న్యూఢిల్లీ : ఒడిశాలోని మేరమండలిలోని టాటాస్టీల్ కంపెనీలో బిఎఫ్‌పిపి2 పవర్‌ప్లాంట్ నుండి ఆవిరి లీకవడంతో అందులో పనిచేస్తున్న కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు టాటా స్టీల్ కంపెనీ ఓ ప్రకటనను విడుదల చేసింది. అయితే ఈ ప్రమాదంలో కార్మికులకు తీవ్ర గాయాలైనట్లు మీడియా కథనాల వెల్లడించాయి. ఇక ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో అస్వస్థతకు గురైన కార్మికులను ప్రాథమిక చికిత్స కోసం కంపెనీలో ఉన్న ఆరోగ్యకేంద్రానికి తరలించారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం క్షతగాత్రులను డాక్టర్స్, పారామెడిక్స్ అంబులెన్స్‌లో కటక్‌లోని ఆసుపత్రికి తరలించినట్లు టాటా కంపెనీ తెలిపింది. ఈ ప్రమాదంలో గాయపడిన కార్మికుల కుటుంబ సభ్యులను సంప్రదించామని, వారికి మద్దతునిస్తున్నామని టాటా కంపెనీ తెలిపింది. ఇక ఈ ఘటనపై సంబంధిత అధికారులతో దర్యాప్తు ప్రారంభిస్తామని టాటా కంపెనీ వెల్లడించింది.










