Mar 22,2023 12:06

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : జాతీయ వృద్ధి రేటు వచ్చే ఏడాది గణనీయంగా క్షీణించనుంది. 2023లో ఏడు శాతంగా భావిస్తున్న ఈ వృద్ధి 2024లో ఏకంగా ఒక శాతం తగ్గిపోనుంది. ద్రవ్యోల్బణం మాత్రం ఊరటనిచ్చేదిగానే అధికారులు భావిస్తున్నారు. తాజాగా వృద్ధి, ఇతర అంశాలపై ప్రముఖ విశ్లేషణ సంస్థ క్రిసిల్‌ విడుదల చేసిన గణాంకాలు కొంత ఆందోళనకరంగానే ఉన్నట్లు నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా మారుతున్న రాజకీయ పరిస్థితులే దీనికి కారణంగా క్రిసిల్‌ అభిప్రాయపడింది. ఇటీవలే దేశ వృద్ధి రేటు ఏడు శాతంగా ఉంటుందని పలు ఆర్థిక సంస్థలు అంచనా వేశాయి. ఇది కొరత ఊరట కలిగించేదే అయినప్పటికీ వచ్చే ఏడాది మాత్రం ఆరు శాతానికి వృద్ధి తగ్గిపోతుందని క్రిసిల్‌ నిపుణులు చెబుతుండడం ఆందోళన కలిగిస్తోంది. దేశం నుంచి ఇతర ప్రాంతాలకు ఎగుమతులు తగ్గడం వల్ల వ్యతిరేక ప్రభావం ఉంటుందన్న భావాన్ని క్రిసిల్‌ వ్యక్తం చేసింది. ప్రధానంగా రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం, అమెరికా వంటి దేశాల్లో ఆర్థిక పరిస్థితి క్షీణించడం కూడా ఇందుకు కారణంగా అభివర్ణిస్తున్నారు. 2023లో 6.8 శాతం ద్రవ్యోల్బణం అంచనా వేయగా, 2024లో ఇది ఐదు శాతానికి తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. వినియోగదారులు కొనుగోలు చేసే సరుకుల ధరలు తగ్గడం ద్వారా ఇది సాధ్యమవుతురదని నిపుణులు చెబుతున్నారు.