Mar 23,2023 21:25
  • ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ ప్రపంచకప్‌ షూటింగ్‌

భోపాల్‌: ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ ప్రపంచకప్‌ షూటింగ్‌ పోటీల్లో భారత్‌కు నేడు ఒక రజత, ఇక కాంస్య పతకాలు దక్కాయి. గురువారం జరిగిన 10మీ. ఎయిర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ విభాగంలో సాంఘ్వాన్‌-థోమర్‌ జంట రజత పతకాన్ని సాధించగా.. 10మీ. ఎయిర్‌ రైఫిల్‌ విభాగంలో రుద్రాక్ష-నర్మద జోడీ కాంస్య పతకాన్ని గెలిచింది. 10మీ. ఎయిర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ విభాగంలో 19ఏళ్ల రైథమ్‌ సంఘ్వాన్‌ చివర్లో టార్గెట్‌ను ఛేదించడంలో విఫలమైంది. బుధవారం జరిగిన వ్యక్తిగత విభాగంలో 572పాయింట్లతో 13వ స్థానంలో నిలిచిన సంఘ్వాన్‌.. నేడు మిక్స్‌డ్‌ విభాగంలో మెరుగైన ప్రదర్శనను కనబరచడం విశేషం. ఇక వరుణ్‌ థోమర్‌ ప్రారంభం నుంచే టార్గెట్స్‌ను సంధిస్తూ రజత పతకం సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. ఈ విభాగంలో చైనాకు స్వర్ణ, కాంస్య పతకాలు దక్కాయి. ఇక 10మీ. ఎయిర్‌ రైఫిల్‌ మిక్స్‌డ్‌ విభాగంలో డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన రుద్రాక్ష బాలాసాహెబ్‌ పాటిల్‌-నర్మదా నితిన్‌ జోడీ కాంస్య పతకంతో సరిపుచ్చుకుంది. ఈ విభాగంలో చైనాకు స్వర్ణం, హంగేరీకి కాంస్య పతకాలు దక్కాయి. షూటింగ్‌ ప్రపంచకప్‌ పోటీల్లో భారత్‌ ఒక్కో స్వర్ణ, రజత, పతకాలతోపాటు రెండు కాంస్య పతకాలతో ఉండగా.. చైనా మూడు స్వర్ణ, రెండు రజతాలతో అగ్రస్థానంలో కొనసాగుతోంది.