Mar 10,2023 08:19
  •  అరకొరగా కొనుగోళ్లకు నిర్ణయం
  •  ఐదు జిల్లాల్లో 2.59 లక్షల టన్నులకు ప్రభుత్వం అనుమతి

ప్రజాశక్తి- కృష్ణా ప్రతినిధి : ధాన్యం సేకరణ లక్ష్యాన్ని ప్రభుత్వం ఎట్టకేలకు పెంచింది. అయితే, అధికార యంత్రాంగం పంపిన ప్రతిపాదనలకు అనుగుణంగా కాకుండా అరకొరగానే సేకరణ లక్ష్యాన్ని నిర్దేశించింది. రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో మరో 2.59 లక్షల టన్నుల ధాన్యాన్ని అదనంగా సేకరించాలని నిర్ణయించింది. లక్ష్యం పూర్తయిందనే కారణంతో ప్రభుత్వం వారం రోజులుగా కృష్ణా జిల్లాతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం సేకరణను నిలిపివేసింది. దీంతో, రైతుల వద్ద మిగిలిపోయిన ధాన్యాన్ని సేకరించాలంటూ రైతు, కౌలు రైతు సంఘాల ఆధ్వర్యంలో అధికారులకు వినతిపత్రాలు అందించారు. పలు ప్రాంతాల్లో ఆందోళనలు నిర్వహించారు. 'గడపగడపకూ మన ప్రభుత్వం' కార్యక్రమంలోనూ అధికార పార్టీ ప్రజాప్రతినిధుల వద్ద రైతులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఈ నేపథ్యంలోనే కృష్ణా జిల్లా గుడివాడ, మచిలీపట్నం, అవనిగడ్డ ఎంఎల్‌ఎలు ఇటీవల ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డిని కలిసి ధాన్యం సేకరణ లక్ష్యాన్ని పెంచాలని విజ్ఞప్తి చేశారు. రైతుల నుంచి వస్తోన్న ఒత్తిడిని గ్రహించిన ప్రభుత్వం తాజాగా లక్ష్యాన్ని పెంచింది. కృష్ణా జిల్లాలో పది లక్షల టన్నుల దిగుబడి రాగా, ఇందులో 5.06 లక్షల టన్నులను మాత్రమే ప్రభుత్వం సేకరించింది. మరో రెండు లక్షల టన్నుల మేర బిపిటి (కర్నూలు సోనా)లను బహిరంగ మార్కెట్లో అమ్ముకునేందుకు రైతులకు వెసులుబాటు కల్పించింది. 1.26 లక్షల టన్నుల ధాన్యాన్ని స్థానిక అవసరాలకు ఉపయోగిస్తారు. ఈ నేపథ్యంలో ఇంకా 1.68 లక్షల టన్నుల ధాన్యం సేకరణకు అవకాశం కల్పించాలని జిల్లా యంత్రాంగం ప్రభుత్వానికి నివేదిక పంపింది. ప్రభుత్వం 94 వేల టన్నులు మాత్రమే అదనంగా కొనుగోలు చేసేందుకు అనుమతి ఇచ్చింది. మిగిలిన జిల్లాల్లోనూ ఆయా జిల్లా యంత్రాంగాలు పంపిన నివేదికలకూ, అనుమతి ఇచ్చిన అదనపు లక్ష్యానికి పొంతన లేదని సమాచారం. దీంతో, ఆర్‌బికెల ద్వారా ధాన్యం సేకరణ ప్రారంభించినా మళ్లీ కొద్ది రోజులకే కొనుగోళ్లు నిలిచిపోయే అవకాశం ఉంది.

table