Aug 14,2023 21:23

ప్రజాశక్తి-కురిచేడు (ప్రకాశం జిల్లా) : గొర్రెల మేతకు దారి చూపాలని కోరుతూ ప్రకాశం జిల్లా కురిచేడు పంచాయతీ పరిధిలోని గొల్లపాలెం గ్రామం మేకల, గొర్రెల పెంపకందారులు దాదాపు ఐదు వేలకు పైగా గొర్రెలతో సోమవారం ప్రదర్శన నిర్వహించి, తహశీల్దారు కార్యాలయాన్ని ముట్టడించారు. గొల్లపాలెం సర్వే నంబర్‌ 77లో ఉసుళ్ల దండుబాట ఉండేది. ఈ బాట గుండానే గతంలో గొల్లపాలెం నుండి గొర్రెలను మేతకు తోలుకెళ్లేవారు. 2002లో ఆ సర్వే నెంబర్‌లో ఉన్న 19 ఎకరాల అసైన్‌మెంట్‌ భూమిని గ్రామంలోని కొందరికి వ్యవసాయం కోసం అప్పటి ప్రభుత్వం పట్టాలు ఇచ్చింది. పట్టాలు పొందిన వారు ఆ భూమి గుండా గొర్రెలను మేతకు రానివ్వకుండా అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఇటీవల గొర్రెల పెంపకందారులు కురిచేడు పర్యటనకు వచ్చిన కలెక్టర్‌కూ తమ గోడును వెళ్లబోసుకున్నారు. స్పందించిన కలెక్టర్‌ వెంటనే స్పందించి దారి సమస్యను పరిష్కరించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. అయినా సమస్య పరిష్కరించలేదు. గత్యంతరం లేక పెంపకందారులు తహశీల్దార్‌ కార్యాలయాన్ని ఐదు వేల గొర్రెలతో ముట్టడించారు. దీనిపై తహశీల్దార్‌ స్పందించి జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. ఆ భూముల వివరాలు తమకు పంపితే పది రోజుల్లోపు సమస్యను పరిష్కస్తామని జాయింట్‌ కలెక్టర్‌ హామీ ఇచ్చారు. దీంతో గొర్రెల, మేకల పెంపకందారులు ఆందోళన విరమించారు. కార్యక్రమంలో జిల్లా గొర్రెల, మేకల పెంపకందారుల జిల్లా కార్యదర్శి తోట తిరుపతిరావు పాల్గొన్నారు.