ప్రజాశక్తి - అమరావతి బ్యూరో :రైల్వేల ప్రైవేటీకరణతో పాటు, ఆస్తులను అమ్మివేయడం వంటి చర్యలను తక్షణమే నిలిపివేయాలని ఆలిండియా లోకో రన్నింగ్ స్టాఫ్ అసోసియేషన్ (ఎఐఎల్‌ఆర్‌ఎస్‌ఎ) ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. 1973 సంవత్సరంలో జరిగిన చారిత్రక సమ్మె విజయోత్సవ దినోత్సవ వేడుకలు (గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్) వేడుకలు ఎఐఎల్‌ఆర్‌ఎస్‌ఎ డివిజనల్ సెక్రటరీ కె.రామకృష్ణ అధ్యక్షతన విజయవాడ రైల్వే ఇన్‌స్టిట్యూట్‌లో ఆదివారం జరిగాయి. ఈ సందర్భంగా ప్రసంగించిన పలువురు రైల్వే ప్రైవేటీకరణ దేశానికి హాని చేస్తుందన్నారు. రామకృష్ణ మాట్లాడుతూ నూతన పెన్షన్ విధానం రద్దు చేసి దాని స్థానంలో పాత పెన్షన్ విధానం పునరుద్ధరించాలని కోరారు. స్టాఫ్ కనీస అవసరాలు కోసం 30శాతం లీవ్ రిజర్వు, నాలుగు వారాంతపు (30గంటలు) సెలవులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ప్రయాణీకుల భద్రత దృష్ట్యా క్రూ లింక్స్ ఖశ్చితంగా పాటించాలని, డివిజన్ స్ధాయిలో 539 లోకో రన్నింగ్ కేటగిరీ ఖాళీలు, 47 రన్నింగ్ సూపర్ వైజర్ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని ఎఐఎల్‌ఆర్‌ఎస్‌ఎ నేతలు డిమాండ్ చేశారు, రైల్వే రన్నింగ్ కార్మికులపై రైల్వే యంత్రాంగం తీవ్రమైన పని ఒత్తిడిని బలవంతంగా రుద్దుతోందని చెప్పారు. అధిక పనిగంటలు, సెలవులు మంజూరు చేయకపోవడం, వారంతపు సెలవులు సరిగా ఇవ్వకపోవడం, ఖాళీలను భర్తీ చేయకపోవడం వంటి చర్యలు అమలు చేస్తున్నారన్నారు. వీఠిని తక్షణమే మానుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం 1973 చారిత్రక సమ్మెలో పాల్గన్న లోకో ఫైలెట్లు (వెటరన్) కె.సుబ్రహ్మణ్యం, గోళ్ల భూషరావు,జి, దైవాదీనం,జె.రామ్‌గోపాల్, కె. బాబూరావు, విఎస్‌ఎన్ బిరావు, కె. ఆనంద్, ఎస్‌వి రావు, మోహన్‌రావులను అసిసియేషన్ సన్మానించింది. వారు మాట్లాడుతూ 1973లో తాము చేసిన సమ్మె చారిత్రక విజయం సాధించిందన్నారు. సమ్మె ఫలితంగా కేంద్ర ఫ్రభుత్వానికి, ఆలిండియా లోకో రన్నింగ్ స్టాఫ్‌కు మధ్యన 13.08.1973న ఒప్పందం జరిగిందన్నారు. అప్పటి రైల్వే మంత్రి ఎల్‌ఎన్ మిశ్రా 14.08.1973న ఒప్పందాన్ని పార్లమెంట్‌లో ప్రకటించారన్నారు. తమ పోరాట ఫలితంగా అపరిమితంగా ఉండిన పని విధానం 10 గంటల పనివిధానంగా నిర్ణయించారని, తొలగించిన రన్నింగ్ కార్మికులను తిరిగి నియమించే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర నాయకులు, రైల్వే కాంట్రాక్టు వర్కర్స్ అసోసియేషన్ సెక్రటరీ వివిఎల్ నరసింహులు, ఆలిండియా లోకో రన్నింగ్ స్టాఫ్ అసోసియేషన్ విజయవాడ, డివిజన్ అధ్యక్షులు ఎం. వెంకటేషన్, బ్రాంచ్ ప్రెసిడెంట్ పివి రాము, రాజమండ్రి బ్రాంచ్ అధ్యక్షులు బిసిఎస్ రావు, లోకో ఫైలెట్లు పాల్గొన్నారు.










