హైదరాబాద్ : మునుగోడు ఉప ఎన్నికల్లో అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్నవారందరితో కలిపి నియోజకవర్గ స్థాయిలో ఓ సమన్వయ కమిటీని ఏర్పాటుచేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది. కాంగ్రెస్ నుంచి ఈ ఉప ఎన్నికల్లో పోటీచేసేందుకు టికెట్ ఆశిస్తున్నవారు, మండలాల్లో పట్టున్న నేతలను కలిపి ఈ కమిటీని ఏర్పాటుచేయనున్నారు. టికెట్ రేసులో ఉన్న చల్లమల్ల కృష్ణారెడ్డి, పాల్వాయి స్రవంతి, పల్లె రవికుమార్, పున్న కైలాశ్‌లతో పాటు ఒక ఎస్టీ నేత ఈ కమిటీలో ఉంటారు. రాజగోపాల్‌రెడ్డి రాజీనామా ఆమోదం పొందడం, ఆ తర్వాత ఎన్నికల తేదీలు వచ్చేవరకు అభ్యర్థులంతా కలిసి పర్యటనలు చేసేలా వ్యూహాన్ని రూపొందిస్తున్నారు. ఆ తర్వాత ఎవరిని అభ్యర్థిగా నిర్ణయించినా అంతా సమన్వయంతోనే పనిచేసేందుకు ఈ కమిటీ ద్వారా మార్గం సుగమం అవుతుందని భావిస్తున్నారు.
ఈ కమిటీలో మాజీ ఎంపీలు అంజన్‌కుమార్ యాదవ్, బలరాం నాయక్, ఎమ్మెల్యే సీతక్క, మాజీ ఎమ్మెల్యేలు రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, ఇరావత్రి అనిల్‌కుమార్, సంపత్‌కుమార్ సభ్యులుగా ఉన్నారు. మునుగోడులో నిర్వహించిన బహిరంగ సభకు భారీగా ప్రజలు హాజరుకావడంపై ఆ పార్టీలో ఉత్సాహం వ్యక్తమవుతోంది. సభకు వచ్చినవారిలో ఎక్కువమంది స్థానికులే కావడంతో ఎమ్మెల్యేగా గతంలో గెలిచిన రాజగోపాల్ పార్టీ నుంచి వెళ్లిపోతేనేమీ తమ పార్టీ క్యాడర్ పెద్దగా చెక్కుచెదరలేదన్న ధీమాను కాంగ్రెస్ నేతలు వ్యక్తంచేస్తున్నారు.
అలాగే మునుగోడు సభ ఇచ్చిన జోష్‌ను కొనసాగించేందుకు తదుపరి కార్యాచరణగా నియోజకవర్గంలోని ఏడు మండలాల్లోనూ మండలాలవారీగా కార్యకర్తల సమావేశాలు, సభలను ఏర్పాటుచేయనున్నారు. టిపిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి స్వయంగా ఈ ఏడు మండలాల కార్యకర్తలు, అభిమానుల సమావేశాలకు హాజరుకానున్నారు. వచ్చేవారంలో వీటిని ప్రారంభించనున్నారు. ఇక మునుగోడు బహిరంగ సభకు పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరైనా అందరినీ నేతలు కలవలేకపోయారు. సోనియాగాంధీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీకి ద్రోహం చేసి వెళ్లిపోయిన వారికి తగిన బుద్ది చెప్పాలని రేవంత్‌రెడ్డి ఈ సభలో పిలుపునిచ్చారు. ఇదే పిలుపును ప్రతి కార్యకర్త వద్దకు తీసుకెళ్లడం, వీలైనంతమంది కార్యకర్తలను వ్యక్తిగతంగా కలిసేందుకు వీలుగా మండలాల వారీగా సమావేశాలను పార్టీ ఏర్పాటు చేసింది. కాగా ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో మునుగోడు ఉప ఎన్నిక వ్యవహారాన్ని పర్యవేక్షించేందుకు ఒక సమన్వయ కమిటీని ఆ పార్టీ నియమించింది. రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేస్తున్నానని ప్రకటించిన 10నిమిషాల్లోనే మాజీ ఎంపీ, టిపిసిసి ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్ ఆధ్వర్యంలో ఈ కమిటీని ఏర్పాటుచేశారు.










