- కార్మిక సంక్షేమాన్ని విస్మరిస్తున్న ప్రభుత్వాలు
- సిడబ్ల్యుఎఫ్‌ఐ జాతీయ ప్రధాన కార్యదర్శి జోసఫ్
ప్రజాశక్తి-నెల్లూరు ప్రతినిధి :నిర్మాణ రంగాన్ని కార్పొరేట్ కంపెనీలు తమ గుప్పెట్లో పెట్టుకున్నాయని సిడబ్ల్యుఎఫ్‌ఐ ప్రధాన కార్యదర్శి యు.పి జోసఫ్ అన్నారు. అఖిల భారత భవన, ఇతర నిర్మాణ రంగ కార్మికుల సమాఖ్య ( బిల్డింగ్ అండ్ అదర్ కన్‌స్ట్రక్షన్స్ వర్కర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా) జాతీయ సమావేశాలు నెల్లూరులో ప్రారంభమయ్యాయి. తొలిరోజైన గురువారం నగరంలోని విఆర్‌సి సెంటర్ నుంచి స్థానిక ముత్తుకూరు గేట్ సెంటర్ వరకూ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో జాతీయ, రాష్ట్ర నాయకులు పాల్గన్నారు. అనంతరం జరిగిన బహిరంగ సభకు జోసఫ్ ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు ఆనుకూలంగా, కార్మిక వర్గానికి వ్యతిరేకంగా పనిచేస్తుందన్నారు. నిర్మాణానికి ఉపయోగపడే ఇసుక, స్టీల్, సిమెంట్, ధరలు విపరీతంగా పెరిగాయని,దీంతో నిర్మాణ రంగం కుదేలవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం కార్పొరేట్ కంపెనీల ఆదాయం కోసం మాత్రమే కేంద్రం పనిచేస్తోందని విమర్శించారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి కార్మిక చట్టాల మార్పు ఏ మాత్రమూ ఉపయోగపడడం లేదని విమర్శించారు. రాష్ట్రాలకు రావాల్సిన భవన నిర్మాణ సెస్ మొత్తం కేంద్రం తీసుకుంటోందని చెప్పారు. ఈ సెస్ ప్రభుత్వం ఇచ్చింది కాదని, భవన యజమానులు ఇచ్చిందని, ఇది కార్మికుల సంక్షేమానికి ఉపయోగించాలని చట్టం చెబుతుంటే కేంద్రం పక్కదారి పట్టిస్తోందని మండిపడ్డారు. దేశంలో ఒక్క కేరళ తప్ప, ఏ రాష్ట్రం కూడా భవన నిర్మాణ కార్మికుల కోసం సెస్ ఉపయోగించడం లేదన్నారు. కేరళలో వంద రూపాయల వసూళ్లలో 69 రూపాయలు నిర్మాణ రంగ కార్మికులు సంక్షేమానికి ఖర్చు పెడుతుందని వివరించారు. ఎపిలో కేవలం 20 రూపాయలు మాత్రమే ఖర్చుచేస్తున్నారని తెలిపారు. భవన, ట్రాన్స్‌పోర్టు, గ్రామీణ ప్రాంత కార్మికులు ఇబ్బందులు పరిష్కరించకుండా వారి మధ్య విభేదాలు సృష్టించి, మతోన్మోదాన్ని రెచ్చగొడుతున్నారని విమర్శించారు. హిందుత్వ అజెండాని ముందుకు తెస్తున్నారని, దీనిని కార్మికులు తిప్పికొట్టాలని కోరారు. పెట్రోల్, గ్యాస్, సబ్సిడీలు రద్దు చేసి, కార్పొరేట్ శక్తులకు ప్రయోజనం కలిగిస్తున్నాయని విమర్శించారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రూ.400 గ్యాస్ ధర తగ్గించారని, ఎన్నికల తరువాత మళ్లీ ధరలు పెరుగుతాయని చెప్పారు. దేశంలో బిజెపికి ప్రజలు పూర్తి అధికారం ఇవ్వలేదని గుర్తు చేశారు. ఇటీవల భవన నిర్మాణ కార్మిక సంఘం జాతీయ మహా సభలు గౌహతిలో జరిగాయని, ప్రస్తుతం నెల్లూరులో నాలుగు రోజుల జాతీయ సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు. నిర్మాణ రంగ కార్మికుల సమస్యల పరిష్కారానికి పోరాటాలు రూపొందిస్తామని చెప్పారు. ఆల్ ఇండియా భవన నిర్మాణ కార్మిక సంఘం ఉపాధ్యక్షులు ఎం.సాయిబాబు మాట్లాడుతూ.. కార్మికుల సంక్షేమాన్ని కేంద్రం గాలికి వదిలేసిందన్నారు. నిర్మాణ రంగం కుదేలవ్వడానికి కేంద్ర ప్రభుత్వ విధానాలు ఓ కారణమని తెలిపారు. రోజురోజుకూ ధరలు పెరుగుతున్నాయని, అందుకు అనుగుణంగా కార్మికుల వేతనాలు పెరగడం లేదన్నారు. ప్రమాదవశాత్తు నిర్మాణ కార్మికుడు మరణిస్తే అతని కుటుంబానికి ఎటువంటి రక్షణ లేదన్నారు. ఈ విధానాలన్నింటిపైనా కార్మికులు పోరాడాల్సిన అవసం ఉందని . ఈ సమావేశాల్లో భవిష్యత్తు కార్యాచరణను రూపొందిస్తామని తెలిపారు. సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నర్సింగరావు మాట్లాడుతూ.. భవన నిర్మాణ కార్మికులు ఆంధ్రప్రదేశ్‌లో 50 లక్షల మంది ఉంన్నారని, చట్ట ప్రకారం సెస్స్ ద్వారా వసూలైన ఎనిమిది వేల కోట్ల రూపాయలు సంక్షేమ బోర్డులో ఉన్నాయన్నారు. గడిచిన మూడు సంవత్సరాల నుంచి ఈ సంక్షేమ బోర్డు నుంచి కార్మికులకు చెల్లింపులు జరగడం లేదని తెలిపారు. ఆ సంక్షేమ బోర్డులో ఉన్న నగదును రాష్ట్ర ప్రభుత్వం దొడ్డిదారిన వినియోగించుకుంటోందనిచెప్పారు. భవన నిర్మాణ కార్మికులు అందరూ కలిసి ఐక్య పోరాటానికి సిద్ధం కావాలని కోరారు.ఎపి బిల్డింగ్ అండ్ అదర్ కన్‌స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర గౌరవాధ్యక్షులు వి.ఉమామహేశ్వరరావు, రాష్ట్ర అధ్యక్షులు ఎన్.రమణరావు, ప్రధాన కార్యదర్శి ఆర్‌వి నరసింహరావు, నెల్లూరు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి చాంద్ బాషా, అల్లాడి గోపాల్ తదితరులు పాల్గన్నారు. ఈ సమావేశానికి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె.అజరు కుమార్ అధ్యక్షత వహించారు.










