Mar 21,2023 09:41
  • లీగ్‌ దశలోనే నిష్క్రమించిన బెంగళూరు, గుజరాత్‌
  • నేటితో ముగియనున్న లీగ్‌ పోటీలు

ముంబయి : మహిళల ప్రిమియర్‌ లీగ్‌(డబ్ల్యుపిఎల్‌) ప్లే-ఆఫ్‌ బెర్త్‌లు ఖరారయ్యాయి. సోమవారం జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో యుపి వారియర్స్‌ జట్టు 3వికెట్ల తేడాతో గుజరాత్‌ జెయింట్‌పై గెలిచి ప్లే-ఆఫ్‌కు చేరుకోగా.. ఢిల్లీ జట్టు 9వికెట్ల తేడాతో ముంబయిని ఓడించి అగ్రస్థానానికి ఎగబాకింది. డివై పాటిల్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌ నిర్దేశించిన 110పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ జట్టు కేవలం 9 ఓవర్లలో వికెట్‌ కోల్పోయి ఛేదించింది. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన ముంబయి జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8వికెట్లు కోల్పోయి 109పరుగులు చేసింది. హర్మన్‌ప్రీత్‌(23), పూజ వస్త్రాకర్‌(26), వాంగ్‌(23), అమన్‌జ్యోత్‌ కౌర్‌(19) మాత్రమే బ్యాటింగ్‌లో రాణించారు. ఢిల్లీ బౌలర్లు కాప్‌, శిఖా పాండే, జొన్నాసేన్‌కు రెండేసి వికెట్లు దక్కాయి. ఛేదనలో ఢిల్లీ ఓపెనర్‌ షెఫాలీ వర్మ(33), కెప్టెన్‌ లానింగ్‌(32)కి తోడు కాప్సే(38) రాణించారు. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ కాప్సీకి లభించింది. ఇక బ్రాబౌర్న్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో తొలిగా బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6వికెట్ల నష్టానికి 178పరుగుల భారీస్కోర్‌ను నమోదు చేసింది. హేమలత(57), గార్డినర్‌(60) అర్ధసెంచరీలతో రాణించారు. గైక్వాడ్‌, పార్శవి చోప్రాకు రెండేసి వికెట్లు దక్కాయి. ఛేదనలో యుపి వారియర్స్‌ జట్టు 19.5ఓవర్లలో 7వికెట్లు కోల్పోయి 181పరుగులు చేసి విజయం సాధించింది. మెక్‌గ్రాత్‌(57), హర్రీస్‌(72)కి తోడు ఎక్లేస్టోన్‌(19) బ్యాటింగ్‌లో రాణించారు. కిమ్‌ గరాత్‌కు రెండు, మోనిక, గార్డినర్‌, కన్వర్‌, స్నేV్‌ా రాణాకు ఒక్కో వికెట్‌ దక్కాయి. ఈ ఓటమితో గుజరాత్‌ ప్లే-ఆఫ్‌ ఆశలు దారులు మూసుకుపోయాయి. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ గ్రేస్‌ హర్రీస్‌కు లభించింది. దీంతో యుపి జట్టు 8పాయింట్లతో మూడోస్థానంలో నిలిచి మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే ప్లే-ఆఫ్‌ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. ఢిల్లీ జట్టు 10పాయింట్లతో అగ్రస్థానానికి ఎగబాకగా.. ముంబయి జట్టు ఖాతాలో 10 పాయింట్లు ఉన్నా.. రన్‌రేట్‌ ప్రాతిపదికగా రెండోస్థానంలో నిలిచింది. నేడు జరిగిన మ్యాచ్‌లతో లీగ్‌ పోటీలు ముగియనుండగా.. శుక్రవారం(24న) ఎలిమేటర్‌, ఆదివారం(26న) ఫైనల్‌ మ్యాచ్‌ జరగనుంది.

111