- పునరావాసం తర్వాతే ప్రాజెక్టు : నెల్లిపాకలో సిపిఎం మహా పాదయాత్ర ప్రారంభం
- సమరోత్సాహంతో 'పోలవరం పోరు కేక' నెల్లిపాక నుంచి
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి : పోలవరం ప్రాజెక్టు కోసం తమ ఊళ్లు, ఇళ్లు, భూములు త్యాగం చేసిన నిర్వాసితుల హక్కుల సాధనకై తాడోపేడో తేల్చుకుంటామని సిపిఎం హెచ్చరించింది. అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం పోలవరంలో మునుగుతున్న లక్షకుపైగా కుటుంబాలకు చట్టాల ప్రకారం, ఇచ్చిన హామీల మేరకు సహాయ, పునరావాసం కల్పించకుండా నిర్లక్ష్యం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రాజెక్టు కారణంగా నిరాశ్రయులైన చిట్టచివరి వ్యక్తి వరకు పునరావాసం కల్పించాకే ప్రాజెక్టు నిర్మాణం చేయాలని డిమాండ్ చేసింది. నిర్వాసితుల పునరావాసం కోసం పదేళ్ల నుంచి ఆందోళనలు నిర్వహించినా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో 'పోలవరం నిర్వాసితుల పోరు కేక' పేరిట మహా పాదయాత్రకు సిపిఎం శ్రీకారం చుట్టింది. జూన్ 20 నుంచి జులై 4 వరకు పదిహేనురోజుల పాటు నెల్లిపాక నుంచి విజయవాడ వరకు 400 కిలోమీటర్లు సాగే మహా పాదయాత్ర ఎటపాక మండలం నెల్లిపాక సెంటర్‌లో మంగళవారం మధ్యాహ్నం సమరోత్సాహంతో ప్రారంభమైంది.

పాదయాత్రకు సారధ్యం వహిస్తున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు గిరిజన సంప్రదాయ కొమ్ముబూరతో శంఖారావం పూరించగా, పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు విజ్జు క్రిష్ణన్ జెండా ఊపి పాదయాత్రను ప్రారంభించారు. అంతకుముందు బహిరంగసభ నిర్వహించారు. సభలో ప్రసంగించిన నేతలందరూ నిర్వాసితుల సమస్యలను విస్మరించిన ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించారు. నిర్వాసితుల న్యాయమైన హక్కులు సాధించేవరకు వెనుదిరిగేది లేదని దీక్ష బూనారు.
జీవన్మరణ పోరాటం
సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు విజ్జు క్రిష్ణన్ మాట్లాడుతూ నిర్వాసితులది జీవన్మరణ పోరాటమన్నారు. పాదయాత్ర ఆరంభం మాత్రమే. వేరే ప్రదేశానికి సాగునీరు, అభివృద్ధి కోసం సర్వం త్యాగం చేశారు. వారి విషయంలో బిజెపి, వైసిపి రెండు ప్రభుత్వాలూ స్పందించట్లేదు. పోరాటాలతోనే ప్రభుత్వాలను కదిలించగలుగుతాం. బ్రిటీష్ కాలంలోని 1894 భూసేకరణ చట్టానికి వ్యతిరేకంగా అలుపెరగని పోరాటాలు చేసినందునే 2013 చట్టం వచ్చింది. దాని అమలుకు యుపి, మహారాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో పోరాటాలు జరుగుతున్నాయి. మోడీ ప్రభుత్వం ఆదివాసీల భూములను బలవంతంగా అదానీ వంటి వారికి లక్షల ఎకరాలు సేకరిస్తోంది. నాసిక్ నుంచి ముంబయికి లాంగ్ మార్చ్ మొదలైనప్పుడు ఏముందిలే అనుకున్నారు. మహారాష్ట్ర సర్కారు దిగి రావాల్సి వచ్చింది. మూడు నల్ల వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఏడాదికిపైన సాగిన పోరాటంతో మోడీ సర్కారు చట్టాలను రద్దు చేయాల్సి వచ్చింది. ఆ స్ఫూర్తితో పోలవరం నిర్వాసితులు పోరాడాలి..

గోదారిలో ముంచుతాం
నిర్వాసితులను పట్టించుకోకుండా వారిని గోదారిలో ముంచాలని ప్రభుత్వం చూస్తే ప్రభుత్వాన్నే గోదారిలో ముంచుతామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు అన్నారు. పదవుల కోసం, అధికారం కోసం పాదయాత్రలు చేపడుతున్నారు. మా పాదయాత్ర అందుక్కాదు. ప్రాజెక్టులో మునుగుతున్న గిరిజనులు, ఎస్‌సిలు, బిసిలు, పేద వర్గాల భవిష్యత్తు కోసం. వారి న్యాయమైన సమస్య పరిష్కారం కోసం. తరచు ముఖ్యమంత్రి పోలవరం నిదుల కోసం ఢిల్లీ వెళుతున్నారు. అక్కడి నుంచి కేంద్ర పెద్దలు, అధికారులు ఇక్కడికి వస్తున్నారు. కేంద్రం గల్లా పట్టుకొని నిధులు తెచ్చుకోమనే చెబుతున్నాం. ఆ నిధులు తొలుత నిర్వాసితులకు కాకుండా కాంట్రాక్టర్లకు ఖర్చు చేస్తున్నారు. ప్రాజెక్టు ఎత్తు ఎంత, డయాఫ్రంవాల్ దెబ్బతినడానికి మీరు కారణమంటే మీరు అని వైసిపి, టిడిపి ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ముంపు ప్రాంతాల్లో విద్య, వైద్యం, సంక్షేమం, ఉద్యోగాలు ఏమీ లేవు. చిన్న వరదలకే అంచనాలకు మించి గ్రామాలు మునుగుతున్నాయి. పోయిన వరదల్లో ముంపునకు గురైన వారికి పరిహారం ఇవ్వలేదు. మళ్లీ వరదలొస్తున్నాయి. ఏం చర్యలు చేపట్టారు? మోడీ ఆర్డర్ వేస్తే జగన్ పని చేస్తున్నారు. నిర్వాసితుల సమస్య తీవ్రతను గుర్తించాలి. లేకపోతే పోరాటంతో గుర్తించేలా చేస్తాం. తేల్చుకుంటాం. ప్రజలు పైసా పైసా వేసుకొని పాదయాత్రను నడిపిస్తున్నారు. ఇది తెలుగు ప్రజలందరి ఉమ్మడి సమస్య. పాదయాత్ర జయప్రదానికి అన్ని పార్టీలు, ప్రజాసంఘాలు మద్దతు, సంఘీభావం, సహాయ సహకారాలు అందించాలి. ఈ నెల 26న సంఘీభావ దినం పాటించాలని కోరుతున్నాం. జులై 1న ట్రేడ్ యూనియన్లు సంఘీభావం ప్రకటిస్తామని ముందుకొచ్చాయి..
నిద్ర లేపడానికే..
మొద్దు నిద్ర పోతున్న ప్రభుత్వాన్ని నిద్ర లేపడానికే మహా పాదయాత్ర అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి వెంకటేశ్వర్లు అన్నారు. లక్షా ఆరు వేల కుటుంబాలకు పరిహారం ఇచ్చాకనే ప్రాజెక్టు నుంచి నీళ్లివ్వాలన్నారు. అలా కాకపోతే తెగించి పోరాడతామన్నారు. గిరిజనులకు ఎర్ర జెండానే అండగా ఉంటుందన్నారు. మహా పాద యాత్ర విజయవంతం కావాలని సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పి సుదర్శన్ ఆకాంక్షించారు.
ప్రాజెక్టు కడతారన్నదగ్గర నుంచి నిర్వాసితులయ్యే గిరిజనులు, ఇతరుల పక్షాన పార్టీ పోరాడుతోందన్నారు. అప్పట్లో భద్రాచలంలో కాల్పులు జరిగాయని, ఆ కేసులు మొన్నటి వరకు ఉన్నాయన్నారు. సమస్య ఎ.పి.దే కాదని ఉమ్మడి రాష్ట్రానిదన్నారు. సభకు సిపిఎం రంపచోడవరం జిల్లా కార్యదర్శి బి కిరణ్ అధ్యక్షత వహించగా పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లా పార్టీ కార్యదర్శులు బి బలరాం, టి అరుణ్, ఎ రవి, పార్టీ, ప్రజాసంఘాల నాయకులు వేదికపై ఆశీనులయ్యారు.
పుస్తకావిష్కరణ
మహా పాదయాత్రను పురస్కరించుకొని 'పోలవరం' వివరాలతో పార్టీ ప్రచురించిన పుస్తకాన్ని విజ్జు క్రిష్ణన్, పాటల సి.డి.ని పి సుదర్శన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మంతెన సీతారాం మాట్లాడుతూ పాదయాత్ర అనేది గోదావరి చరిత్రలో పార్టీ చరిత్రలో ఒక చిన్న ప్రస్థానమన్నారు. కళ్లుండి చూడలేని, చెవులుండి వినలేని ప్రభుత్వాన్ని మన పోరు కేకతో కదిలించాలన్నారు. పాదయాత్రలో సమరోత్సాహంతో పాల్గొనాలని, ప్రభుత్వం స్పందించకపోతే పోరాటం ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. పాదయాత్రలో పాల్గొంటున్న వలంటీర్లతో వి శ్రీనివాసరావు ప్రతిజ్ఞ చేయించారు. గిరిజనుల సంప్రదాయ వేషధారణతో నాయకులు పార్టీ శ్రేణుల్లో జోష్ నింపారు. సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
వితరణలు
పాదయాత్ర విజయవంతానికి పశ్చిమగోదావరి సిపిఎం కమిటీ తరఫున రూ.50 వేలు, భద్రాద్రి-కొత్తగూడెం పార్టీ జిల్లా కమిటీ తరఫున రూ.10 వేలు అందించారు. పాదయాత్రలో పాల్గొనే వారికి రెయిన్ కోట్లు, గొడుగులను కాకినాడ మహిళాసంఘం అందించింది.
తొలిరోజు 16 కిలోమీటర్లు
పాదయాత్ర ప్రారంభమైన తొలి రోజు ఎటపాక మండలంలోని గ్రామాల్లో 16 కిలోమీటర్లు సాగింది. రాత్రి మురుమురు గ్రామంలో వలంటీర్లు బస చేశారు.










