తూర్పు కొండల్లో, మన్యం గుండెల్లో ఉదయించిన ఎర్ర సూరీడు సున్నం రాజయ్య అచ్చమైన ఆదివాసీ బిడ్డ. నిర్బంధాలు, శత్రువుల దాడులు, ప్రలోభాలు, మరెన్నో కష్టాలు ఎదురైనా ఎదిరించి ఎర్రజెండాను కడదాకా సమున్నతంగా మోసిన యోధుడు, ధీశాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఖమ్మం జిల్లా భద్రాచలం డివిజన్‌లో వి.ఆర్.పురం మండలం లోని సున్నం వారి గూడెంలో సున్నం రాజులు, కన్నమ్మ దంపతులకు 1958 మార్చి 25న రాజయ్య జన్మించారు. 10వ తరగతి తరువాత చదువుకు స్వస్తి పలికి తమ ప్రాంతంలో ఆదివాసీల పట్ల జరుగుతున్న దోపిడీకి వ్యతిరేకంగా తిరుగుబాటు ప్రారంభించారు. రాజయ్య, చుక్కమ్మ దంపతులకు నలుగురు సంతానం. వీరికి తన ప్రియతమ నాయకుల పేర్లనే (లక్ష్మి, స్వరాజ్యం, చంద్రరావు, సీతారామరాజు) పెట్టారు. 1979లో సిపిఎం సభ్యుడిగా చేరిన రాజయ్య ఆ తరువాత యువజన సంఘం జిల్లా అధ్యక్షుడుగా చేశారు. 1985లో చినమట్టపల్లి సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. 1993లో సిపిఎం పార్టీ భద్రాచలం డివిజన్ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. అటుపిమ్మట సిపిఎం తరపున భద్రాచలం నియోజకవర్గం నుండి శాసనసభకు మూడుసార్లు ఎన్నికయ్యారు. సిపిఎం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ సభ్యుడు గాను, ఆ తరువాత తెలంగాణ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు గాను వున్నారు. చనిపోయే నాటికి ఆయన సిపిఎం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు. ఆదివాసీ అధికార్ రాష్ట్రీయ మంచ్ జాతీయ నాయకుడు. ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు.
అలుపెరగని అడుగు
ఎక్కడ ఎవరికి కష్టం వచ్చినా ఎంత రాత్రి అయినా తక్షణం ఫోన్‌లో మాట్లాడేవారు. వెంటనే ఆ ప్రాంతానికి చేరుకునేవారు. 2018 మే నెలలో వి.ఆర్.పురం మండలం సున్నం మట్కా గ్రామంలో ఫారెస్ట్ అధికారులు పోడు భూములకు అడ్డంగా తవ్విన కందకాల్లో పడి పదేళ్ల బాలిక మరణించింది. సమాచారం తెలిసిన వెంటనే గ్రామానికి చేరుకున్న రాజయ్య ఉదయం 6 గంటల నుండి మంచి రాత్రి 7 గంటల వరకు ఆ గ్రామంలో బైఠాయించారు. ఐటీడీఏ, ఫారెస్ట్ అధికారులు ఆ గ్రామానికి వచ్చి కందకాలను పూడ్చి సమస్య పరిష్కరించే వరకు కదలలేదు. 2019లో ఆగస్ట్‌లో గోదావరికి వరదలు వచ్చి దేవిపట్నం మండలం పూర్తిగా మునిగిపోయిన సందర్భంలో నాటు పడవలో పోటెత్తిన గోదారిలో ప్రయాణించి ప్రజలకు ధైర్యం చెప్పారు. అదే రోజు అంగుళూరు కాపర్ డాం నుండి నాటు పడవపై వరద బాధితులను కలుసుకోవడానికి జిల్లా నాయకత్వానికి స్ఫూర్తినిచ్చారు. ఇటీవల లాక్‌డౌన్ కొనసాగుతుండగా మే నెలలో వలస ఆదివాసీలపై కూనవరం ఫారెస్ట్ రేంజర్ దాడికి పాల్పడ్డారు. చింతూరు, కూనవరంలో బాధితులను కలుసుకోవడానికి రాజయ్య చూపించిన తెగువ మరపురానిది. కూనవరం మండలం లోని కొండరెడ్లను కలుసుకోవడానికి మండుటెండలో 5 కిలోమీటర్ల దూరం నడిచి కొండ ఎక్కారు. 2016లో పోలవరం నిర్వాసితుల పోరు యాత్ర విలీన మండలాల్లో 28 రోజుల పాటు జరిగింది. ప్రతి గ్రామంలో అందరినీ పెరు పేరునా పలకరించడం ప్రతి సమస్యను తట్టి చూడడం రాజయ్య గారికే చెల్లింది. పాదయాత్రలో ఏడుగురాళ్ళ పల్లి నుండి పెగ గ్రామానికి బయలుదేరినప్పుడు పోలీసులు వారించారు. లోపల గ్రామానికి యాత్ర వెళ్లడం శ్రేయస్కరం కాదని చెప్పినపుడు....పార్టీ కార్యకర్తలను ఆపదలో వదిలే ప్రసక్తే లేదని పోలీసుల కళ్ళు కప్పి అంబులెన్స్ ఎక్కి ఆ గ్రామానికి చేరిపోయి యాత్రలో పాల్గొన్నారు. జీఓ.నెం.3 రద్దుకు వ్యతిరేకంగా కరోనా మహమ్మారిని సైతం లెక్కచేయకుండా రంపచోడవరం నియోజకవర్గంలో 11 మండలాలను విస్తృతంగా పర్యటించారు. చివరికి ఆగస్ట్ 1న భద్రాచలం ఆస్పత్రిలో ఉండగా ఫోన్ చేసినప్పుడు సైతం ఆయన ప్రజల గురించే పరితపించారు. కరోనా వ్యాధి సోకిన విలీన మండలాల ప్రజలను రాజమండ్రి క్వారంటైన్‌కి తీసుకువెళ్లి...చికిత్స అనంతరం డిశ్చార్జ్ చేసి వెనక్కి తీసుకు రావడం లేదని...దీనిపై పీఓ తో మాట్లాడానని చెప్పడం చూస్తే రాజయ్య తన జీవితాంతం ప్రజాసేవకు ఎంతలా అంకితమయ్యారో అర్థమవుతుంది.
నిర్బంధాలకు వెరవని ధీరత్వం
రాజయ్య ప్రజా జీవనంలో అనేక ఆటుపోట్లు, నిర్బంధాలు, బెదిరింపులు. అన్నిటినీ తట్టుకుని ఎర్ర జెండాను సమున్నతంగా నిలబెట్టారు. ఆయన సహచరులు, సీనియర్లు దాడుల్లో ప్రాణాలు కోల్పోయినా ఏనాడు మనోనిబ్బరం కోల్పోలేదు. 1985 నవంబర్ 5న జీడిగుప్ప వద్ద అప్పటి పీపుల్స్ వార్ నక్సల్స్ దారికాచి జీపును అటకాయించి దాడి చేశారు. బండారు చంద్రరావు, బత్తుల భీష్మారావు లను దారుణంగా నరికారు. భీష్మారావు అక్కడికక్కడే చనిపోయారు. చంద్రరావు డిసెంబర్ 13న ఉస్మానియాలో చికిత్స పొందుతూ మృతి చెందారు. దాడి జరిగిన సమయంలో నాటి సిపీఎం శాసన సభ్యుడు కుంజా బొజ్జి, సున్నం రాజయ్య జీప్ లోనే ఉన్నారు. పార్టీకి రాజీనామా చేయకపోతే రాజయ్యకూ ఇదే గతి పడుతుందని హెచ్చరించారు. 1988 ఆగస్టు 23 పులి రామయ్య చింతూరు సొసైటీ అధ్యక్షులు బుధవారం సంతకు వస్తుండగా దారికాచి కాళ్లు చేతులు నరికి చంపారు. 1996 సెప్టెంబర్ 6న కామ్రేడ్ శ్యామల వెంకట్ రెడ్డిని మల్లంపేట వద్ద నరికి చంపారు. ఇలా అనేక మంది సహచరులు అమరులయినా...తనకు తీవ్రమైన బెదిరింపులు వచ్చినా...తన రాజకీయ గురువుగా భావించే చంద్రరావు, భీష్మారావు లాంటి వారు చనిపోయాక కూడా పోరు బాట వీడలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయి తెలంగాణ ఏర్పడ్డాక మొదటి శాసన సభలో సిపిఎం నుండి ఏకైక శాసన సభ్యుడిగా రాజయ్య ఎన్నికయ్యారు. కేసీఆర్ ప్రభుత్వం అహంకారంతో రాజయ్యను ప్రలోభ పెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. మంత్రి పదవి, పిల్లలకు ఉద్యోగాలు ఇంకా అనేక రకాలుగా ప్రయత్నిస్తే...అవసరమైతే పదవినైనా వదులుకుంటాను గాని ఎర్ర జెండా వదిలే సమస్యే లేదని రాజయ్య సమాధానమిచ్చారు.
స్నేహశీలి
సుదీర్ఘ పోరాట అనుభం. 15 సంవత్సరాలు శాసన సభ్యుడు...పార్టీ రాష్ట్ర స్థాయి బాధ్యుడు. ఇలా ఎంతటి ఉన్నత స్థానంలో వున్నా సాధారణ సభ్యుడితో కూడా స్నేహం చేయగలిగే గొప్ప స్వభావం రాజయ్య సొంతం. ఎక్కడా కల్మషం కనబడదు. కష్టంలో ఉన్నవారు వైద్యం కోసం తన దగ్గరికి వస్తే ఏ పార్టీ అని చూడకుండా వెంట పెట్టుకుని ఆస్పత్రికి తీసుకువెళ్ళే స్వభావం ఆయనది. అందుకే రాజయ్య అందరివాడు అంటారు. భౌతికంగా దూరమైనా మన్యం ప్రజల గుండెల్లో చిరస్థాయిగా జీవించి ఉంటారు. కడదాకా ప్రజల పక్షాన నిలిచిన రాజయ్య బాటను విడువబోము.
- టి. అరుణ్
(వ్యాసకర్త సిపిఎం జిల్లా కార్యదర్శి, రాజమండ్రి)










