Jan 09,2022 07:03

కరోనా మహమ్మారి ప్రభావం చూపినప్పటికీ కార్పొరేట్ల లాభాలకు ఎలాంటి ఢోకా లేకపోవటాన్ని కార్మికులు గమనించారు, తామెందుకు నష్టపోవాలని వారు భావిస్తున్నారు. 2020లో మొత్తం 3.63 కోట్ల మంది రాజీనామాలు చేసి మెరుగైన ఉపాధిని వెతుక్కోగా...2021లో అక్టోబరు నాటికే 3.86 కోట్ల మంది రాజీనామాలు చేశారని అంచనా. సమ్మె చేస్తున్న కంపెనీలలో యజమానులు గతంలో మాదిరి తమ షరతులను రుద్దేందుకు చూస్తుండగా కార్మికులు అంగీకరించటం లేదు. దాంతో నెలల తరబడి సమ్మెలు కొనసాగుతున్నాయి.

   టీవలి కాలంలో అమెరికాలో కార్మిక సమ్మెలు పెరుగుతున్నాయి. గతంలో కుదుర్చుకున్న ఒప్పందాల్లో కార్మికులకు వ్యతిరేకమైన అంశాలున్నాయి. కార్మిక నేతల లొంగుబాటు, ఉపాధి లేమి వంటి కారణాలతో యజమానులు రుద్దిన ఒప్పందాలను అంగీకరించారు. గత కొద్ది నెలలుగా నిపుణులైన కార్మికులకు డిమాండ్‌ పెరగటంతో కోట్లాది మంది తమ ఉద్యోగాలకు రాజీనామా చేసి మెరుగైన వేతనాలతో కొత్త కొలువుల్లో కుదురుతున్నారు. కొన్ని కంపెనీల్లో ఒప్పంద గడువులు ముగిసిన తరువాత మెరుగైన నూతన ఒప్పందాల కోసం సమ్మెలకు దిగుతున్నారు. కరోనా మహమ్మారి ప్రభావం చూపినప్పటికీ కార్పొరేట్ల లాభాలకు ఎలాంటి ఢోకా లేకపోవటాన్ని కార్మికులు గమనించారు, తామెందుకు నష్టపోవాలని వారు భావిస్తున్నారు. 2020లో మొత్తం 3.63 కోట్ల మంది రాజీనామాలు చేసి మెరుగైన ఉపాధిని వెతుక్కోగా 2021లో అక్టోబరు నాటికే 3.86 కోట్ల మంది రాజీనామాలు చేశారని అంచనా. సమ్మె చేస్తున్న కంపెనీలలో యజమానులు గతంలో మాదిరి తమ షరతులను రుద్దేందుకు చూస్తుండగా కార్మికులు అంగీకరించటం లేదు. దాంతో నెలల తరబడి సమ్మెలు కొనసాగుతున్నాయి. కడుపు నిండిన యజమానులు కడుపు మండుతున్న కార్మికుల సహనాన్ని పరీక్షిస్తున్నారు.
   అమెరికా చరిత్రలో గత 15 ఏళ్లలో సుదీర్ఘ సమ్మెగా మసాచుసెట్స్‌ లోని సెయింట్‌ విన్సెంట్‌ ఆసుపత్రి లోని 700 మంది నర్సుల ఆందోళన నమోదైంది. రోగులకు తగిన సంఖ్యకు తగ్గట్లుగా సిబ్బంది లేకపోగా కరోనా సమయంలో, అంతకు ముందూ తగ్గించారు. సమ్మెకు దిగిన వారందరినీ పూర్తిగా తొలగిస్తామని బెదిరించినా 301 రోజుల పాటు సమ్మె జరిగింది. జనవరి మూడున ఒప్పందం కుదిరింది. నర్సులందరినీ తిరిగి తీసుకొనేందుకు, వేతన పెంపుదల, వైద్య బీమా మొత్తాల పెంపుదలకు అంగీకరించారు. డిసెంబరు పదవ తేదీ నాటికి దేశంలో 346 సమ్మెలు జరుగుతున్నట్లు కార్నెల్‌ విశ్వవిద్యాలయ కేంద్రం నమోదు చేసింది. గత కొద్ది సంవత్సరాలుగా అమెరికాలో కార్మిక సంఘాలలో చేరుతున్న వారి సంఖ్య తగ్గుతోంది. ప్రభుత్వ రంగంలో పని చేస్తున్న వారిలో 34.8 శాతం మంది సభ్యులుగా ఉంటే ప్రయివేటు రంగంలో కేవలం 6.3 శాతం మందే ఉన్నారు. 2019తో పోలిస్తే 2020లో స్వల్పంగా పెరిగారు. అమెజాన్‌, గూగుల్‌ వంటి కంపెనీలు కార్మిక సంఘాలను లేకుండా చేసేందుకు అనేక అక్రమాలకు పాల్పడుతున్నాయి. కొత్తగా సంఘం పెట్టుకోవటమే గగనంగా మారుతోంది.
   కారన్‌ఫ్లేక్‌ వంటి తృణధాన్య ఉత్పత్తుల సంస్థ కెలోగ్‌ కార్మికులు కూడా నెలల తరబడి సమ్మె చేశారు. అక్టోబరు ఐదు నుంచి డిసెంబరు 21 వరకు సమ్మె చేశారు. ఐదు సంవత్సరాలు అమల్లో ఉండే ఒప్పందం చేసుకున్నారు. నాలుగు చోట్ల ఉన్న ఫ్యాక్టరీల్లోని 1,400 మంది కార్మికులు ఆందోళన చేశారు. ఒకే పని చేసే కార్మికులకు రెండు రకాల వేతనాలు ఇవ్వటాన్ని వారు నిరసించారు. పది సంవత్సరాలు, అంతకు మించి పని చేస్తున్నవారిని విశ్వాసపాత్రులైన కార్మికులనే పేరుతో వారికి గంటకు 35 డాలర్లు, మెరుగైన బీమా, పెన్షన్‌ ఇస్తూ మిగిలిన వారిని తాత్కాలికం అనే పేరుతో ఒకే పని చేస్తున్న వారికి తక్కువ వేతనాలు ఇవ్వటాన్ని వ్యతిరేకించారు. కొత్త ఒప్పందం ప్రకారం అందరికీ వేతనాలు పెరుగుతాయి, ప్రతి ఏడాది ద్రవ్యోల్బణానికి అనుగుణంగా వేతనాలు పెంచుతారు. తాత్కాలిక కార్మికులకు కనీస వేతనం 24.11 డాలర్లు ఉంటుంది. అందరికీ ఒకే విధమైన ఆరోగ్య బీమా ఉంటుంది. రానున్న ఐదు సంవత్సరాల్లో ఏ ఫ్యాక్టరీని మూసివేయ కూడదు. రెండు రకాల కార్మికుల విభజన ఉన్నప్పటికీ నాలుగు సంవత్సరాలకు మించి పని చేసిన వారిని విశ్వాసపాత్రులుగా పరిగణించేందుకు అంగీకరించారు. పర్మనెంటు కార్మికుల సంఖ్య మీద పరిమితి విధించాలని అంతకు ముందు కంపెనీ ఒత్తిడి తెచ్చింది.
   కోట్లాది మంది కార్మికులు ఉన్న ఉద్యోగాలకు రాజీనామా చేసి కొత్త ఉపాధి చూసుకున్న తరువాత అనేక కంపెనీల్లో సిబ్బంది సమ్మెకు దిగుతున్నారు. లేదా సమ్మె నిర్ణయాలు తీసుకొని సంప్రదింపులు జరుపుతున్నారు. దీనికి కారణాలను విశ్లేషిస్తే కార్మికుల్లో తలెత్తిన అసంతృప్తి కనిపిస్తోందని చెప్పవచ్చు. కరోనాకు ముందున్న స్థితిలో 80 శాతమే ఉపాధి పునరుద్ధరణ జరిగింది. అయినా కార్మికులు రాజీనామా చేసి వేతనాలను మెరుగు పరుచుకోవాలని చూడటం ఒక ప్రత్యేక పరిస్థితిగా కనిపిస్తోంది. కరోనా తీవ్రత సడలిన తరువాత ఆర్థిక లావాదేవీలు ప్రారంభం కావటంతో సహజంగానే కార్మికులు తమ పని పరిస్థితుల మెరుగుదలకు పూనుకుంటారు. అదే జరుగుతోందిప్పుడు. రికార్డు స్థాయిలో ఉద్యోగాలకు రాజీనామాలు చేయటాన్ని చూసిన తరువాత యజమానులతో మనమెందుకు గట్టిగా బేరమాడకూడదనే ఆలోచనలు కార్మికుల్లో సహజంగానే తలెత్తాయని చెప్పవచ్చు. గత నాలుగు సంవత్సరాల్లో రిపబ్లికన్లు అధికారంలో ఉన్నారు. డెమోక్రాట్లలో కూడా కార్పొరేట్లకు వంత పాడేవారున్నప్పటికీ కార్మికులకు అనుకూల శక్తులు ఉండటం కూడా పోరాటాలకు ఊతమిస్తోందని చెప్పవచ్చు. మంత్రులుగా ఉన్నవారు కూడా సమ్మె కేంద్రాలను సందర్శించటం ఒక అసాధారణ పరిణామం. అసమానతలు విపరీతంగా పెరగటం సహజంగానే అసంతృప్తి, ఆందోళనలకు పురికొల్పుతుంది. సమ్మెలు విజయాలు సాధిస్తే మరిన్ని జరుగుతాయి. సమ్మె ఆయుధం మరింత పదునెక్కుతుంది. ప్రస్తుతం అమెరికాలో పెట్టుబడిదారీ విధానం విఫలమైనట్లు భావిస్తున్నవారు నానాటికీ పెరుగుతున్నారు. అది కూడా కార్మిక శక్తి సంఘటితం కావటానికి, పోరాట రూపాలకు మళ్లటానికి దోహదం చేస్తోందా అన్నది చూడాల్సి ఉంది.
    కరోనాలో కెలోగ్‌ కంపెనీ కార్మికులు ఇబ్బంది పడినా కంపెనీకి రికార్డు స్ధాయిలో 120 కోట్ల డాలర్ల మేర లాభాలు వచ్చాయి. జనం ఇళ్ల వద్దే ఉండటం, లాక్‌డౌన్‌ కారణంగా డిమాండ్‌ పెరిగి దుకాణాల్లో సరకులన్నీ ఖాళీ అయ్యాయి. దీంతో కెలోగ్‌ కార్మికులు తమ వారాంతాలను వదులుకొని, పన్నెండు గంటల చొప్పున పని చేసి పెద్ద ఎత్తున ఉత్పత్తి చేశారు. కంపెనీ వాటా ధర బాగా పెరిగింది, వాటాదార్లకు బోనస్‌లు, అధికార్లకు పెద్ద మొత్తాలు ఇచ్చారు. కానీ గత ఒప్పంద గడువు ముగిసిన తరువాత యాజమాన్యం కార్మికులను రాయితీలు కోరింది. ఇప్పుడున్న కార్మికులు తమ పెన్షన్లకు చెల్లింపు మొత్తాలను పెంచాలని, సెలవులకు ఇచ్చే మొత్తాల కోతకు అంగీకరించాలని, కొత్తగా పనిలోకి తీసుకొనే వారికి వేతనాల తగ్గింపునకు అంగీకరించాలని ఒత్తిడి చేసింది. విధి లేక కార్మికులు సమ్మెకు దిగారు. నెలలో మూడు రోజుల పాటు యంత్రాలను శుద్ధి చేస్తారు, కార్మికులను కనీసం యంత్రాల మాదిరిగా కూడా చూడకుండా వరుసగా వంద నుంచి 130 రోజుల వరకు పనిచేయించిన ఉదంతాలున్నట్లు కార్మికులు వాపోయారు.
    అనేక రంగాల కార్మికులు పోరుబాటలో ఉన్నారు. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత తొలిసారిగా హాలీవుడ్‌లో పని చేస్తున్న 60 వేల మంది కార్మికులు ఆందోళన హెచ్చరిక చేశారు. పని గంటలు పెరిగినందున ఎక్కువ వేతనాలు చెల్లించాలన్నది వారి ప్రధాన డిమాండు. అనేక రంగాల్లోని కార్మికులు ఇదే బాటలో ఉన్నారు. ఒక చోట సమ్మెలు మొదలైతే దాని ప్రభావం ప్రపంచమంతా ఉండటం గతంలో చూశాం. అదే పునరావృతం కానుందా?
 

/ వ్యాసకర్త సెల్‌: 8331013288 /
ఎం. కోటేశ్వరరావు

ఎం. కోటేశ్వరరావు