Jul 19,2023 08:30
  •  రఘువీరా రెడ్డి మౌనం
  •  టిడిపి వైపు శైలూ చూపు..?

ప్రజాశక్తి-అనంతపురం ప్రతినిధి : సార్వత్రిక ఎన్నికలకు సమయం ఆసన్నమవుతోంది. ఈ సమయంలో నేతలు ఎవరు ఎటు ఉంటారోనన్న చర్చలు సర్వత్రా సాగుతూనే ఉంటాయి. ఇదే కోవలో ఇద్దరు మాజీ పిసిసి అధ్యక్షుల పట్ల కూడా జిల్లాలో చర్చ సాగుతుండటం గమనార్హం. జిల్లాలో సీనియర్‌ నాయకుల్లో మాజీ పిసిసి అధ్యక్షులు ఎన్‌.రఘువీరారెడ్డిరు ఒకరు. ముందు నుంచి కాంగ్రెసు పార్టీలో ఉంటూ అనేక పదవులను అలంకరించి జిల్లాపై ఒక చెరగని ముద్రను వేశారు. వ్యవసాయ, రెవెన్యూ శాఖల మంత్రిగానూ పనిచేశారు. రాష్ట్ర విభజన తరువాత కాంగ్రెసు పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో పూర్తిగా దెబ్బతింది. ఈ తరుణంలో ఆయన పిసిసి అధ్యక్ష బాధ్యతలను తీసుకుని పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేశారు.
అయితే ఆశించిన ఫలితాలు మాత్రం రాలేదు. 2014, 2019 ఎన్నికల్లోనూ ఉమ్మడి జిల్లాలో పెనుకొండ, కళ్యాణదుర్గంలోనూ ఆయన పోటీ చేసినప్పటికీ కాంగ్రెసుపై ఉన్న వ్యతిరేకతతో ఓటమిని చవిచూడక తప్పలేదు. 2019 ఎన్నికల తరువాత నుంచి పిసిసి పదవి నుంచి కూడా తప్పుకుని రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. అయితే ఇటీవల జరిగిన కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కాంగ్రెసు పార్టీ తరపున అక్కడ ప్రచారం చేశారు. తిరిగి ఆయన యాక్టివ్‌ అయ్యారని భావించారు. కాని ఇప్పటికీ రాష్ట్ర రాజకీయాల పట్ల మాత్రం మౌనంగానే ఉంటూ వస్తున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోపు అయినా ఇక్కడి రాజకీయాల వైపు దృష్టి సారిస్తారా లేక దూరంగానే ఉంటారా అన్న చర్చ ఉమ్మడి జిల్లా వాసుల్లో చర్చ నడుస్తూ ఉంది. ఇక రఘువీరారెడ్డి పిసిసి అధ్యక్షతల నుంచి తప్పుకున్న తరువాత మాజీ మంత్రి డాక్టర్‌ సాకే శైలజనాథ్‌కు ఆ బాధ్యతలు అప్పగించారు. ఆయన 2004లో వైద్యవృత్తిని వదిలి రాజకీయరంగ ప్రవేశం చేశారు. 2012లో కాంగ్రెసు పార్టీ హయంలోనే విద్యా శాఖ మంత్రి అయ్యారు. రఘువీరారెడ్డి పిసిసి అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నాక ఆయన పిసిసి అధ్యక్షులయ్యారు. మొన్నటి వరకు ఆయన పిసిసి అధ్యక్షులుగా ఉంటూ వచ్చారు. కాని ఇటీవల ఆయన స్థానంలో గిడుగు రుద్రరాజును నియమించారు. అప్పటి నుంచి ఆయన కొంత వరకు కాంగ్రెసుకు దూరంగా జరుగుతున్నారన్న ప్రచారం రాజకీయవర్గాల్లో నడుస్తోంది. ఇక రాష్ట్రంలో కాంగ్రెసు ఇప్పట్లో పుంజుకునే పరిస్థితి లేదన్న ఉద్ధేశంతో ఇతర పార్టీల వైపు దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఆయన పూర్వపు నియోజకవర్గమైన శింగనమలలో ఇటీవలి కాలంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ముందున్న పరిచయాలతో ముఖ్యమైన వారిని గ్రామాల వారీగా కలుస్తూ, వచ్చే ఎన్నికల్లో తనకు సహకారం అందివ్వాలని కోరుతున్నారు. అయితే ఏ పార్టీ తరపున అన్నది స్పష్టంగా వారికి మాత్రం చెప్పడం లేదు. అయితే ఆయన తెలుగుదేశం పార్టీలోకి త్వరలో చేరే అవకాశముందన్నది మాత్రం ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఈ మేరకు ఇటీవల కాలంలో ఆయన ఆ పార్టీ ముఖ్య నేతలతో మంతనాలు జరిపారన్న ప్రచారమూ ఉంది.
ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో ఆ నియోజకవర్గంలో గ్రూపు తగాదాలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో వీటిని చెక్‌ పెట్టేందుకు ఆయన్ను తీసుకొస్తే బాగుంటుందన్న ఆలోచనలోనూ తెలుగుదేశం పార్టీ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మాజీ పిసిసి అధ్యక్షులు డాక్టర్‌ శైలజనాథ్‌ తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నట్టు తెలుస్తోంది. అయితే రఘువీరారెడ్డి ఎటు అన్నదే ఇప్పటికీ స్పష్టత లేదన్నది రాజకీయవర్గాల్లో సాగుతున్న చర్చ.