Sep 27,2023 12:16
  • టిడిపి రిలే దీక్ష శిబిరంలో నారా భువనేశ్వరి
  • చంద్రబాబుకు మద్దతుగా మహిళల నిరాహారదీక్ష

ప్రజాశక్తి - సీతానగరం(తూర్పుగోదావరి జిల్లా) : నిరంతరం ప్రజల కోసం ఆలోచించే మనిషిని జైలులో పెట్టారని టిడిపి అధినేత నారా చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. ఏలాంటి ఆధారాలు లేకుండా ఎలా అరెస్టు చేస్తారు? ఆరోపణల్లో నిజాలు తెలుసుకోరా? అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం జివికె కన్వెన్షన్‌ వద్ద బుధవారం మహిళలు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షా శిబిరానికి భువనేశ్వరి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. చంద్రబాబును అరెస్టు చేసిన తీరు చాలా బాధాకరమన్నారు. ఏ తప్పు చేయకున్నా 19 రోజులుగా అన్యాయంగా జైలులో నిర్బంధించారని తెలిపారు. ప్రజల సొమ్ము దోచుకుని దాచుకునే అలవాటు చంద్రబాబుకు లేదన్నారు. రూ.300 కోట్లు, రూ.400 కోట్లు అని చెప్తున్నారని, ఆ డబ్బులు ఎక్కడికిపోయాయని పోలీసులు, సిఐడి అధికారులు నేటికీ నిర్ధారణ చేయలేకపోయారని విమర్శించారు. శాంతియుతంగా నిరసనలు తెలిపినా కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టిడిపి రాజానగరం ఇన్‌ఛార్జి బొడ్డు వెంకటరమణ చౌదరి మాట్లాడుతూ.. అరెస్టులకు భయపడకుండా నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తూ చంద్రబాబుకు మద్దతుగా నిలవాలని కోరారు. ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చియ్యచౌదరి, నిమ్మకాయల చినరాజప్ప, మాజీ ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు, బొడ్డు భాస్కరరావు సతీమణి జగన్మోహిని, అమరావతి జెఎసి కొలికిపూడి శ్రీనివాసరావు, టిడిపి తూర్పుగోదావరి జిల్లా ఇన్‌ఛార్జి జవహర్‌, కార్యకర్తలు పాల్గొన్నారు.