Jun 10,2023 14:25

 ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో ఆసీస్‌ రెండో ఇన్నింగ్స్‌లో 123/4 స్కోరుతో కొనసాగుతోంది. దీంతో ఆధిక్యం 296 పరుగులకు చేరింది. ఇంకా రెండు రోజుల ఆట మిగిలి ఉంది. మూడో రోజు గురువారం టీమిండియా కీలక ఆటగాడు అజింక్య రహానే చేతి వేలికి గాయం అయింది. భారత్‌ తొలి ఇన్సింగ్స్‌ లో 89 పరుగులతో టాప్‌ స్కోరర్‌ గా నిలిచిన రహానే గాయపడడంతో అభిమానుల నుంచి ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ క్రమంలో రహానే తన వేలి గాయంపై స్పందించాడు. ''నా చేతి వేలికి అయిన గాయం పెద్దదేమీ కాదు. రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌పై ప్రభావం చూపదని భావిస్తున్నా'' అని వ్యాఖ్యానించాడు. ''తొలి ఇన్నింగ్స్‌లో నా ఆటతీరుపై ఆనందంగా ఉంది. మేం కనీసం 320-330 పరుగులు చేస్తామని భావించాం. కానీ, అది సాధ్యపడలేదు. గ్రీన్‌ అద్భుతంగా క్యాచ్‌ పట్టడంతో పెవిలియన్‌కు చేరక తప్పలేదు. అతడు మంచి ఫీల్డర్‌ అని తెలుసు. ఇప్పుడు ఆసీస్‌ ఆధిక్యంలోనే ఉంది. అయితే, మా రెండో ఇన్నింగ్స్‌లో ఒక్కో సెషన్‌ను ఆడుతూ ముందుకు సాగాలి. ఇవాళ తొలి గంట మాకు కీలకం. వారిని త్వరగా ఔట్‌ చేస్తే పట్టు సాధించేందుకు అవకాశం దొరుకుతుంది.'' అని రహానె తెలిపాడు.