- 'జనం కోసం సిపిఎం'లో నేతల ఎదుట రైతుల ఆవేదన
ప్రజాశక్తి-యంత్రాంగం :'జనం కోసం సిపిఎం' కార్యక్రమంలో తమ దృష్టికి వచ్చిన ప్రజా సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నెల్లూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో సచివాలయాలు, తహశీల్దార్ కార్యాలయాల వద్ద శుక్రవారం నిరసనలు తెలిపారు. పన్నుల భారాలు మోపవద్దని, తాగునీరు, రోడ్లు, డ్రెయినేజీలు, విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అర్హులకు, పింఛన్లు, రేషన్ కార్డులు మంజూరు చేయాలని కోరారు. అనంతరం అధికారులుకు వినతిపత్రాలు అందజేశారు. వాటర్ ట్యాంక్ నిర్మించినప్పటికీ ప్రారంభించకుండా నిరుపయోగంగా వదిలేశారని, ఈ ట్యాంకుకు సంబంధించిన చెరువు చెత్తా చెదారంతో నిండిపోయిందని, పాలకులు, అధికారులు పట్టించుకోవడంలేదని ఏలూరు జిల్లా నిడమర్రు మండలం అడవికొలను గ్రామస్తులు సిపిఎం నేతల ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. డ్రెయినేజీలు లేక అవస్థలు పడుతున్నామని, వాడుక నీరు బయటకు వెళ్లక అనారోగ్యం పాలవుతున్నామని ఆకుముడిదిబ్బ వాసులు వాపోయారు. ధాన్యం అమ్మిన తమకు ప్రభుత్వం డబ్బులు వేయలేదని, సార్వా పంటకు చేతిలో చిల్లిగవ్వ లేక ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రహదారులను అభివృద్ధి చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం నేతలు చింతలపూడిలోని రత్నా థియేటర్ వద్ద కొద్దిసేపు ఆందోళన చేశారు. అనంతరం ప్రదర్శనగా తహశీల్దార్ కార్యాలయానికి చేరుకొని అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ నెల 11న కలెక్టరేట్ వద్ద ధర్నాను విజయవంతం చేయాలని కోరుతూ ఏలూరులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద ధర్నా పోస్టర్‌ను ఆవిష్కరించారు. పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ మండలం వడలిలో సచివాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యాన ధర్నా చేశారు. జనం కోసం సిపిఎం కార్యక్రమంలో వెలుగు చూసిన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నినదించి వినతిపత్రం అందించారు. నెల్లూరు నగరంలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని, డ్రెయినేజీలు, రహదారి సౌకర్యం కల్పించాలని నేతల దృష్టికి తీసుకొచ్చారు.










