Mar 11,2023 22:14

- గిల్‌ సెంచరీ.. కోహ్లీ అర్ధ సెంచరీ
అహ్మదాబాద్‌: బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీలో భాగంగా జరుగుతున్న నాల్గో టెస్ట్‌లో టీమిండియా ధీటుగా బ్యాటింగ్‌ చేస్తోంది. ఓవర్‌ నైట్‌ స్కోరు 36పరుగులతో తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన టీమిండియా మూడోరోజు ఆట ముగిసే సమయానికి 3వికెట్ల నష్టానికి 289పరుగులు చేసింది. యువ ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌(128) సెంచరీకితో తోడు, సీనియర్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి(59నాటౌట్‌) అర్ధసెంచరీలతో రాణించారు. శనివారం మూడో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (35)ను కుహ్నెమన్‌ బౌలింగ్‌లో షాట్‌ ఆడేందుకు యత్నించి షార్ట్‌ కవర్‌ పాయింట్‌లోని లబూషేన్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన పుజారాతో కలిసి గిల్‌ ఇన్నింగ్స్‌ను నడిపించాడు. ఈ క్రమంలో లంచ్‌ బ్రేక్‌ సమయానికి భారత్‌ వికెట్‌ నష్టానికి 129 పరుగులు చేసింది. రెండో సెషన్‌ ప్రారంభంలో ఆసీస్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో భారత్‌ బ్యాటర్లు నిదానంగా ఆడారు. తర్వాత కాస్త దూకుడు పెంచారు. టీ విరామానికి ముందు గిల్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కొద్ది సేపటికే పుజారా ఔటయ్యాడు. అతడు మర్ఫీ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు. రెండో సెషన్‌లో భారత్‌ 59 పరుగులు మాత్రమే రాబట్టి రెండు వికెట్లను కోల్పోయింది.
మూడో సెషన్‌లో కోహ్లీ దూకుడు
టీ విరామ సమయానికి 2 వికెట్ల నష్టానికి 188 పరుగులతో చివరి సెషన్‌ను ఆరంభించిన భారత్‌ను కోహ్లీ ఆదుకున్నాడు. స్టార్క్‌, మర్ఫీ వేసిన వరుస ఓవర్లలో బౌండరీలు బాదాడు. కొద్దిసేపటికే అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడిన గిల్‌.. లియన్‌ బౌలింగ్‌లో ఎల్బీగా ఔటయ్యాడు. డీఆర్‌ఎస్‌కు వెళ్లినా.. సమీక్షలోనూ ఔట్‌గా తేలడంతో పెవిలియన్‌ బాట పట్టాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన జడేజా నిదానంగా ఆడగా.. కోహ్లీ నిలకడగా పరుగులు రాబట్టి అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. కోహ్లీకిది టెస్టుల్లో గత 16 ఇన్నింగ్స్‌ల్లో తొలి అర్ధ సెంచరీ మాత్రమే.
స్కోర్‌బోర్డు...
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌-480ఆలౌట్‌
ఇండియా తొలి ఇన్నింగ్స్‌: రోహిత్‌ (సి)లబూషేన్‌ (బి)కుహ్నెమన్‌ 35, శుభ్‌మన్‌ (ఎల్‌బి)లియాన్‌ 128, పుజారా (ఎల్‌బి)మర్ఫీ 42, కోహ్లి (బ్యాటింగ్‌) 59, జడేజా (బ్యాటింగ్‌) 16, అదనం 5. (99ఓవర్లలో 3వికెట్ల నష్టానికి) 289పరుగులు.
వికెట్ల పతనం: 1/74, 2/187, 3/245
బౌలింగ్‌: స్టార్క్‌ 17-2-74-0, గ్రీన్‌ 10-0-45-0, లియాన్‌ 37-4-75-1, కుహ్నెమన్‌ 13-0-43-1, మర్ఫీ 22-6-45-1.