అమెరికా ఆంక్షలతో పాటుగా కరోనా తోడవటంతో టూరిజం వలన వచ్చే ఆదాయం పూర్తిగా పడిపోయింది. అత్యంత అమానవీయ రీతిలో ఆహార పదార్ధాలను, ప్రాణాధార మందులను కూడా దిగుమతి చేసుకోనివ్వటంలేదు. వ్యాక్సిన్ల తయారీకి అవసరమైన ముడిపదార్ధాలను కూడా కొనుక్కోనివ్వటంలేదు. అయినా, కోవిడ్ సమయంలో 23 దేశాలకు డాక్టర్లను, నర్సులను పంపి ప్రపంచ ప్రజలకు అండగా నిలిచింది.
తను విధించే ఆంక్షల ఫలితంగా క్యూబా ప్రజలు కష్టాలపాలై ప్రభుత్వంపై తిరగబడాలనేదే అమెరికా కోరిక. అంతేగాక క్యూబా ప్రభుత్వాన్ని అస్ధిరపరచాలనే లక్ష్యంతో ఆంక్షలను అంతకంతకు పెంచుతూ వున్నారు. క్యూబన్ ప్రజలపై అనూహ్యమైన రీతిలో భారాలు విధించారు. కరోనా సమయంలో ఈ ఆంక్షలను మరింత కఠినంగా అమలుపరుస్తున్నారు. ట్రంప్ ప్రభుత్వం అదనంగా విధించిన 243 ఆంక్షలను జో బైడెన్ ప్రభుత్వం కొనసాగిస్తూనే వుంది. ఇతర దేశాల స్వాతంత్య్రాన్ని, సార్వభౌమాధికారాన్ని గౌరవిస్తానని ఎన్నికల సమయంలో చేసిన వాగ్దానాన్ని బైడెన్ మరిచాడు. కోవిడ్ కాలంలో తన నిర్లక్ష్యం వలన లక్షలాదిమంది ప్రజల మరణానికి కారణమైనందున బ్రెజిల్ అధ్యక్షుడు బోల్సనారో సుప్రీంకోర్టు విచారణను ఎదుర్కొంటున్నాడు. అమెజాన్ అడవులను కార్పొరేట్ అనుకూలంగా నాశనం చేసి ప్రజాగ్రహాన్ని చవిచూస్తున్నాడు. ఆయన కూడా క్యూబా వ్యతిరేక ప్రదర్శనకారులకు సంఘీభావం తెలిపి తన నైజాన్ని నిరూపించుకున్నాడు. క్యూబాలో ఆంక్షల వలన కష్టాలు పడుతున్న ప్రజలను రెచ్చగొట్టి సోషలిస్టు ప్రభుత్వాన్ని కూలదోయ పూనుకున్నారు. అదనంగా విధించిన ఆంక్షల ఫలితంగా ప్రధాన ఆదాయ వనరైన చక్కెర ఎగుమతులు దెబ్బతిన్నాయి. అమెరికా ఆంక్షలతో పాటుగా కరోనా తోడవటంతో టూరిజం వలన వచ్చే ఆదాయం పూర్తిగా పడిపోయింది. అత్యంత అమానవీయ రీతిలో ఆహార పదార్ధాలను, ప్రాణాధార మందులను కూడా దిగుమతి చేసుకోనివ్వటంలేదు. వ్యాక్సిన్ల తయారీకి అవసరమైన ముడిపదార్ధాలను కూడా కొనుక్కోనివ్వటంలేదు. అయినా, అమెరికా కంపెనీలు ఫైజర్, మోడర్నా వ్యాక్సిన్లకు దీటుగా, పోటీగా క్యూబా స్వంతంగా అయిదు రకాల వ్యాక్సిన్లను అభివృద్ధి చేసింది. లాటిన్ అమెరికా, ఆఫ్రికా ప్రజలకు, కావాలంటే అమెరికాకు కూడా వ్యాక్సిన్లను ఇస్తామంది. కోవిడ్ సమయంలో 23 దేశాలకు డాక్టర్లను, నర్సులను పంపి ప్రపంచ ప్రజలకు అండగా నిలిచింది.
ప్రపంచంలోనే అత్యంత బలమైన దేశం తన శక్తినంతా ఉపయోగించి ఒక చిన్నదేశమైన క్యూబా ప్రభుత్వాన్ని కూలదోయాలని చూస్తున్నది. జూన్ 23న ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశాలలో క్యూబా పై ఆంక్షలను ఎత్తివేయాలని 184 దేశాలు తీర్మానించాయి. 1992 సంవత్సరం నుండీ ఐక్యరాజ్య సమితిలో ఆంక్షలను ఎత్తివేయామని మెజారిటీ దేశాలు తీర్మానాలు చేస్తూనే వున్నాయి. అమెరికా ప్రభుత్వం లెక్కచేయటంలేదు. 2020 సంవత్సరంలో ఆర్థిక దిగ్బంధనం వలన 9.1 మిలియన్ డాలర్లను క్యూబా నష్టపోయిందని... కోవిడ్ వైరస్ లాగానే ఆంక్షలు, దిగ్బంధనం ఊపిరి పీల్చుకోకుండా చేసి హతమార్చుతాయని విదేశాంగ మంత్రి రోడ్రిగజ్ అన్నారు.
క్యూబా కు 90 మైళ్ళ దూరంలో వున్న అమెరికా లోని ఫ్లోరిడా రాష్ట్రాన్ని కేంద్రంగా చేసుకుని అసమ్మతిని రెచ్చగొడుతున్నారు. ప్రభుత్వం పట్ల వ్యతిరేకతను రెచ్చగొట్తూ మరొక పక్క బూటకపు వార్తలను సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తున్నారు. అందుకు పావులుగా క్యూబా దేశం నుండి పారిపోయివచ్చిన వారిని వాడుకుంటున్నారు. వారి ద్వారా క్యూబా ప్రజలను, వారి బంధువులను, స్నేహితులను లోబరచుకునే ప్రయత్నం చేస్తున్నారు. అసమ్మతివాదులకు ధన సహాయం, సామాజిక మాధ్యమాలకు అవసరమయిన సాంకేతిక సహాయాన్ని అందిస్తున్నారు. పాశ్చాత్య మీడియాతో కలిసి రకరకాల కథనాలను ప్రచారం చేస్తున్నారు.
క్యూబా ప్రజల ప్రియతమ నాయకుడు కాస్ట్రో పై 634 సార్లు హత్యాప్రయత్నం చేశారు. సార్వభౌమత్వం కలిగిన ఒక దేశ అంతరంగిక వ్యవహారాలలో బయటి దేశాల జోక్యం లేదా విచ్ఛిన్నకర చర్యలను ప్రోత్సహించడం అంటే క్యూబాను అస్ధిరపరచటమేనని, ఇది తమకు ఎంత మాత్రమూ ఆమోదయోగ్యం కాదని రష్యా ప్రకటించింది. క్యూబాలో ఇతర దేశాల జోక్యం చేసుకునే విధానాలను తాము గట్టిగా వ్యతిరేకిస్తున్నామని మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యువల్ లోపెజ్ ఒబ్రడార్ హెచ్చరించారు. క్యూబా ప్రభుత్వానికి, ప్రజలకు లాటిన్ అమెరికా ప్రజలు, సంస్ధలు, సంఘాలు తమ సంపూర్ణ మద్దతును ప్రకటించారు. అమెరికా ఆంక్షలను ఎదుర్కొంటున్న మరొక లాటిన్ అమెరికా దేశం వెనిజులా. క్యూబాలో అమెరికా జోక్యాన్ని సహించమని వెనిజులా నేత మదురో హెచ్చరించారు. ప్రపంచ మానవాళికి వ్యతిరేకంగా సాగే అత్యాచారాలకు, విద్వేష చర్యలకు, అధర్మ యుద్ధాలకు కారణమైన అమెరికాకు క్యూబాలో హక్కుల గురించి మాట్లాడే హక్కు లేదన్నారు.
క్యూబా ప్రజల పేదరికానికి కారణమైన అమెరికా ఆంక్షలను వెంటనే రద్దు చేయాలని, క్యూబా ప్రభుత్వాన్ని కూలదోసే ప్రయత్నాలను ఆపాలని ప్రపంచ ప్రజలందరం కోరదాం.










