- బిజెపి పై కెసిఆర్ విమర్శ
- విశాఖ ఉక్కును మోడీ అమ్మేసినా.. తిరిగి ప్రభుత్వపరం చేస్తామని ప్రకటన
- తోట చంద్రశేఖర్, రావెల కిషోర్, చింతల పార్ధసారధికి బిఆర్‌ఎస్ కండువా
ప్రజాశక్తి - హైదరాబాద్ బ్యూరో : విశాఖ ఉక్కును ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమ్మినా...బిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని వెనక్కి తీసుకొని ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తామని భారత రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్) అధ్యక్షులు, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కారుచౌకగా అమ్ముతోందని విమర్శించిన కెసిఆర్.. రూ.42లక్షల కోట్ల ఆస్తులున్న ఎల్‌ఐసిని ఎందుకు అమ్మాల్సి వచ్చిందని మోడీని ప్రశ్నించారు. ఎల్‌ఐసిని కూడా పరిరక్షిస్తామని చెప్పారు. ప్రభుత్వ ఆస్తుల్ని మోడీ ప్రభుత్వం తెగనమ్మేస్తుంటే దేశంలో మేధావి వర్గం గుడ్లప్పగించి చూస్తుందన్నారు. బిజెపి దుర్మార్గాలను ఎదిరించి దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తీసుకొచ్చి మహోజ్వల భారత్ నిర్మాణం కోసమే బిఆర్‌ఎస్ ఆవిర్భవించిందని కెసిఆర్ పేర్కొన్నారు. ఒక ప్రాంతం కోసమో లేక ఒక రాష్ట్రం కోసమో బిఆర్‌ఎస్ పుట్టలేదని, సువిశాల దేశ సామూహిక లక్ష్యం కోసం పనిచేస్తుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పలువురు నాయకులు సోమవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో కెసిఆర్ సమక్షంలో బిఆర్‌ఎస్‌లో చేరారు. తోట చంద్రశేఖర్, రావెల కిషోర్ బాబు, చింతల పార్ధసారధి, డిజె ప్రకాశ్, రమేశ్ నాయుడు, శ్రీనివాస నాయుడు, జెటి రమేశ్, తదితరులకు కెసిఆర్ పార్టీ కండువా మెడలోవేసి ఆహ్వానించారు.
ఆంధ్రప్రదేశ్ బిఆర్‌ఎస్ అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్‌ను నియమిస్తున్నట్లు కెసిఆర్ ప్రకటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలో అతిఎక్కువ సాగుభూమి భారతదేశంలోనే ఉందని, అయినా ఇప్పటికీ మనం ఆహారధాన్యాలను దిగుమతి చేసుకుంటున్నామని అన్నారు. ప్రభుత్వాల వైఫల్యం కారణంగానే దేశరాజధాని ఢిల్లీలో రైతులు ధర్నా చేయాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. ఇండియా బుద్ది మంతుల దేశం.. ప్రయత్నం ప్రబలంగా ఉండి సమాచారం చేరవేస్తే దేశం స్పందిస్తుందని, ఇందిరాగాంధీ వంటి బలమైన నేతనే దేశం గిల్లిపారేసిందని కెసిఆర్ గుర్తుచేశారు.
దేశ రైతాంగానికి ఉచిత విద్యుత్..దళిత బంధు
బిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండేళ్లలో వెలుగు జిలుగుల భారత్ సాకారమవుతుందని అన్నారు. దేశంలో రైతులందరికీ ఉచిత విద్యుత్ ఇచ్చి తీరుతామని, దళితులందరికీ దళిత బంధు అమలు చేస్తామని కెసిఆర్ ప్రకటించారు. దేశంలోని ఆరున్నర లక్షల గ్రామాల్లో బిఆర్‌ఎస్ శాఖలు ఏర్పటు చేస్తామన్నారు. దేశంలోని 4163 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బిఆర్‌ఎస్ ఉంటుందని చెప్పారు.ఆంధ్రప్రదేశ్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా తనతో టచ్‌లో ఉన్నారని కెసిఆర్ చెప్పారు. సిట్టింగులు కదా మీకేం ఇబ్బంది అంటే ఫిట్టింగ్ లేదని వారు చెబుతున్నారని చమత్కరించారు. సంక్రాంతి తర్వాత బిఆర్‌ఎస్ విస్తరణ జోరుగా ఉంటుందని ఎనిమిది రాష్ట్రాల్లో కమిటీల కూర్పు కూడా పూర్తయిందన్నారు.










