బస్సెల్(స్విట్జర్లాండ్): స్విస్ ఓపెన్ సూపర్-300 బ్యాడ్మింటన్ టోర్నీ ప్రి క్వార్టర్‌ఫైనల్లోకి భారత స్టార్ షట్లర్లు పివి సింధు, హెచ్‌ఎస్ ప్రణయ్ రాయ్ ప్రవేశించారు. డిఫెండింగ్ ఛాంపియన్ పివి సింధు 21-9 21-16తో జెంజిరా స్టాడెల్మన్(స్విట్జర్‌లాండ్)ను వరుససెట్లలో చిత్తు చేసింది. తొలి గేమ్‌ను సునాయాసంగా గెలిచిన సింధు.. రెండో గేమ్‌లో స్థానిక క్రీడాకారిణినుంచి అనూహ్య ప్రతిఘటన ఎదురైంది. అయినా ఆ గేమ్‌ను చేజిక్కించుకొని సింధు సత్తా చాటింది. ప్రి క్వార్టర్స్‌లో సింధు.. ఒలింపిక్ విజేత ఇండోనేషియాకు చెందిన పుత్రి కుసుమ వర్దానీతో తలపడనుంది. ఇక పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ 9వ ర్యాంకర్ హెచ్‌ఎస్ ప్రణయ్ 21-17 19-21 21-17తో ఆల్ ఇంగ్లండ్ ఛాంపియన్‌షిప్ ఫైనలిస్ట్ షి యు కి(చైనా)పై గెలుపొందాడు. ప్రణయ్ ప్రి క్వార్టర్స్‌లో క్రిస్టో పొపోవ్(ఫ్రాన్స్)తో అమీ తుమీ తేల్చుకోనున్నాడు. మరో పోటీలో కిదాంబి శ్రీకాంత్ 20-22, 17-21తో కెనడాకు చెందిన లీ-చెక్-యూ చేతిలో, మిధున్ మంజునాథ్ 19-21, 19-21తో ఛియా-హో-లీ(చైనీస్ తైపీ) చేతిలో పోరాడి ఓడారు. ఇక పురుషుల డబుల్స్‌లో చిరాగ్‌శెట్టి-సాత్త్విక్ సాయిరాజ్ జోడీ 21-15, 21-18తో అమెరికా జోడీపై గెలిచి రెండోరౌండ్‌లోకి దూసుకెళ్లారు.










