అర్హత కలిగిన వారికి అన్యాయం జరగదు : మంత్రి సురేష్
పజాశక్తి-పెద్దారవీడు (ఒంగోలు) :త్వరలో పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టును సిఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభిస్తారని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ తెలిపారు. నిర్వాసితులకు ప్యాకేజీ ఇచ్చేందుకు కసరత్తు జరుగుతోందని చెప్పారు. ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలంలోని దేవరాజుగట్టులో శుక్రవారం సచివాలయ కన్వీనర్ల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వెలిగొండ కోసం సర్వం త్యాగం చేసిన నిర్వాసితుల్లో ఏ ఒక్కరికీ అన్యాయం జరగదని భరోసానిచ్చారు. ఆ గ్రామ వాసిగా ఏ చిన్న ఆధారం ఉన్నా... ప్యాకేజీ ఇవ్వనున్నట్లు తెలిపారు. కలెక్టర్, స్పెషల్ కలెక్టర్లకు తాను ఇదే విషయం చెప్పానని, ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని నిర్వాసితులకు ధైర్యం చెప్పారు. అర్హత ఒక్కటే ప్రామాణికంగా తీసుకుని సంక్షేమ పథకాలు అందజేస్తున్నట్లు తెలిపారు. తమలో ఎన్ని గ్రూపులున్నా ఎన్నికల నాటికి కలిసి నడుస్తామన్నారు. వైసిపిని ఎదుర్కొనలేకనే టిడిపి-జనసేన ఒక్కటవుతున్నాయని ఎద్దేవా చేశారు. ఆ ఇద్దరే కాదు... ఇంకెందరు కలిసినా సిఎం జగన్‌మోహన్‌రెడ్డిని మరోసారి అధికారంలోకి రాకుండా అడ్డుకోలేరన్నారు. టిడిపి నేత లోకేష్ పాదయాత్రతో ప్రజల్లోకి రావాలని చూస్తున్నారని, ఆయన పాదయాత్ర చేసినా ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు.










