Mar 22,2023 11:20
  • ఉపాధ్యాయుల ఖాళీలపై గందరగోళం
  • రాష్ట్రానిది ఒక లెక్క... కేంద్రానిది మరో లెక్క

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : రాష్ట్రంలో ఉన్న ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలపై రాష్ట్రం ఒక మాట, కేంద్రం మరో మాట చెబుతున్నాయి. ఈ గణాంకాల్లో అంతరం ఏకంగా వేలల్లో ఉండడమే ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ విధానంపై పిడిఎఫ్‌ శాసనసభ్యులు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తుండడం గమనార్హం. శాసనమండలిలో పిడిఎఫ్‌ పక్షనేత విఠపు బాలసుబ్రమణ్యం అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా రాష్ట్రంలో 717 ఖాళీలు మాత్రమే ఉన్నట్లు మంత్రి బొత్స పేర్కొన్నారు. దీంతో ఆశ్చర్యపోయిన బాలసుబ్రమణ్యర మంత్రికి రెండు మార్కులే వేస్తున్నట్లు సభలోనే ప్రకటించి తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. అయితే గత డిసెంబర్‌ 14వ తేదీన రాజ్యసభలో ఒక సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి ధర్మేంద్ర రాతపూర్వకంగా సమాధానమిస్తూ రాష్ట్రంలో 2020-21 నాటికి ఏకంగా 50,677 ఖాళీలు ఉన్నట్లు ప్రకటించారు. అన్ని రాష్ట్రాల వివరాలతోపాటు ఆరధ్రప్రదేశ్‌ వివరాలు కూడా ఆయన ఇవ్వడం గమనార్హం. మొత్తం ఉపాధ్యాయ పోస్టుల్లో 19.64 శాతం ఖాళీలు ఉన్నట్లు కూడా ఆయన వెల్లడించారు. 2021-22 సంవత్సరంలో 14.01 శాతంతో 35,358 ఖాళీలు ఉండగా, అది తరువాత సంవత్సరానికి మరింతగా పెరిగినట్లు తన నివేదికలో పేర్కొన్నారు. వాస్తవానికి గత కొన్నేళ్లుగా రాష్ట్రంలో ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేయలేదు. మరి కేవలం 717 ఖాళీలే ఉండడం ఎలా సాధ్యమన్నది ప్రశ్నార్థకంగా మారింది. అది కూడా ఇంత తక్కువగా చూపించడం అన్నది ఖాళీ పోస్టుల విషయాన్ని దాచడమేనన్న భావన కూడా వ్యక్తమవుతోంది. దాదాపు 31 వేల పోస్టులను భర్తీ చేయాల్సిన అవసరం లేదని కూడా ప్రభుత్వం భావిస్తోంది.
 

                                                       ప్రపంచ బ్యాంకు సూచనలతోనే

ప్రపరచబ్యాంకు మార్గదర్శకాలతోనే ఉపాధ్యాయ పోస్టులను తగ్గించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శలు ఉన్నాయి. జూన్‌ 2021 నాటికి రాష్ట్రంలో 1,86,475 మంది ఉపాధ్యాయులు ఉన్నట్లు ప్రభుత్వం గతంలో చెప్పగా, తాజాగా మండలిలో మంత్రి స్పందిస్తూ 1,50,641 మంది పనిచేస్తున్నారని వెల్లడించారు. అంటే ఇంకా 36 వేల ఖాళీలు ఉండాలని కదా అని పిడిఎఫ్‌ సభ్యుడు విఠపు బాలసుబ్రహ్మణ్యం ప్రశ్నించారు. అలాగే ఖాళీగా ఉన్న స్కూల్‌ అసిస్టెంట్లు, ప్రధానోపాధ్యాయులు, సెకండరీ గ్రేడ్‌ పోస్టులు కలిపి 14,061 ఖాళీలను త్వరలో డిఎస్‌సి ద్వారా భర్తీ చేస్తామని 2021లోనే ప్రభుత్వం చెప్పిందని, ఇప్పుడు ఆ పోస్టులు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు.

                                                           సింగిల్‌ టీచర్‌ పోస్టులన్నీ..

సింగిల్‌ టీచర్‌ చాలన్న కారణంగా అనేక ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం సుముఖత చూపించడం లేదు. రాష్ట్రంలో 20 మంది కన్నా తక్కువ పిల్లలున్న 6775 పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టులకు ప్రభుత్వం కోతలు పెడుతున్నట్లు కూడా ఆరోపణలు వస్తున్నాయి. తెలుగు మీడియం రద్దు ఉత్తర్వుల పేరుతో మొత్తం పోస్టులను 1,55,892కు కుదించారు. మిగిలిన వాటిని కూడా ఖాళీలుగా చూపించడం లేదని విఠపు విమర్శించారు.

                                                         2026లోగా మరిన్ని రద్దు

ప్రపరచబ్యాంకు నిబంధనల కారణంగా త్వరలో మరిన్ని పోస్టులు రద్దవుతాయన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. ఇప్పటికే 30 వేలకు పైగా టీచర్‌ పోస్టులు అనధికారికంగా రద్దు కాగా, మరో మూడేళ్లలో మరో 30 వేల వరకు పోస్టులు రద్దవుతాయన్న భావాన్ని మండలి సభ్యుడు బాలసుబ్రమణ్యం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే రెండేళ్లలో వరుసగా తొమ్మిది, పదో తరగతిలో తెలుగు మీడియం రద్దవుతుందని, దీనివల్ల మరికొన్ని పోస్టులు పోతాయని ఆయన అభిప్రాయపడ్డారు.