Jul 01,2023 21:40
  • మూడు రెట్లు పెరిగిన లాభాలు

న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ బ్యాంక్‌లు మెరుగైన ప్రగతిని కనబర్చాయని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. స్థిరమైన రేటింగ్‌ ఔట్‌లుక్‌ ఉన్నప్పటికీ కొన్ని ప్రపంచ స్థాయి బ్యాంకులు కుప్పకూలాయన్నారు. శనివారం న్యూఢిల్లీలో పంజాబ్‌ అండ్‌ సింద్‌ బ్యాంక్‌ కొత్త కార్పొరేట్‌ కార్యాలయ ప్రారంభోత్సవంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. మేనేజ్‌మెంట్‌లో వృత్తి నైపుణ్యం కారణంగా భారతీయ బ్యాంకులు బాగా పని చేస్తున్నాయన్నారు. ''2022-23 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల నికర లాభం దాదాపు మూడు రెట్లు పెరిగి రూ.1.04 లక్షల కోట్లకు చేరుకుంది. ఆర్థిక సంవత్సరం 2023-24లో భారతీయ బ్యాంక్‌ల స్థూల నిరర్థక ఆస్తులు (ఎన్‌పిఎ)లు 3.8 శాతానికి తగ్గి.. దశాబ్ద కనిష్టానికి దిగిరావొచ్చని అంచనా.'' అని సీతారామన్‌ పేర్కొన్నారు. బ్యాంక్‌ల రిటర్న్‌ ఆన్‌ అసెట్‌, నికర వడ్డీ మార్జిన్‌, ప్రొవిజనింగ్‌ కవరేజ్‌ రేషియో వంటి అన్ని కీలకమైన పారామీటర్‌లలో మెరుగుదల కనిపించిందన్నారు. వివేకవంతమైన లిక్విడిటీ నిర్వహణను మరింత మెరుగుపర్చుకోవాలని బ్యాంక్‌లకు మంత్రి సూచించారు. రెగ్యులేటరీ నిబంధనలకు కట్టుబడి ఉండాలని, బలమైన అసెట్‌ లయబిలిటీ, రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ అంశాలపై దృష్టి పెట్టాలని ఆమె బ్యాంకులను కోరారు. ఈ ఏడాది ప్రారంభంలో అమెరికాలోని సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌ పతనం తర్వాత ప్రభుత్వ రంగ బ్యాంకులు అప్రమత్తంగా ఉండాలని, ఒత్తిడి పాయింట్లను గుర్తించాలని సూచించామని సీతారామన్‌ పేర్కొన్నారు. కొత్త వ్యూహాలను రూపొందించడానికి ఈ సంఘటనను ఒక అవకాశంగా ఉపయోగించుకోవాలని బ్యాంక్‌లను కోరామన్నారు.