Aug 16,2023 21:51
  •  కేంద్ర ప్రభుత్వం ఆమోదం : డిఆర్‌ఎం

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : గుంటూరు-సికింద్రబాద్‌ మధ్య రైల్వే ట్రాక్‌ డబ్లింగ్‌కు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ (డిఆర్‌ఎం) ఎం.రామకృష్ణ తెలిపారు. గుంటూరులోని తన కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రూ.2853.28 కోట్ల అంచనాలతో 239 కిలో మీటర్ల మేర డబ్లింగ్‌ పనులు చేయనున్నట్టు తెలిపారు. నడికుడి-శ్రీకాళహస్తి నూతన రైల్వే లైను ప్రస్తుతం పిడుగురాళ్ల, శావల్యాపురం మధ్య ట్రాక్‌ నిర్మాణం పూర్తయిందని, శావల్యాపురం నుంచి గుండ్లకమ్మ మధ్య పనులు జరుగుతున్నాయని అన్నారు. ప్రకాశం జిల్లాలో భూ సేకరణ పెండింగ్‌ ఉండటం, రాష్ట్ర ప్రభుత్వం తన వాటా చెల్లించకపోవడం వల్ల కూడా పనులు వేగంగా జరగడం లేదన్నారు. గుండ్లకమ్మ వరకు పూర్తయితే తరువాత కనిగిరి వరకు చేపడతామన్నారు. గుంటూరు-గుంతకల్లు డబ్లింగ్‌, విద్యుద్దీరణ పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. గుంటూరు డివిజన్‌ పరిధిలో తెనాలి, పిడుగురాళ్ల, రేపల్లే రైల్వే స్టేషన్‌లను ఆధునీకరిస్తున్నట్టు చెప్పారు.