- ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ టోర్నీ
లండన్: ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ టోర్నీలో లక్ష్యసేన్, హెచ్‌ఎస్ ప్రణయ్ రాయ్ శుభారంభం చేశారు. మంగళవారం జరిగిన తొలిరౌండ్ పోటీలో లక్ష్యసేన్ 5వ ర్యాంకర్ ఛో-టిన్-చెన్‌పై, ప్రణయ్ రాయ్.. టిడబ్ల్యు వాంగ్‌పై చెమటోడ్చి నెగ్గారు. లక్ష్యసేన్ 21-18, 21-19తో చైనీస్ తైపీకి చెందిన ప్రపంచ 5వ ర్యాంకర్ ఛో-టిన్-చెన్‌పై గెలుపొందగా.. మరో పోటీలో ప్రణయ్ రాయ్ 21-19, 22-20తో చైనీస్ తైపీకే చెందిన వాంగ్ వరుససెట్లలో గెలిచారు. ప్రణయ్ ప్రత్యర్ధిపై గెలిచేందుకు 49నిమిషాలసేపు పోరాడాల్సి వచ్చింది. తొలిగేమ్ అర్ధభాగం ముగిసే సమయానికి ప్రణయ్ 11-4 ఆధిక్యతలో, ఆ తర్వాత 18-12 ఆధిక్యతలో నిలిచినా.. చివర్లో గేమ్‌ను చేజిక్కించుకొనేందుకు పోరాడాల్సి వచ్చింది. ఇక రెండో గేమ్‌లో ప్రణయ్ ఓ దశలో 16-19తో వెనుకబడ్డాడు. ఈ క్రమంలో అద్భుతంగా పుంజుకొని ఆ గేమ్‌ను 22-20తో గెలిచి మ్యాచ్‌ను ముగించాడు. దీంతో ప్రణయ్ ముఖాముఖి పోటీలో 5-3 ఆధిక్యతలో నిలిచాడు. 30ఏళ్ల కేరళకు చెందిన ప్రణయ్ రెండోరౌండ్‌లో ఇండోనేషియాకు చెందిన ఆంటోనీ సినీసుక-వాంగ్ ఛరోన్(థాయ్ లాండ్) మధ్య పోటీ విజేతతో తలపడనున్నాడు. ఇతర పోటీల్లో గింటింగ్(ఇండోనేషియా) 21-17, 21-19తో వాంగ్‌ఛరోన్(థాయ్ లాండ్)పై గెలిచి రెండోరౌండ్‌లోకి దూసుకెళ్లాడు.
ఇక మహిళల సింగిల్స్‌లో సైనా నెహ్వాల్ టోర్నీ నుంచి నిష్క్రమించగా.. పురుషుల డబుల్స్‌లో చిరాగ్‌శెట్టి-సాత్త్విక్ సాయిరాజ్ జోడీకి తొలిరౌండ్‌లో బై లభించింది. మరో సింగిల్స్ పోటీలో చైనాకు చెందిన చెన్-యుఫీ 22-20, 21-14తో కెనడాకు చెందిన మిఛ్ఛెలిపై గెలిచి రెండోరౌండ్‌లోకి దూసుకెళ్లింది.











