Jul 21,2023 10:10
  • సిపిఎం డిమాండ్‌
  • విధాన అంశాలు ప్రభుత్వానికి నివేదిస్తా
  • వ్యక్తిగత, సామూహిక సమస్యల పరిష్కారానికి ప్రయత్నం
  • పోలవరం ప్రాజెక్టు స్పెషల్‌ కలెక్టర్‌ ప్రవీణ్‌ ఆదిత్య హామీ
  • ధవళేశ్వరంలో నిర్వాసితుల సమస్యలపై రెండవ సమావేశం

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి : పోలవరం ప్రాజెక్టు వాస్తవ ముంపు నిర్ధారణకు రీ సర్వే చేయాలని సిపిఎం డిమాండ్‌ చేసింది. నిరుడొచ్చిన వరదల తర్వాత లైడార్‌ సర్వే చేయగా తొలిదశగా చెపుతున్న +41 మీటర్ల కాంటూర్‌లో ఇంతకుముందు పేర్కొన్న ఆవాసాలకు అదనంగా 48 ఆవాసాలు చేర్చారని, ఈ అనుభవం రీత్యా రీ సర్వే చేయాలని కోరింది. కాగా విధాన పరమైన అంశాలను ప్రభుత్వానికి నివేదిస్తానని, నిర్వాసితులెదుర్కొంటున్న వ్యక్తిగత, సామూహిక సమస్యలను నిర్దిష్టంగా తెలిపితే తన పరిధిలో పరిష్కరించడానికి ప్రయత్నిస్తానని పోలవరం ప్రాజెక్టు స్పెషల్‌ కలెక్టర్‌ (అడ్మినిస్ట్రేటర్‌) ప్రవీణ్‌ ఆదిత్య హామీ ఇచ్చారు. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలోని పోలవరం ప్రాజెక్టు కార్యాలయంలో గురువారం పోలవరం నిర్వాసితులతో స్పెషల్‌ కలెక్టర్‌ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పోలవరం నిర్వాసితుల హక్కుల సాధన కోసం 'పోలవరం నిర్వాసితుల పోరుకేక' పేరిట సిపిఎం మహాపాదయాత్ర, ఈ నెల 4న విజయవాడలో మహాధర్నా నిర్వహించింది. స్పందించిన ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది. తొలి సమావేశం ఈ నెల 5న విజయవాడలో మంత్రి అంబటి రాంబాబు అధ్యక్షతన జరిగింది. రెండో భేటీ రాజమండ్రి పిఒ కార్యాలయంలో నిర్వహించాలని స్పెషల్‌ కలెక్టరుకు సూచించారు ఆ మేరకు గురువారం ధవళేశ్వరంలో సమావేశం జరిగింది. సిపిఎం నుంచి పాల్గొన్న పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు మాట్లాడుతూ కాంటూర్‌ లెక్కల ఆధారంగా నిర్ణయించిన ముంపు గ్రామాలను దాటి అదనపు ఆవాసాలకు నిరుడు వరదొచ్చిందని, రీ సర్వే చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ ఏడాది వరదలొస్తున్నాయని, నిర్వాసితులు భయాందోళనలో ఉన్నారని, ముందస్తు సహాయ, పునరావాస చర్యలు చేపట్టాలని కోరారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ 'వరదపై మీరు టెక్నికల్‌గా మాట్లాడుతున్నారు మేం ప్రాక్టికల్‌గా చెపుతున్నాం. మీ కాంటూర్‌ లెక్కలను విభేదిస్తున్నాం. ఫేజ్‌ వన్‌పై రీ సర్వే చేయాలి' అని అన్నారు. ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీకి 2013 భూసేకరణ చట్టం ప్రకారం ప్రాజెక్టు పూర్తయ్యే నాటి కటాఫ్‌ తేదీ పెట్టాలన్నారు. ఈ సమావేశం మొదటిదని సమస్యలు పరిష్కారమయ్యేవరకు వస్తూనే ఉంటామన్నారు. పిడిఎఫ్‌ ఎంఎల్‌సి కెఎస్‌ లక్ష్మణరావు మాట్లాడుతూ నిర్వాసితుల సమస్యలపై మనసు పెట్టాలని, వాళ్లు సుదీర్ఘ పాదయాత్ర చేశారని గుర్తు చేశారు. మరో ఎంఎల్‌సి ఐ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ నిర్వాసితులు సమస్యలు చెప్పుకోడానికి ఈ సమావేశం మంచి వేదికని, వారి ఇబ్బందులు అర్థమయ్యాయని తెలిపారు. సిపిఎం రంపచోడవరం కార్యదర్శి బి.కిరణ్‌, తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి టి.అరుణ్‌, ముంపు మండలాల నుంచి వచ్చిన సిపిఎం ప్రతినిధులు, నిర్వాసితులు సమస్యలను స్పెషల్‌ కలెక్టర్‌ దృష్టికి తీసుకొచ్చారు.
 

                                                                ప్రాధాన్యతాక్రమంలో ఆర్‌ అండ్‌ ఆర్‌

మూడు గంటలకుపైగా వాటన్నింటినీ ఓపిగ్గా విన్న స్పెషల్‌ కలెక్టర్‌ ప్రవీణ్‌ ఆదిత్య సానుకూలంగా స్పందించారు. సమస్యలను గుర్తించే తాజాగా లైడార్‌ సర్వే చేసి +41 కాంటూర్‌లో అదనంగా 48 ఆవాసాలను ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ అమలుకు ప్రాధాన్యత కల్పించాం. కేంద్రం అంగీకరించాలి. బడ్జెట్‌ నిధులు అందుబాటు బట్టి తొలిదశ నిర్వాసితులకు పరిహారం వేస్తున్నాం. ప్రాజెక్టు ఎఫ్‌ఆర్‌ఎల్‌ గ్రామాలన్నింటికీ దశలవారీగా ప్రాధాన్యతా క్రమంలో ఆర్‌ అండ్‌ ఆర్‌ అమలు చేస్తాం. గిరిజనులకు భూమికి భూమి పరిహారంపై సాగులో ఉండి డి ఫామ్‌ పట్టాలు కూడా లేని వారిని గ్రామ సభ తీర్మానం చేసి పంపితే పరిశీలిస్తాం. పోడు, ఆర్‌ఒఎఫ్‌ఆర్‌ భూములకూ పరిహారం ఇవ్వాలని 2013 భూసేకరణ చట్టంలో ఉన్నప్పటికీ రూల్స్‌ రాలేదు. కేంద్రానికి రాశాం. నిర్వాసితులకు సాగు భూమి చూపించాల్సిన బాధ్యత అధికారులదే. ప్రాజెక్టు ఎఫ్‌ఆర్‌ఎల్‌, వరద వేర్వేరు. ఎఫ్‌ఆర్‌ఎల్‌ ప్రాతిపదికన 371 ఆవాసాలను ముంపు గ్రామాలుగా ప్రకటించాం. అదనంగా ఏ గ్రామాన్నీ చేర్చడానికి వీలు లేదు. ఇంటి పట్టాల్లో పేర్కొనే కండీషన్లపై స్పష్టత కోసం ప్రభుత్వానికి రాశాం. ఆవాసాల్లో సౌకర్యాలకు సంబంధించి పంచాయతీ డీనోటిఫై, నోటిఫైలపై కూడా ప్రభుత్వానికి రాశాం. పునరావాస కాలనీల్లో తాగునీటి సమస్యను తక్షణమే పరిష్కరిస్తాం. నాణ్యత లేకుండా ఇళ్లను నిర్మించిన కాంట్రాక్టర్లపై చర్యలకు ఆదేశించాం. శ్మశానాల కోసం 30-40 ఎకరాలను గుర్తించాం. ఇంకా ఓనర్లకు పేమెంట్‌ చేయలేదు. మ్యూటేషన్‌ అయిన వ్యవసాయ భూములకు సచివాలయంలో దరఖాస్తులు చేసుకుని పట్టాదార్‌ ప్యాస్‌బుక్స్‌ పొందవచ్చు. అర్హత ఉండి ఆర్‌ అండ్‌ ఆర్‌ అందని నిర్వాసితులు నన్ను నేరుగా కలవొచ్చు...