నించిన వారిపై తీవ్రమైన నిర్బంధాన్ని విధిస్తోందని విమర్శించారు. మోనిటైజేషన్ పేరుతో ప్రభుత్వ రంగంలోని అన్ని సంస్థలనూ ప్రైవేటుపరం చేస్తోందన్నారు. రైతాంగ వ్యవసాయాన్ని రద్దు చేసే కార్యక్రమానికి పూనుకుందన్నారు. అడుగడుగునా ప్రతిఘటన రావడంతో ఏడాది తరువాత మూడు నల్ల చట్టాలను వెనక్కు తీసుకుందని చెప్పారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకు తీవ్రమైన ఆటంకాలు కలిగిస్తున్న బిజెపికి వ్యతిరేకంగా పోరాడటం మనముందున్న తక్షణ కర్తవ్యమన్నారు. రాష్ట్రానికి నష్టం కలిగించే బిజెపికి వైసిపి, టిడిపి, జనసేన వంటి పార్టీలు మద్దతు ఇచ్చి ప్రజల ప్రయోజనాలను ఇబ్బందుల్లో పడేస్తున్నాయని తెలిపారు.
బిజెపితో అంటకాగితే అంగీకరించం
రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం కలిగిస్తున్న బిజెపితో అంటకాగితే కుదరదని, దీనిని అంగీకరించబోమని మధు అన్నారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ప్రసంగం అనంతరం ఆయన మాట్లాడారు. బిజెపి వ్యతిరేక విధానాలు కొనసాగించడంలో, రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడటంలో సిపిఎం ఏమాత్రం వెనుకాడదన్నారు. వైసిపి, టిడిపి, జనసేన బిజెపిని బలపరచడంతో విశ్వహిందూపరిషత్, ఆర్‌ఎస్‌ఎస్ వంటి హిందూత్వ సంస్థలు దేవాలయాలను రాజకీయ కేంద్రాలుగా మార్చుకుంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రైవేటీకరణ, మతోన్మాద విధానాలను మేళవించే విధంగా పోరాటాలు ఉంటాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను వైసిపి బలపరిస్తే రాష్ట్ర ప్రజాప్రయోజనాలను కాపాడేందుకు సమరశీలంగా ఉంటామని, ఇందులో ఏమాత్రం వెనుకాడబోమన్నారు.










