Jun 02,2023 14:00

చందర్లపాడు (ఎన్‌టిఆర్‌) : మండలంలోని కొడవటికల్లు గ్రామంలో శుక్రవారం కౌలు రైతుల సంఘం పాదయాత్రను జయప్రదం చేయాలని కోరుతూ ... కౌలు రైతుల సంఘం చందర్లపాడు మండల కమిటీ ఆధ్వర్యంలో గోడ పత్రిక ఆవిష్కరించటం జరిగింది. ఈ సందర్భంగా కౌలు రైతుల సంఘం జిల్లా కార్యదర్శి చనుమోలు సైదులు మాట్లాడుతూ ... ఈనెల 12 న మంగళగిరి సిసిఎల్‌ఏ కార్యాలయంకు వద్ద రాయబార పాదయాత్ర జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కోటి మందికి పైగా ఉన్న కౌలు రైతులకు 2019 పంట సాగు దారుల చట్టం ప్రకారం గుర్తింపు కార్డు మంజూరుకు భూ యజమాని సంతకం తప్పనిసరి అనే నిబంధనలతో ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో చట్టంలో మార్పులు చేసి కౌలు రైతుకు సులభంగా గుర్తింపు కార్డు మంజూరు, భూ యజమాని సంతకం తొలగింపు సాధనే లక్ష్యంగా కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో వచ్చే నెల 5 నుండి 10వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రచార జాతాలు, సచివాలయాలు, తహశీల్దార్‌ కార్యాలయాల వద్ద వినతిపత్రాలు ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు. పంట ఋణాలు, రాయితీ ఎరువులు విత్తనాలు, పంట నష్టపోతే పరిహారం దక్కక కౌలు రైతులకు అడుగడుగునా కష్టాల సాగు తప్పడం లేదని ఎద్దేవాచేశారు. భూ యజమాని సంతకం తప్పనిసరి అయిన నేపథ్యంలో కౌలు రైతులకు గుర్తింపు కార్డు రావడం లేదని భూ యజమాని సంతకంతో పని లేకుండా గ్రామ సచివాలయం రైతు భరోసా కేంద్రాల సిబ్బంది సంయుక్తంగా గ్రామ సభలు నిర్వహించి అసలైన కౌలు రైతులకు గుర్తింపు కార్డులు, పంట ఋణాలు, భీమా, ఈ క్రాప్‌, రాయితీపై ఋణాలు, పంట అమ్ముకునేందుకు ఇబ్బందులు లేకుండా చూడాలని , ప్రకఅతి వైపరీత్యాలతో పంట నష్టం వాటిల్లితే పరిహారం సౌకర్యం కల్పించి కౌలు రైతుల ఆత్మహత్యలు నివారించాలని డిమాండ్‌ చేశారు. 10 న ప్రారంభం కానున్న పాదయాత్ర ప్రారంభ సభ 11 విజయవాడ చేరుకొని 12న ప్రకాశం బ్యారేజ్‌ మీదుగా మంగళగిరిలోని సిసిఎల్‌ఎ కార్యాలయం వద్ద జరుగుతున్న రాయబారం యాత్రను కౌలు రైతులందరూ జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కౌలు రైతుల సంఘం మండల అధ్యక్షుడు జి ఏడుకొండలు,రాయిడి వెంకటేశ్వరరావు, జంపాని అశోక్‌, వేగినేటి చందు, మాదాల నరసింహారావు, షేక్‌ నాగులు, కందుల శ్రీనివాసరావు, వేగినేటి సాంబశివరావు,నలజాల హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.