Jul 11,2021 06:30

     'ఏ దేశ చరిత్ర చూచినా/ ఏమున్నది గర్వకారణం?/ నరజాతి చరిత్ర సమస్తం/ పరపీడన పరాయణత్వం' అంటాడు మహాకవి శ్రీశ్రీ. ఇప్పుడు- 'ఏ దేశ చరిత్ర చూసినా/ ఏమున్నది గర్వకారణం?/ నరజాతి చరిత్ర సమస్తం/ ఆకలి చావుల మారణహోమం'... అని చదువుకోవాల్సిన పరిస్థితి. సమాజ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలు, నెత్తురు ధారబోసి నాగరికతకు నడకలు నేర్పిన కార్మికుల హాహాకారాలు, ఆర్తనాదాలు, ఆకలి చావులు...ఏ ప్రగతికి ప్రతీకలు? విరామమెరుగక పరిశ్రమిస్తూ మానవజాతి పురోగమనానికి దారులువేసిన జీవితాల్లో....ఆకలి మూల్గులు...చావుకేకలు వినిపిస్తూనే ఉన్నాయి. ప్రపంచాన్ని భయకంపితం చేస్తోన్న కరోనా వైరస్‌ కంటే తీవ్రంగా...ప్రపంచ యుద్ధాలకంటే భయానకంగా భీతికొల్పుతున్న వైరస్‌...ఆకలి. ఈ ఆకలితో ప్రపంచవ్యాప్తంగా ప్రతి నిమిషానికి 11 మంది ఆహుతవుతున్నారంటే ఆశ్చర్యపోక తప్పదు. ఇది కఠోర వాస్తవం. నమ్మక తప్పని చేదు నిజం.
     యుద్ధ సంక్షోభం, వాతావారణ మార్పులకు... కరోనా మహమ్మారి తోడవడంతో కోట్లాది మంది జనాలు ఆకలితో అలమటించిపోతున్నారు. కరోనాతో ప్రతి నిమిషానికి ఏడుగురు చనిపోతే... ఆకలితో 11 మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని ఆక్స్‌ఫామ్‌ సంస్థ విడుదల చేసిన నివేదిక ఈ వ్యవస్థ యొక్క నిజ స్వరూపాన్ని మరోసారి బహిర్గతం చేసింది. 55 దేశాల్లో 15.5 కోట్ల మంది తిండి లేక అలమటించిపోతున్నారు. అందులోనూ యుద్ధ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న 23 దేశాల్లోనే 10 కోట్ల మంది వున్నారు. అంతేకాదు... లాక్‌డౌన్‌ల వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 3.5 శాతం దిగజారిపోయిందని, పేదరికం 16 శాతం పెరిగిందని, 17 దేశాల్లో 4 కోట్ల మంది పస్తులుంటున్నారని, అంతకుముందు ఏడాదితో పోలిస్తే 70 శాతం పెరిగారని నివేదిక చెబుతోంది. ఆకలి మంటలకు యుద్ధ సంక్షోభం ఆజ్యం పోస్తే.... కరోనా ఆ మంటను మరింత పెంచింది. ఈ ఏడాది చివరి నాటికి 74.5 కోట్ల మంది కడు పేదరికంలోకి జారుకునే ముప్పు పొంచి ఉందని ఆక్స్‌ఫామ్‌ హెచ్చరిస్తోంది. కరోనా మొదలైనప్పటి నుంచి పేదరికంలో మగ్గుతున్న వారి సంఖ్య 10 కోట్లు పెరిగితే, ఈ ఏడాదిన్నరలో కేవలం 10 మంది కుబేరులు 41,300 కోట్ల డాలర్ల (రూ.30.77 లక్షల కోట్లు) సంపద పోగేసుకున్నారని నివేదిక స్పష్టం చేసింది. అదే సమయంలో మన దేశంలోనూ పస్తులుంటున్న వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. దాదాపు 19 కోట్ల మంది ఆహార లేమితో అలమటిస్తున్నారు. 33 శాతం మంది పిల్లల్లో ఎదుగుదల సరిగ్గాలేదు. 70 శాతం మంది తాము తినే తిండిని సైతం తగ్గించుకున్నారు. 15 రాష్ట్రాల్లోని 47 వేల కుటుంబాలను సర్వే చేసి ఈ విషయాన్ని ఆక్స్‌ఫామ్‌ వెల్లడించింది. కరోనా మొదలైనప్పటి నుంచి... నేటివరకు-ప్రతి కుటుంబం సగటున 60 శాతం ఆదాయం కోల్పోయింది. ఈ ఏడాది ఒక్క ఏప్రిల్‌లోనే 80 లక్షల మంది తమ ఉద్యోగాలను కోల్పోయారు. అంతెందుకు....10 కోట్ల మందికి అందాల్సిన రేషన్‌...కేవలం 57శాతం మందికి మాత్రమే అందుతోంది. ఆకలి సంక్షోభంలో చిక్కుకున్న ఏ దేశానికీ తీసిపోని విధంగా మోడీ ప్రభుత్వం దేశాన్ని ఆకలి సంక్షోభం వైపునకు నడిపిస్తోంది.
      ప్రతి వ్యక్తికీ జీవించే హక్కు వుంది. దీనిని అంతర్జాతీయ మానవ హక్కుల వేదిక సైతం గుర్తించింది. భయంకరమైన నేరస్తులకు కూడా ఉరిశిక్ష వేయకూడదని వాదించేవారున్నారు. తప్పు చేసిన వ్యక్తికి ఎంతటి కఠినమైన శిక్ష అయినా వెయ్యి..అంతేగాని ప్రాణం తీసే హక్కు మాత్రం లేదు. ప్రతి మనిషి బతికే హక్కును కాపాడేదీ, ఆ హక్కుకు భరోసా ఇచ్చేది ఈ వ్యవస్థ. ఈ హక్కును గ్యారంటీ చేయాలంటే...కూడు గూడు గుడ్డ వంటి మౌలిక వసతులను ప్రజలకు అందేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. అయితే ప్రభుత్వాల ప్రాధాన్యతలు వేరే వుంటున్నాయి. పెట్టుబడిదారుడికి లాభాలను ఆర్జించి పెట్టే విధానాలను అవలంభిస్తున్నాయి. కోట్లాదిమంది ప్రజల హక్కులను కాలరాసి, కొద్దిమంది ఆస్తులను కాపాడే పనిలో ప్రభుత్వాలు వున్నప్పుడు...ఆకలి చావులే వస్తాయి. కరోనా లేకపోయినా ఆకలి చావులు వుంటాయి. దాదాపు నాలుగేళ్లపాటు ప్రజల తిండికి సరిపోయే ఆహారధాన్యాలు గిడ్డంగుల్లో మూలుగుతున్నా...ప్రజలు ఆకలి చావులకు గురవుతున్నారంటే...ఇది ఈ వ్యవస్థ వైఫల్యమే తప్ప మరోటి కాదు. ఇంత బాహాటంగా వ్యవస్థ యొక్క వైఫల్యం కనబడుతోంటే..ఇంకా ఈ వ్యవస్థకు కొనసాగే హక్కు వుంటుందా ?