Jul 03,2022 10:16

'తెల్లవాడి గుండెల్లో నిదురించిన వాడ..
మా నిదురించిన పౌరుషాగ్ని రగిలించిన వాడ
త్యాగాలే వరిస్తాం.. కష్టాలే భరిస్తాం..
నిశ్చయముగా.. నిర్భయముగా.. నీ వెంటనే నడుస్తాం..

మన్యం వీరుడు అల్లూరి పోరాట స్ఫూర్తితో గత 15 ఏళ్లుగా పోలవరం నిర్వాసితులు తమ జీవన పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడిగా చెప్పే పోలవరం ప్రాజెక్టు కింద దాదాపు లక్ష 50 వేల కుటుంబాలు ముంపుకు గురవుతున్నాయి. వీరిలో అత్యధికులు ఆదివాసీలే. అనేక తరాల నుండి అడవిని నమ్ముకుని జీవిస్తున్న వీరిని ఆ అడవితల్లి నీడ నుండి గోదారమ్మ ఒడ్డు నుండి దూరం చేస్తున్న పాలకుల నిరంకుశ విధానాలపై వివిధ రూపాల్లో పోరాడారు.. నేటికీ పోరాడుతున్నారు.
ఈ ప్రాజెక్టు 2005లో శంకుస్థాపన చేసిన నాటి నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఆనాటి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కూనవరం, వి ఆర్‌ పురం, చింతూరు, ఎటపాక, కుక్కునూరు, వేలేరుపాడు, భద్రాచలంతో పాటు ఉభయ గోదావరి జిల్లాలోని పోలవరం, దేవీపట్నం మండలాల నిర్వాసితులు పోరాటం ప్రారంభించారు. గ్రామాల్లో సర్వేకు అధికారులు రావద్దని గ్రామం బయట బోర్డులు పెట్టి, అధికారులను అడ్డుకున్నారు. 2007 జనవరి 9న వేలాది మంది సిపిఎం నాయకత్వంలో భద్రాచలంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. ఆనాటి రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం పోలీసులను ప్రయోగించి, కాల్పులు జరిపింది. పదుల సంఖ్యలో తుపాకీ తూటాలకు గాయపడ్డారు. ఈ పోరాటానికి ఎర్రజెండా ముద్దుబిడ్డలు, ఆదివాసీ ఉద్యమ నేతలు కుంజా బొజ్జి, సున్నం రాజయ్య, మిడియం బాబూరావు నాయకత్వం వహించారు. ప్రభుత్వం అనేకమందిపైన అక్రమ కేసులు పెట్టి, దాదాపు 15 ఏళ్లు కోర్టుల చుట్టూ తిప్పింది. ఎట్టకేలకు 2022లో కేసు కొట్టేశారు. ఆ తర్వాత భద్రాచలం మొదలుకుని పోలవరం, దేవిపట్నం దాకా కొండలు, కోనలు దాటుకుంటూ పాదయాత్ర జరిగింది. గ్రామ సభలు, సైకిల్‌ యాత్రలు, ధర్నాలు నిరసనలు ఇలా అనేక రూపాల్లో పోరాటం సాగింది.
రాష్ట్ర విభజన తర్వాత ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఆరు మండలాలు ఆంధ్రప్రదేశ్‌లో కలిసాయి. నిర్వాసిత గ్రామాలు ఎలాగో మునిగిపోతాయి కాబట్టి పాలకులు అభివద్ధిని నిలిపేశారు. రాష్ట్ర విభజన తర్వాత ఆయా ముంపు మండలాల బడుల్లో టీచర్లు లేరు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సిబ్బంది లేరు, ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు లేరు, గ్రామాల్లో మంచినీటి బోర్లు రిపేర్లు కాలేదు, రోడ్ల నిర్మాణాలు లేవు. ఈ నేపథ్యంలో సిపిఎం ఆధ్వర్యంలో నాటి భద్రాచలం శాసనసభ్యుడు సున్నం రాజయ్య నాయకత్వంలో 2016లో 30 రోజులు 500 కిలోమీటర్ల ముంపు మండలాల్లో పాదయాత్ర జరిగింది. ముగింపు సభలో వేలాదిమంది ఆదివాసీలు, నిర్వాసితులు పాల్గొన్నారు. సిపిఎం అగ్రనేత బందాకారత్‌, నాటి రాష్ట్ర కార్యదర్శి పి మధు పాల్గొన్న ఆ సభ పోరాటానికి ఉత్సాహాన్ని ఇచ్చింది. దీని ఫలితంగా టీచర్లు, ఉద్యోగుల నియామకం జరిగింది. చింతూరు కేంద్రంగా ఐటిడిఎ వచ్చింది. గ్రామాల్లో కొంతమేరైనా అభివద్ధి పనులు జరిగాయి.
పోలవరం మండలంలో నిర్వాసితులకు పునరావాసం కల్పించకుండా గ్రామాలు ఖాళీ చేయిస్తున్న ప్రభుత్వ విధానాన్ని నిరసిస్తూ ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో వాహనాలను ఆదివాసీలు అడ్డుకున్నారు. ఉదయం ప్రారంభమైన పోరాటం రాత్రి వరకూ సాగింది. పోలీసులు బలవంతంగా అరెస్టులు చేశారు. మాజీ పార్లమెంట్‌ సభ్యులు మిడియం బాబూరావుతో నాయకులపై కేసులు బనాయించారు. 2017లో చింతూరు మండలం చట్టి హైవే పైన ఆంధ్రా తెలంగాణ, ఛత్తీస్‌ఘడ్‌ సరిహద్దుపైన రెండు వేల మందితో మండుటెండలో బైటాయింపు జరిగింది. 2018లో అన్ని ముంపు మండలాల్లో రోడ్ల బంద్‌లు, ముట్టడి కార్యక్రమాలు నిరంతరాయంగా జరిగాయి.
పునరావాసం పూర్తి చెయ్యకుండా గోదావరికి అడ్డంగా రెండు కిలోమీటర్ల పొడవున కాపర్‌ డ్యామ్‌ నిర్మాణం చెయ్యడం వల్ల 2019, 20, 21 సంవత్సరాల్లో వచ్చిన వరదలకు ఎనిమిది మండలాల్లో పెద్ద ఎత్తున నిర్వాసితులు ముంపునకు గురయ్యారు. ప్రభుత్వం చెప్పే కాంటూరు కాకి లెక్కలను మించి గ్రామాలు వరద నీటిలో మునిగాయి. నెలల తరబడి ముంపు నీటిలో గ్రామాలు ఉండాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో సిపిఎం ముంపు గ్రామాల్లో బియ్యం, కిరోసిన్‌ లాంటి నిత్యావసరాలు పంపిణీ చేసింది. పడవలపై గ్రామాలు తిరిగి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేర్చే కృషి చేసింది. పునరావాస శిబిరాల్లో ఉన్న ఆదివాసీ నిర్వాసితులను సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు వి. శ్రీనివాసరావు కలుసుకుని, ధైర్యం చెప్పారు. 2021 జూన్‌లో నిర్వాసితుల పోరాట కమిటీ ఏర్పాటు చేసి, నాటి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు నాయకత్వంలో అఖిలపక్షం నాయకులు ముంపు గ్రామాల్లో పర్యటనలు చేసి, నిర్వాసితులకు అండగా నిలబడ్డారు. పోలవరం, దేవిపట్నం కేంద్రాల్లో నిర్వాసితులతో సభలు నిర్వహించారు. 2021లో రాష్ట్ర రాజధాని విజయవాడలో, దేశ రాజధాని ఢిల్లీలో అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడంతో నిర్వాసితుల గోడు ప్రజల ముందుకు వచ్చింది. 2021 సెప్టెంబర్‌ 17న సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకారత్‌, పి.మధు ఇతర వామపక్ష, అఖిలపక్ష నాయకులు మరోసారి పోలవరం ముంపు గ్రామాల్లో పర్యటించారు. విఆర్‌ పురం కేంద్రంలో రెండు వేల మందితో బహిరంగసభ నిర్వహించారు. ఎనిమిది ముంపు మండలాల్లో సచివాలయాల ముట్టడి, మండల కేంద్రాల్లో నిరసనలు, కె ఆర్‌ పురం, చింతూరు, రంపచోడవరం ఐటిడిఎ కేంద్రాల్లో నిరసనలు జరిగాయి. గ్రామ స్థాయిలో పునరావాస సర్వేల నుండి వారి బ్యాంక్‌ అకౌంట్లలో ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజి డబ్బులు పడే వరకు, నిర్వాసిత కాలనీల నిర్మాణంలో ఇలా ప్రతి సందర్భంలోనూ ప్రజల పక్షాన నిరంతర పోరాటం సాగుతోంది.
ఇప్పుడు పోలవరం నిర్వాసితులకు అందే ప్రతి రూపాయి, ప్రతి ఇల్లు ఏదయినా నిర్వాసితులు పోరాడి సాధించుకున్నవే. ఇన్ని సంవత్సరాలు, ఇన్ని రూపాల్లో పోరాటం జరిగినా నిర్వాసితుల పునరావాసం ఇంకా 10 శాతం కూడా పూర్తికాలేదు. ప్రభుత్వాలకు ఆదివాసీల పట్ల ఉన్న ప్రేమ ఎంతటిదో దీన్నిబట్టే అర్థమవుతోంది. ముఖ్యంగా గత ఎనిమిదేళ్లుగా ఈ ప్రాజెక్ట్‌ కింద మునిగిపోయే నిర్వాసితులకు, అందులోనూ ఆదివాసీలకు తీవ్ర అన్యాయం, ద్రోహం చేసింది ఈ ప్రాజెక్టుకు నిధులు ఇవ్వని కేంద్ర ప్రభుత్వం బిజెపియే.

- టి. అరుణ్‌
సిపిఎం తూర్పు గోదావరి జిల్లా కార్యదర్శి