Mar 25,2023 11:11
  • పెట్టుబడి వ్యయంగా రెవెన్యూ ఖర్చు చూపారు
  • ఖర్చు చేయని మొత్తం రూ.26,380 కోట్లు

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : రాష్ట్ర బడ్జెట్‌ నిర్వహణ రానురానూ ప్రహసనంగా మారుతోందని కాగ్‌ (కంప్ట్రోలర్‌ ఆడిటర్‌ జనరల్‌) ఘాటుగా విమర్శించింది. బడ్జెట్‌ సమావేశాలు చివరిరోజు ఈ నివేదికను ప్రభుత్వం ఉభయ సభల ముందుంచింది. ఇందులో రాష్ట్ర రుణాలు, ఆర్థికం, ఆదాయ, వ్యయాలు, కేంద్ర నిధుల వ్యయం, జిఎస్‌టి వంటి అనేక అంశాలపై కాగ్‌ విశ్లేషించింది. రెవెన్యూ వ్యయాన్ని పెట్టుబడి వ్యయంగా చూపించిన విధానంపై తీవ్రంగా ఆక్షేపించింది.
          కొన్ని కీలక శాఖలకు బదిలీ చేసిన ఆస్తులను మొత్తం ప్రభుత్వ ఆస్తుల నుంచి తగ్గించి చూపించకపోవడం వల్ల ఆస్తులు ఎక్కువగా ఉన్నట్లు కనిపించిందని కాగ్‌ ఆక్షేపించింది. ప్రధానంగా రోడ్లు భవనాల శాఖ, నీటిపారుదల శాఖల్లో ఈ పరిస్థితి గుర్తించినట్లు వివరించింది. మూలధన వాటా విషయంలో కూడా రాష్ట్రంలో చాలా తక్కువ శాతం నమోదైనట్లు పేర్కొంది. అన్ని రాష్ట్రాల సగటు 14.41 శాతరగా ఉండగా, రాష్ట్రంలో 9.21 శాతం మాత్రమే గుర్తించినట్లు వివరించింది.
 

                                                         కరువు ఖర్చుకు దూరంగా

రాష్ట్ర విపత్తు నిధులను ఖర్చు చేసిన తీరును కాగ్‌ ఆక్షేపించింది. ఈ నిధులను పబ్లిక్‌ డిపాజిట్‌ ఖాతాలకు మళ్లించి, అక్కడి నుంచి ఇతర అవసరాలకు మళ్లించడం ద్వారా కరువు సహాయక చర్యలకు నిధుల లేమి వచ్చిందని, రాష్ట్ర విపత్తు నిర్వహణ నిధి మార్గదర్శకాలకు విరుద్ధమని పేర్కొంది. అలాగే పాత లెక్కలను ఇంకా క్రమబద్ధీకరించుకోకపోవడాన్ని కూడా కాగ్‌ ఎత్తి చూపింది. 2004-05 నుంచి దాదాపు 18 ఏళ్లకు సంబంధించిన రూ.3,51,003 కోట్ల లెక్కలను ఇంకా క్రమబద్ధీకరించలేదని కాగ్‌ నివేదికలో గుర్తు చేసింది.
 

                                                         వనరుల ఆధారంగా ఖర్చు

తన వనరులను గుర్తించి అందుకు అనుగుణంగానే ఖర్చులు చేయాలని, ఎప్పుడైనా అదనపు నిధులు అవసరమైతే శాసనసభ నుంచి అనుమతి తీసుకోవాలని కాగ్‌ చెప్పింది.
 

                                                            పిడి ఖాతాల్లో అస్పష్టత

వివిధ శాఖల్లో అనుసరిస్తున్న పబ్లిక్‌ డిపాజిట్‌ ఖాతాల నిర్వహణ సరిగ్గా లేదని చెప్పింది. సంచిత నిధి నుంచి పిడి ఖాతాలకు మళ్లించిన నిధులను ఖర్చు చేయడంలో అజమాయిషీ లోపించినట్లు పేర్కొంది. అనేక ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, అథారిటీలు కూడా సరైన పద్దులు చూపించడం లేదని, ఇది ఆయా యంత్రాంగాల్లో అంతర్గత నియంత్రణ లేకపోవడం దీనికి ఒక కారణమని పేర్కొంది. 2021-22 ఆర్థిక సంవత్సరరలో రూ.11,238 కోట్ల పిడి ఖాతాల ద్వారా సర్దుబాట్లు జరిగాయని, ఈ సర్దుబాట్లు కూడా ఖజానా ద్వారా కాకుండా కేంద్రీకృత ప్రాసెసింగ్‌ సెల్‌ ద్వారా చేశారు. అలాగే అనేక లావాదేవీల్లో అవసరమైన పత్రాలు కనిపించలేదని పేర్కొంది.
 

                                                           నష్టాల్లో పిఎస్‌యులు

రాష్ట్రంలో ఉన్న పబ్లిక్‌ సెక్టార్‌ యూనిట్లలో 17 పిఎస్‌యులు నష్టాల్లో ఉన్నట్లు కాగ్‌ గుర్తించింది. ఈ నష్టం విలువ రూ.26,531 కోట్లుగా గుర్తించింది. అలాగే ఈ యూనిట్ల నికర విలువ రూ.18,084 కోట్లు పూర్తిగా హరించుకుపోయాయని వివరించింది. ప్రధానంగా మూడు డిస్కామ్‌లలో వాటాదారుల విలువ హరించుకుపోయినట్లు గుర్తించింది. బడ్జెట్‌లో లేని రుణాలతో సహా గణిస్తే జిఎస్‌డి పిలో 40.85 శాతం రుణాలుగా ఉన్నట్లు పేర్కొంది. రాష్ట్రం లో బడ్జెటేతర రుణాలు రూ.1,18,394 కోట్లు ఉన్నాయి.