Jul 08,2021 09:22

హైదరాబాద్‌ : ప్రేమ చావును కోరుకోదు. చంపమనీ చెప్పదు. కానీ ఇటీవల కాలంలో ఇవే ఎక్కువయ్యాయి. యువతి ప్రేమించాలని, ప్రేమించిన తర్వాత గొడవ వచ్చి విడిపోతే..దానికి కక్ష సాధింపు చర్యలుగా యువకులు.. ప్రేమోన్మాదులుగా మారి..యువతులపై దాడులకు తెగబడుతున్నారు. ఇటువంటి ఘటనే హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే బోరబండ సమీపంలోని బంజారా నగర్‌లో నివసించే బండారి శ్రీకాంత్‌ (25) గతంలో ఎస్‌ఎస్‌బి నగర్‌లో ఉండేవాడు. అక్కడ ఓ స్టార్‌ హోటల్‌ జిమ్‌లో రిసెప్షనిస్టుగా పనిచేస్తున్న యువతితో పరిచయం ఏర్పడింది. తర్వాత వీరి మధ్య గొడవలు రావడంతో 2020 అక్టోబర్‌లో యువతి ఫిర్యాదు చేయగా మాదాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో శ్రీకాంత్‌పౖౖె కేసు నమోదైంది. కొద్ది రోజులుగా ఆమెను కలవాలంటూ అతను కోరుతున్నాడు. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి ఆమె ఇంటికి వెళ్లిపోయాడు. ఇంట్లో యువతి, ఆమె సోదరి ఉన్నారు. కూర్చొని మాట్లాడుతుండగా అతని వెనుక భాగంలో కత్తి ఉన్నట్లు యువతి సోదరి గుర్తించింది. తన సోదరిని పిలిచి గదిలోకి వెళ్లి తలుపు పెట్టుకోవాలని సూచించింది. గదిలోకి వెళ్లిన యువతి 100 కాల్స్‌ చేసింది. అంతలో యువతి సోదరి అతన్ని మాటల్లో పెట్టింది. సమాచారం అందుకున్న పోలీసులు యువతి ఇంటికి చేరుకుని శ్రీకాంత్‌ను అదుపులోకి తీసుకున్నారు. శ్రీకాంత్‌ను తనిఖీ చేయగా కత్తి లభించింది. దీన్ని ఆమెజాన్‌లో కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. శ్రీకాంత్‌ను పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించగా...సోదరుడి జన్మదిన వేడుకుల కోసం కత్తిని తీసుకెళ్లినట్లు అతడు చెబుతున్నాడు. యువతిని హత్య చేసేందుకు తీసుకెళ్లాడా అనే కోణంలో కూడా విచారిస్తున్నారు.