- 7.43 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తి
- రాష్ట్రవ్యాప్తంగా 17వేల జగనన్న కాలనీలు
- సామర్లకోట సభలో సిఎం జగన్మోహన్‌రెడ్డి
ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి:అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే పేదల సొంతింటి కలను నిజం చేశామని ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 17వేల జగనన్న కాలనీలు ఏర్పాటు అవుతున్నాయన్నారు. 21.76 లక్షల ఇళ్ల నిర్మాణాలు చేపట్టి, 7.43 లక్షల ఇళ్లను పూర్తి చేశామన్నారు. లక్షల విలువైన ఆస్తిని అక్కచెల్లెమ్మల చేతిలో పెడుతున్నామన్నారు. 77 వేల ఎకరాలు సేకరించి పట్టాలు ఇచ్చామన్నారు. ఇళ్ల పట్టాల మార్కెట్ విలువ ప్రాంతాన్ని బట్టి ఒక్కో ఇంటిస్థలం విలువ రూ.2.5 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు ఉందన్నారు. రూ. 75 వేల కోట్ల విలువైన స్థలాలను పేదలకు ఇచ్చిన ఘనత తమ ప్రభుత్వానిదే అన్నారు. ఒక్కో ఇంటికి రూ.2.70 లక్షలు సాయం చేస్తున్నామన్నారు. కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం మరో రూ.32 వేల కోట్లను ప్రభుత్వం ఖర్చు చేస్తోందన్నారు. కాకినాడ జిల్లా సామర్లకోట ఇటిసి జగనన్న కాలనీలో గురువారం సామూహిక గృహ ప్రవేశ కార్యక్రమంలో ఆయన పాల్గన్నారు. ఇళ్లను ప్రారంభించి లబ్ధిదారులతో మాట్లాడారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన వైఎస్‌ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. తర్వాత ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గని మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా 35 పథకాలకు పైగా అమలు చేస్తున్నామని తెలిపారు. పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వకూడదనే ఉద్దేశంతో చంద్రబాబు కోర్టుకు వెళ్లి ఆపాలని చూశారన్నారు. కోవిడ్ సమయంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా సంక్షేమ పథకాలను పెద్ద ఎత్తున అమలు చేశామని గుర్తు చేశారు. చంద్రబాబు పాలనలో పేదవాడికి ఒక్క సెంటు స్థలం కూడా ఇవ్వలేదన్నారు. గతంలో 11 మెడికల్ కాలేజీలు ఉంటే మరో 15 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేశామన్నారు. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకొచ్చి వైద్యాన్ని ఇంటింటికీ అందిస్తున్నామన్నారు.
- కుప్పంలో వారికి ఇళ్లే లేవు
చంద్రబాబు హయాంలో కుప్పంలో పేదలకు ఒక్క సెంటు స్థలం కూడా ఇవ్వలేదని విమర్శించారు. వైసిపి హయాంలో 20 వేల పట్టాలు ఇచ్చి ఎనిమిది వేల నిర్మాణాలు జరిపామన్నారు. చంద్రబాబు, ఆయన కుమారుడు, బావమర్ధికి కనీసం కుప్పంలో ఇల్లు కూడా లేదని విమర్శించారు. కుప్పంలో కంటిన్యూగా ఒక నెల కూడా లేరని.. ఇప్పుడు రాజమండ్రిలో కనిపిస్తున్నారని ఎద్దేవా చేశారు.
- ఓట్ల వ్యాపారి పవన్
సొంత పార్టీని, సొంత వర్గానికి చెందిన ఓట్లను అమ్ముకునే వ్యాపారి పవన్‌కల్యాణ్ అని ముఖ్యమంత్రి జగన్ విమర్శించారు. తన అభిమానుల ఓట్లను హోల్‌సేల్‌గా అమ్ముకునేందుకు అప్పుడప్పుడు వస్తుంటారన్నారు. ఎస్‌సి, ఎస్‌టి, బిసిలు తనవారని చెప్పుకునే ధైర్యం పవన్, చంద్రబాబుకు లేదన్నారు. చివరికి కాపులను కూడా 'నా కాపులు' అని కూడా చెప్పుకోలేని పరిస్థితిలో పవన్ ఉన్నారని విమర్శించారు. 'ఎస్‌సిల్లో ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా' అని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు. జగన్ పేరు చెబితే లంచాలు లేని డిబిటి పాలన గుర్తుకు వస్తుందని, బాబు పేరు చెబితే గజదొంగల ముఠా, పెత్తందారీ అహంకారం గుర్తొస్తుందని తెలిపారు.
- సిపిఎం, సిఐటియు నాయకుల నిర్బంధం
సిఎం పర్యటన నేపథ్యంలో పెద్దాపురం నియోజకవర్గంలో సిఐటియు నాయకులు పోలీసులు గృహనిర్బంధం చేశారు. సిఐటియు జిల్లా నాయకులు దారపురెడ్డి క్రాంతికుమార్, సిపిఎం మండల కార్యదర్శి నీలపాల సూరిబాబును పెద్దాపురంలో నిర్బంధించారు. సిఐటియు జిల్లా నాయకులు బాలం శ్రీనివాస్‌ను సామర్లకోటలో గృహ నిర్బంధం చేశారు. ఈ నిర్బంధాలను టిడిపి, సిపిఎం నాయకులు తీవ్రంగా ఖండించారు.










